Big Stories

Telangana : కాంగ్రెస్ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ.. రాహుల్ , ప్రియాంక వ్యూహమిదేనా..?

Telangana Politics(Congress news latest) : కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఇక కాంగ్రెస్ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ. కర్ణాటక ఫార్ములాతోనే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న లక్ష్యంతో వ్యూహాలు రచిస్తోంది. కర్ణాటకలో ఏడాది క్రితం వరకు బీజేపీ బలంగానే ఉంది. కానీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో రాష్ట్రంలో సీన్ మారింది. బసవరాజ్ బొమ్మై సర్కార్ అవినీతిని ఎండగడుతూ ముందుకు సాగారు రాహుల్. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపారు. మరోవైపు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పార్టీ నేతల మధ్య ఐకమత్యం తీసుకొచ్చారు. సీనియర్ నేత సిద్ధరామయ్యతో కలిసి పనిచేశారు. సిద్ధూ-డీకే కాంబినేషన్ సూపర్ హిట్ అయ్యింది.

- Advertisement -

ఎన్నికల ప్రచారంలోనూ బీజేపీని కాంగ్రెస్ డామినేట్ చేసింది. ప్రియాంక గాంధీ ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మోదీ రోడ్ షోలకు మించి ప్రియాంకకు ప్రజల నుంచి ఆదరణ లభించింది. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు అవసరాన్ని ప్రజలకు వివరించారు. ఇలా సోనియా కుటుంబం తమదైన వ్యూహంతో కాంగ్రెస్ కు గెలుపుబాటలు వేసింది. కర్ణాటక రాష్ట్ర నాయకత్వం అంతే కసిగా పనిచేసింది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత కాంగ్రెస్ వ్యూహాత్మకంగా మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఐదు హామీలతో ప్రజల్లో నమ్మకాన్నికలిగించింది. ఫలితమే ఎన్నికల్లో భారీ విజయం.

- Advertisement -

ఇప్పుడు కర్ణాటక పరిస్థితులే తెలంగాణలో ఉన్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న టార్గెట్ పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. గతేడాది రాహుల్ గాంధీ వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్నదాతల కోసం ఏం చేస్తామో స్పష్టం చెప్పారు. రైతు రుణమాఫీ ప్రకటించారు. దీంతో రైతుల్లో పార్టీకి ఆదరణ పెరిగింది. ఆ తర్వాత తెలంగాణలో భారత్ జోడో యాత్రలో సామాన్యులను కలిశారు. వారి కష్టాలు తెలుసుకున్నారు. కార్నర్ సభల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.

ఇటీవల ప్రియాంక గాంధీ హైదరాబాద్ సరూర్ నగర్ లో నిర్వహించిన నిరుద్యోగ నిరసన సభలో పాల్గొని.. యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యువత కోసం చేపట్టే కార్యక్రమాలు ప్రకటించారు. ప్రియాంక సభ తర్వాత కాంగ్రెస్ లో మరింత జోష్ పెరిగింది. అటు రైతులు, ఇటు యువత కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నారు.

మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీలో ఐకమత్యం తీసుకొచ్చేందుకు తానే ముందడుగు వేశారు. కర్ణాటకలో డీకే శివకుమార్ పోషించిన రోల్.. ఇక్కడ రేవంత్ పోషిస్తున్నారు. అవసరమైతే ఒక్క అడుగుకాదు 10 అడుగులు కిందకు దిగుతానని ఇటీవల స్టేట్ మెంట్ ఇచ్చారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిన నేతలు తిరిగి సొంతిగూటికి చేరుకోవాలని ఆహ్వానించారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ బలం మరింత పెరిగింది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ నుంచి చాలామంది నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకునే యోచనలో ఉన్నారు.

రాష్ట్రంలో మరో 6 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాహుల్, ప్రియాంక తెలంగాణపైనే ఫోకస్ చేస్తున్నారు. అవసరమైనప్పుడు సోనియా గాంధీ రంగంలోకి దిగుతారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను గెలిపించాలనే సెంటుమెంట్ జనంలోనూ ఉంది. ప్రస్తుతం ఉన్న సానుకూల వాతావరణాన్ని కాంగ్రెస్ వినియోగించుకుంటే రాష్ట్రంలో అధికారం రావడం ఖాయమనే అంచనాలున్నాయి. మరి కర్ణాటక మ్యాజిక్కే తెలంగాణలోనూ రిపీట్ అవుతుందా..?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News