Big Stories

Akhila Priya: పంతాలు, ఫైటింగ్‌లు, జైలు.. ఎవరికి నష్టం? ఇంకెవరికి లాభం?

bhuma av

Akhila Priya Latest News(Andhra Pradesh today news): భూమా ఫ్యామిలీ. ఆళ్లగడ్డ అడ్డాగా కర్నూలు జిల్లాలో హవా నడిపించారు. భూమా శోభా-నాగిరెడ్డి హయాంలో తిరుగులేని నేతలుగా చెలామని అయ్యారు. వాళ్ల తదనంతరం భూమా అఖిలప్రియ వారసత్వ రాజకీయాన్ని అందిపుచ్చుకున్నారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా మరింత అందలమెక్కారు. సర్కారు మారడంతో.. అంతెత్తు నుంచి అదః పాతాళానికి పడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోవడమే కాదు.. తాజాగా జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది.

- Advertisement -

పెద్ద పగ. చిన్న గొడవ. కట్ చేస్తే, అఖిలప్రియ దంపతులు కర్నూన్ జైల్లో 8 రోజుల పాటు మగ్గాల్సి వచ్చింది. బెయిల్ వచ్చింది కాబట్టి సరిపోయింది.. లేదంటే మరింత కాలం చిప్ప కూడు తప్పకపోయేది. రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన అఖిలకు.. ఇలా వరుస ఎదురుదెబ్బలు తగలడాన్ని ఎలా చూడాలి? రాజకీయ అనుభవం లేకపోవడమా? వైసీపీ పొలిటికల్ గేమా?

- Advertisement -

భూమా వర్సెస్ ఏవీ. ఒకప్పుడు నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడు సుబ్బారెడ్డి. ఆయన మరణంతో.. తండ్రి రాజకీయాన్ని అఖిలప్రియ చేతిలోకి తీసుకుంది. ఏవీ సుబ్బారెడ్డి అందుకు అంగీకరించలేక పోయారు. నాగిరెడ్డి లానే ఆయన కూతురికి కూడా ఊడిగం చేయాలా? అనే ధోరణితో.. ధిక్కార స్వరం వినిపించారు. తానే సొంతంగా రాజకీయాల్లో ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. అది అఖిల ప్రియ తట్టుకోలేకపోయింది. ఏవీ సుబ్బారెడ్డిని పదే పదే టార్గెట్ చేస్తోంది. అఖిలప్రియకు భర్త భార్గవ్ రామ్ నాయుడు తోడవడంతో వారి రాజకీయం మరింత దూకుడు పెరిగింది. తనను చంపేందుకు మూడు సార్లు ప్రయత్నించారనేది ఏవీ సుబ్బారెడ్డి ఆరోపణ. ఇద్దరూ టీడీపీలోనే ఉండటంతో.. అది కోల్డ్ వార్‌గా మారింది. ఇద్దరూ బలమైన నేతలే కావడంతో పార్టీ అధిష్టానం కూడా ఏం చేయలేకపోతోంది.

ఇటీవల నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో ఆ ఆధిపత్య పోరు.. భౌతిక దాడిగా మారింది. అఖిల ప్రియ సమక్షంలోనే ఆమె అనుచరులు ఏవీ సుబ్బారెడ్డిని కొట్టారు. కొట్టారంటే ఏదో చితక్కొట్టడం కాదు.. ఓ తోపు తోశారు.. ఓ గుద్దు గుద్దారు.. అంతే. కట్ చేస్తే, తనపై హత్యాయత్నం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు సుబ్బారెడ్డి. ఇదే అదనుగా ఎదురుచూస్తున్న అధికారపక్షం చక్రం తిప్పింది. పై నుంచి ఆదేశాలు రావడంతో.. పోలీసులు వెంటనే యాక్షన్‌లోకి దిగారు. గంటల వ్యవధిలోనే భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్‌పై హత్యాయత్నం కేసు పెట్టి జైల్లో పెట్టారు. 14 రోజుల రిమాండ్ ఉండగా.. 8 రోజులకు బెయిల్ రావడంతో హమ్మయ్యా అనుకునే పరిస్థితి వచ్చింది.

అసలేం జరుగుతోంది? ఈ పొలిటికల్ గేమ్‌లో ఎవరు లాభపడ్డారు? ఎవరు నష్టపోయారు? చంద్రబాబు ముందే చెప్పారు.. జాగ్రత్తగా ఉండాలిని.. అధికార పార్టీ కుట్రలు చేస్తోందని. పట్టించుకుంటేగా? పంతాలకు పోయి ఇప్పుడు ఇద్దరు నేతలూ తమ ఇమేజ్‌ను పూర్తిగా డ్యామేజ్ చేసుకున్నారు. ఏవీ సుబ్బారెడ్డిపై దాడితో ఆయన పరువు పోయింది. ఏవీ పెట్టిన కేసులో భూమా అఖిల ప్రియ జైలుకెళ్లడంతో ఈమె బిల్డప్ అంతా ఫసక్ అంది. టీడీపీలో ఈ వర్గ పోరుతో.. మధ్యలో అధికర వైసీపీ పండుగ చేసుకుంటోంది. కేసు వచ్చిన వెంటనే స్పందించి.. అఖిలను జైల్లో పెట్టి.. ఇలా ప్రత్యర్థి పార్టీ నేతలను దెబ్బకొట్టడంలో వైసీపీ సక్సెస్ అయిందనే చెబుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో అఖిల ప్రియకు టికెట్ ఇస్తే ఆమె ఓటమి కోసమే పని చేస్తామని ఇప్పటికే సుబ్బారెడ్డి కూతురు శపథం చేశారు. టికెట్ మాకంటే మాకంటూ రచ్చ నడుస్తోంది. అధిష్టానం కమిటీ వేసినా.. అవుట్‌కమ్ మాత్రం కనిపించడం లేదు. వరుస పరిణామాలతో.. పార్టీకి నష్టం.. నేతలకూ నష్టం. జగన్‌కే లాభం. ఇంత చిన్న లాజిక్ మరిచి.. పంతాలు, ఫైటింగులతో రోడ్డున పడుతూ, జైలుకు వెళ్లడం ఎంత వరకు కరెక్ట్? అని ప్రశ్నిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News