Big Stories

Karnataka : నేడు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే ప్రమాణస్వీకారం..

Karnataka : కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నేడు కొలువుదీరనుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమం కోసం బెంగళూరు కంఠీరవ మైదానాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. ఇదే సమయంలో 10 మంది మంత్రులు ప్రమాణం చేస్తారని తెలుస్తోంది.

- Advertisement -

ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లి వారిని ఆహ్వానించారు. ఇదే సమయంలో కేబినెట్ కూర్పుపైనా చర్చించారు. మంత్రివర్గంలో ఎవరికి చోటుదక్కుతుందో వెల్లడికాలేదు. కొత్త మంత్రుల పేర్లు శనివారం ప్రకటిస్తామని శివకుమార్‌ తెలిపారు. ఢిల్లీ వెళ్లటానికి ముందు కంఠీరవ స్టేడియంలో ఏర్పాట్లను డీకే పరిశీలించారు.

- Advertisement -

దేశంలో విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు కాంగ్రెస్ చేపట్టింది. కాంగ్రెస్ భావాలతో ఏకీభవించే బీజేపీయేతర పార్టీల నేతలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. ప్రతిపక్షాల ఐక్యతను, బలాన్ని చాటే చెప్పేందుకు ఈ వేదికను ఉపయోగించుకోవాలని భావిస్తోంది.

బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మతాబెనర్జీ ప్రతినిధిగా టీఎంసీ నేత కాకోలి ఘోష్‌ దస్తిదార్‌ హాజరవుతారు. మరోవైపు కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి కేరళ సీఎం పినరయి విజయన్‌ను ఆహ్వానించకపోవడంపై ఆ రాష్ట్రంలోని వామపక్ష ప్రజాస్వామ్య కూటమి విమర్శలు గుప్పించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News