BigTV English

BJP: బండి పాయే.. రెడ్డి వచ్చే.. బీజేపీ వ్యూహం ఇదేనా?

BJP: బండి పాయే.. రెడ్డి వచ్చే.. బీజేపీ వ్యూహం ఇదేనా?
ts bjp

Telangana bjp news today(Telugu news headlines today): ప్రచారమే నిజమైంది. తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు జరిగాయి. ఏకంగా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌పైనే వేటు పడింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు ఇచ్చారు. ఈటల రాజేందర్‌కు కీలకమైన ఎన్నికల కమిటీ బాధ్యతలు అప్పగించారు. అయితే, ముందస్తు ప్రచారం జరిగినట్టు కిషన్‌రెడ్డిని కేబినెట్ నుంచి తీసేయకపోవడం.. బండి సంజయ్‌కు సైతం కేంద్రమంత్రి పదవి ఇవ్వకపోవడం రాజకీయంగా ఆసక్తికరం. మరి, మార్పు మంచిదేనా? ఇక అంతా పాజిటివేనా? బీజేపీ మళ్లీ దూసుకుపోతుందా?


తెలంగాణ బీజేపీపై బండి మార్క్..
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ అత్యంత సమర్థవంతంగా పని చేశారనే చెప్పాలి. బండి హయాంలో పార్టీకి మునుపెన్నడూ లేనంత జోష్ వచ్చింది. కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అన్నారు. ఘాటైన విమర్శలు చేశారు. జైలు తప్పదని భయపెట్టారు. కార్యకర్తల్లో ధీమా కల్పించారు. తెలంగాణలో నెంబర్ 2 స్థాయికి పార్టీని ఉరకలెత్తించారు. ఈ క్రమంలో కేసుల పాలయ్యారు. జైలుకు కూడా వెళ్లారు. సుదీర్ఘ పాదయాత్రలు చేశారు. పార్టీని బలోపేతం చేశారు. భారీ బహిరంగ సభలను సక్సెస్ చేశారు. మోదీ, షా, నడ్డాలతో శభాష్ అని కూడా అనిపించుకున్నారు. అయినా.. ఆయనపై వేటు పడింది. పార్టీ బాధ్యతల నుంచి తప్పించింది అధిష్టానం. ఎందుకు?

బండిపై వేటుకు కారణమిదేనా?
అంతా బాగున్నా.. బండి నాయకత్వంలో పార్టీ దూసుకుపోతున్నా.. ఆయన ఆధిపత్య తీరుపై హైకమాండ్‌కు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వచ్చిపడ్డాయి. బీజేపీ బాస్‌గా అంతాతానే అన్నట్టు ఒంటెత్తు పోకడలు పోయారంటున్నారు. మిగతా నేతలను కలుపుకొని పోలేదని చెబుతారు. బండి వల్లే.. పార్టీలో గ్రూపులు తయారయ్యాయని.. ఎవరికి వారే అన్నట్టు నేతలు సైడ్ అయ్యారని అంటారు. నాయకుడు ఒక్కడే తోపైతే సరిపోదు.. అంతాకలిసికట్టుగా పోరాడితేనే.. గెలిచి నిలిచేది. ఈ చిన్న లాజిక్‌ను బండి సంజయ్ మిస్ అయ్యారని చెబుతున్నారు. కిషన్‌రెడ్డి లాంటి సీనియర్ నేతనే పట్టించుకోకపోతే ఎలా? ఈటల, రఘునందన్, అర్వింద్, వివేక్ వెంకటస్వామిలాంటి వారిని పక్కనపెట్టేస్తే పని అవుతుందా? అందుకే, బండిపై అధిష్టానం కన్నెర్ర జేసిందని అంటున్నారు. ఇస్తామన్న కేంద్రమంత్రి పదవి సైతం ఇవ్వలేదని తెలుస్తోంది.


ఈటలకు టాప్ ప్రయారిటీ అందుకేనా?
కిషన్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడం కంటేకూడా.. ఈటల రాజేందర్‌కు పవర్‌ఫుల్ ఎన్నికల కమిటీ బాధ్యతలు కట్టబెట్టడం ఇంట్రెస్టింగ్ పాయింట్. అధ్యక్షుడికంటే కూడా ఎక్కువ అధికారాలు, బాధ్యతలు ఉంటాయా పదవికి. ఎన్నికల నిర్వహణ అంతా.. ఎన్నికల కమిటీ చేతిలోనే ఉంటుంది. అలాంటి కీలకమైన పదవికి ఈటలను ఎంపిక చేయడం వ్యూహాత్మకమనే అంటున్నారు. తెలంగాణలో పార్టీ జోరు మీదుంది. కానీ, ఇంకా బలపడాల్సిన అవసరం ఉంది. బలం పుంజుకోవాలంటే.. బలగం పెరగాలి. అది జరగాలంటే చేరికలు ఉండాలి. కానీ, కర్నాటక దెబ్బ.. బీజేపీకి బలంగా తగిలింది. జాయినింగ్స్‌కు పుల్‌స్టాప్ పడింది. పొంగులేటి, జూపల్లిలు మిస్ అయ్యారు. కొత్తగా చేరేవారు లేనే లేరు. చేరికల విషయంలో బండి సంజయ్ ఫెయిల్ అయ్యారనే చెబుతున్నారు. ఈటల బాగానే ట్రై చేస్తున్నా.. ఆయన్ను నమ్మి బీజేపీలోకి వచ్చేందుకు సందేహిస్తున్నారు చాలామంది. ఈ విషయమే ఈటల అధిష్టానం ముందుంచారని.. తనను నమ్మి పార్టీలోకి రావాలంటే.. మరింత పవర్‌ఫుల్ పోస్ట్ ఇవ్వాలని పట్టుబట్టినట్టు తెలుస్తోంది. ఈటల వాదనకు ఓకే చెప్పిన అధిష్టానం.. ఎన్నికల కమిటీ కిరీటం కట్టబెట్టి.. ఫేస్ ఆఫ్ ది తెలంగాణ బీజేపీగా ఈటల రాజేందర్‌ను ముందుంచిందని అంటున్నారు.

రెడ్డి కార్డు ప్రయోగించారా?
ఎంతకాదన్నా.. తెలంగాణ రాజకీయాల్లో రెడ్లు బలమైన వర్గం. సంఖ్యాపరంగా తక్కువే అయినా.. అనేక గ్రామాలు, మండలాలు ఇప్పటికీ వారి కనుసన్నల్లోనే ఉంటాయంటారు. ప్రస్తుతం తెలంగాణ దొర పాలనలో ఉంది. కాంగ్రెస్‌లో రెడ్ల హవా నడుస్తోంది. ఈ రేసులో బీజేపీ వెనుకబడింది. అందుకే, బీసీ నాయకత్వం కంటే కూడా.. రెడ్డి లీడర్‌షిప్‌లో ఎన్నికలకు వెళితే.. ఆ వర్గం నుంచి కావాల్సినంత మద్దతు లభించే ఛాన్స్ ఉంటుందని లెక్కలేసినట్టు తెలుస్తోంది. అందుకే, బండిని తప్పించి.. కిషన్‌ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించారని అంటున్నారు. మరి, ఇన్నాళ్లూ దూకుడుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న బండిని.. సాఫ్ట్ లీడర్ కిషన్‌రెడ్డి మరిపిస్తారా? కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్.. జోడుగుర్రాల్లా పార్టీని పరుగులు పెట్టిస్తారా?

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×