EPAPER

BJP: అంతా వీర్రాజే చేస్తున్నారా? పవన్ కు సోము ఎందుకు చెక్ పెడుతున్నారు?

BJP: అంతా వీర్రాజే చేస్తున్నారా? పవన్ కు సోము ఎందుకు చెక్ పెడుతున్నారు?

BJP: అంతా ఆయనే చేస్తున్నారా? పవన్ కు కావాలనే దూరం పెడుతున్నారా? జనసేనాని ఎంతగా కౌగిలించుకుంటున్నా.. ఛీ అనకుండా పో అంటున్నారా? మోదీ దగ్గరకు తీసుకున్నా.. సోము ఎందుకు సైడ్ చేస్తున్నారు? ఢిల్లీ కావాలంటున్నా.. వీర్రాజు మాత్రం ఎందుకు వద్దంటున్నారు? అసలు, పవన్ కల్యాణ్ తో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఎందుకు ఆటాడుకుంటున్నారు?


పవన్ కల్యాణ్ ఫుల్ ఫైర్ ఉన్న నాయకుడు. ఆయనకున్నంతా ఆవేశం ఏపీ రాజకీయాల్లో మరెవరిలోనూ చూడలేం. అలాంటి కొమురం పులి సైతం కమలనాథుల విషయంలో అత్యంత శాంతంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం నుంచి పదే పదే ఛీత్కారం ఎదురవుతున్నా.. సర్దుకుపోతున్నారు. కామ్ గా ఉంటున్నారు కదాని.. కొందరు కమలనాథులు మరింత కవ్విస్తున్నారు. తాజాగా, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జనసేనతో పొత్తు ప్రస్తావన లేకుండానే తీర్మానం చేసేశారు. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు పట్టుబట్టి మరీ, తనకు కావలసిన విధంగా తీర్మానం ఆమోదింపజేసుకున్నారని అంటున్నారు. ఇక, భావసారూప్యత ఉన్న పార్టీలతోనే పొత్తు ఉంటుందని ప్రకటించి మరింత కలకం రేపారు. ప్రజలతోనే బీజేపీ పొత్తు అంటూ హాట్ కామెంట్ కూడా చేశారు. సోము వ్యాఖ్యలన్నీ.. పవన్ తో ఇక కటీఫ్ అనేలానే ఉన్నాయంటున్నారు.

ఎందుకో గానీ సోము వీర్రాజు మొదటి నుంచీ పవన్ కల్యాణ్ ను రాజకీయంగా హత్తుకోలేకపోతున్నారు. రోడ్ మ్యాప్, రోడ్ మ్యాప్ అంటూ జనసేనాని బహిరంగంగా ఎన్నిసార్లు గింజుకున్నా.. సోము మాత్రం ఆ రోడ్ మ్యాప్ రెడీ చేయట్లేదు. ఆ విషయం కనీసం అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లడం లేదంటున్నారు. అదీగాక.. బీజేపీ నేతలు ఏర్పాటు చేసే ఫ్లెక్సీల్లో పవన్ కల్యాణ్ ఫోటో ఉండకూడదని కూడా ఆదేశించారట సోము వీర్రాజు.


పవన్ అంశంలోనే సోము వీర్రాజుతో మరో సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా విభేదిస్తున్నారు. జనసేనతో పొత్తు మరింత ముందుకు తీసుకెళ్లాలనేది కన్నా ప్రయత్నం. కానీ, అధ్యక్షుడు వీర్రాజు అస్సలు పడనీయట్లేదని మండిపడుతున్నారు. దీంతో విసిగెత్తిన కన్నా లక్ష్మీనారాయణ.. బీజేపీని వీడి జనసేనలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. త్వరలోనే కన్నా.. జనసేనకు జై కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. లేటెస్ట్ గా కన్నా వర్గానికి చెందిన ఓ 500 మంది నేతలు బీజేపీకి రాజీనామా చేయడం పార్టీని షేక్ చేస్తోంది. అటు, పవన్ కల్యాణ్ సైతం కొండగట్టులో మాట్లాడుతూ.. కన్నా ఎక్కడ ఉన్నా ఆయన్ను గౌరవిస్తానంటూ పరోక్షంగా ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

ఏపీ బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయిందని చెబుతారు. సోము వీర్రాజు, విష్ణువర్థన్ రెడ్డి, జీవీఎల్ లాంటి పలువురు నేతలు అధికార వైసీపీకి, జగన్ కు పరోక్ష మద్దతుగా ఉంటారనే విమర్శ ఉంది. ఇక, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేశ్ లాంటి వారు వైసీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. టీడీపీకి, జనసేనకు అనుకూలంగా మాట్లాడుతుంటారు. వీరి టీమ్ లో సత్యకుమార్ సైతం యాక్టివ్ గా ఉన్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ.. టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా చేయాలనేది సోము వీర్రాజు ధృడ సంకల్పం అంటారు. టీడీపీ మీద ఉన్న వ్యతిరేకతతోనే పవన్ కల్యాణ్ ను సైతం దూరం పెడుతున్నారనే వాదన కూడా ఉంది. ఈమధ్య జనసేనాని టీడీపీతో పొత్తు దిశగా అడుగులు వేస్తుండటం వీర్రాజుకు అసలేమాత్రం నచ్చట్లేదని.. అందుకే, పవన్ తోనూ తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధపడుతున్నారని తెలుస్తోంది.

అయితే, రాష్ట్ర నాయకత్వం ఏమనుకుంటే ఏం? బీజేపీ కేంద్ర నాయకత్వానిదే అసలు నిర్ణయం. ప్రస్తుతానికైతే మోదీ, అమిత్ షాలు పవన్ కల్యాణ్ విషయంలో చాలా ఇంట్రస్ట్ గానే ఉన్నారని అంటున్నారు. అదే సమయంలో జగన్ తోనూ అంతే పరోక్ష స్నేహం కనబరుస్తున్నారు. ఆ విషయం తెలిసే సోము వీర్రాజు సైతం వైసీపీతో అంటకాగుతున్నారనే విమర్శ కూడా ఉంది. అందుకే, పవన్ ను పెద్దగా పట్టించుకోవట్లేదని అంటారు.

మరి, జగన్ తో, పవన్ తో ఒకేసారి ఫ్రెండ్ షిప్ చేయడం ఎలా సాధ్యం? అందుకే, ఏపీ విషయంలో బీజేపీ అధిష్టానం అంతగా జోక్యం చేసుకోవడం లేదంటున్నారు. సోము వీర్రాజు నాయకత్వాన్ని ఆమోదిస్తూనే.. పవన్ కల్యాణ్ తోనూ మంచిగా ఉంటున్నారు. ఎన్నికల వరకూ ఏపీ బీజేపీ రాజకీయ వ్యూహంపై ఇలానే కొనసాగే అవకాశం ఉందంటున్నారు. ఈలోగా సోము వర్సెస్ కన్నా ఎపిసోడ్ ఎక్కడికి దారి తీస్తుందో? పవన్ కల్యాణ్ స్టాండ్ ఎలా ఉండబోతుందో?

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×