Big Stories

CM Revanth Reddy On Farm Loans: రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Comments On Farm Loans(Telangana news): రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో నాలుగు రోజుల్లో రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని స్పష్టం చేశారు. రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమే అని తెలిపారు. రూ. 2 లక్షల వరకు రుణమాఫీ ఉంటుందని పేర్కొన్నారు.

- Advertisement -

తెలంగాణకు సంబంధించి పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విద్యుత్ కొరత లేదని.. పంపిణీలో అంతరాయాలు మాత్రమే ఉన్నాయన్నారు. తెలంగాణ బడ్జెట్‌కు సంబంధించి క్లారిటీ ఇచ్చారు.

- Advertisement -

కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన రెండు రోజుల్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ బడ్జెట్ వాస్తవ అంచనాలకు అనుగణంగా ఉండాలని అధికారులను ఆదేశించినట్లు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

తెలంగాణలో అమల్లో ఉన్న మహాలక్ష్మి పథకం గురించి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. మహాలక్ష్మి పథకం వల్ల తెలంగాణలో రెవెన్యూ పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థకు ప్రతి నెల దాదాపు రూ. 350 కోట్లు చెల్లిస్తుందన్నారు. ఈ పథకం వల్ల ఓఆర్( ఆక్యుపెన్సీ రేషియో) 30 శాతం నుంచి 80 శాతానికి పెరిగిందన్నారు. దీని ద్వారా ఆర్టీసీకి నిర్వహణ నష్టాలు తగ్గాయని సీఎం స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందన్నారు. కొత్త బీసీ కమిషన్ సభ్యులను నియమించాక కుల గణన చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Also Read: మరో వికెట్ కోల్పోయిన బీఆర్ఎస్‌.. కాంగ్రెస్ గూటికి చేవెళ్ల ఎమ్మెల్యే..

కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన వాస్తవాలను అసెంబ్లీ ముందుకు తీసుకువస్తామని తెలిపారు. ఇక మండలాలు, రెవెన్యూ డివిజన్ విషయాలపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

తెలంగాణ అప్పులు దాదాపు రూ. 7 లక్షల కోట్లని.. ప్రతి నెల రూ 7 వేల కోట్ల అప్పులు కడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 7 నుంచి 11 శాతం వడ్డీతో రుణాలు తీసుకొచ్చారని.. రుణభారం తగ్గేందుకు రుణాల వడ్డీలను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఒక్క శాతం తగ్గినా దాదాపు రూ. 700 కోట్లు ఆదా చేయొచ్చని సీఎం తెలిపారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామన్నారు. తెలంగాణకు సంబంధించి కేటాయింపులపై ఇప్పటికే తెలంగాణ మంత్రులు కేంద్ర మంత్రులను కలిశారని.. వీలైనన్ని నిధులు ఎక్కువగా పొందే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News