Big Stories

KCR Fear: నిద్ర లేదు.. సుఖం లేదు.. కేసీఆర్ కు భయం మొదలైందా?

Will KCR Afraid of Facing Narasimha Reddy Panel:మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి చేసిన అవినీతికి సంబంధించి శిక్షపడుతుందనే భయం మొదలైందా? అందుకే చట్టబద్దంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్‌ను తప్పుపడుతూ ముఖం చాటేస్తున్నారా?.. విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరగకపోతే ఆయన ఎందుకు కమిషన్‌ ముందు హాజరుకాలేదు?పైపెచ్చు వ్యవస్థలను తప్పపడుతూ  సుదీర్ఘ లేఖలు ఎందుకు రాస్తున్నారు ? అసలు గులాబీబాస్ వ్యవహరానికి సంబంధించి వినిపిస్తున్న టాక్ ఏంటి?

- Advertisement -

కేసీఆర్ హయాంలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. మొదటి సారి సీఎం పగ్గాలు చేపట్టినప్పుడు కేసీఆర్ ఛత్తీస్ ఘడ్ నుండి విద్యుత్ కొనుగోలు చేయించారు. అప్పటికి తెలంగాణలో అసలు కరెంటు సదుపాయాలే లేనట్లు ఎక్కువ ధర చెల్లించి మరీ విద్యుత్ కొనుగోలు చేశారు. బంగారు తెలంగాణ అంటూ పదేళ్లు పాలించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచి గద్దెదిగారు.

- Advertisement -

అప్పుడు భారీ అవినీతి జరిగిందని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై విచారణకు ఆదేశించింది. రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జస్టిస్ నరసింహారెడ్డితో కమిషన్ ఏర్పాటైంది. కమిషన్ విచారణ ప్రారంభించి కేసీఆర్ వివరణ కోసం గడువు విధించింది. అయితే దానిపై స్పందించి మాజీ ముఖ్యమంత్రి జస్టీస్ నరసింహారెడ్డి విశ్వసనీయతను ప్రశ్నిస్తూ లేఖ రాయడం కలకలం రేపింది.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం, విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ జరుగుతుంది. కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసి  విచారణకు హాజరు కావాలని పెట్టిన గడువు ముగియడంతో చివరి రోజున కేసీఆర్ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డికి 12 పేజీల లేఖ పంపారు. రాజకీయ కక్షసాధింపు ధోరణితో కమిషన్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. విద్యుత్ సంక్షోభంలో ఉన్న తెలంగాణను గట్టెక్కించామన్న కేసీఆర్.. కమిషన్ నుంచి నరసింహారెడ్డి స్వచ్చంధంగా వైదొలగాలని ఆ లేఖలో సూచించారు. విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని విచారణకు హాజరైనా ప్రయోజనం ఉండదని ఆగిపోయినట్లు పేర్కొన్నారు.

Also Read: బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం దురుద్దేశ్యంతోనే తనపై, గత ప్రభుత్వంపై ఆరోపణలు చేసి అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తోందని అక్కసు వెల్లగక్కారు. రాజకీయ కక్షతో వేసిన ఈ కమిషన్ నుంచి నరసింహారెడ్డి స్వచ్చంధంగా వైదొలగాలని సూచించారు. ఆయన కూడా తెలంగాణ బిడ్డేనంటూ మళ్లీ సెంటిమెంట్ టచ్ ఇచ్చారు. వాస్తవానికి జూన్ 15న కమిషన్ ఎదుట హాజరై సమాధానం ఇవ్వాలని భావించానని.. కానీ విచారణ పారదర్శకంగా లేకపోవడంతో తాను హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని ఆగిపోయినట్లు చెప్పారు. విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని అర్థమైందన్నారు.

అన్నింటా తాము చట్టాలను, నిబంధనలను పాటిస్తూ ముందుకు సాగామన్నారు. కేంద్ర, రాష్ట్ర అనుమతులు ముందుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదని ఆ విషయం హైకోర్డు జస్టీస్‌గా పని చేసిన మీకు తెలియదా అని కమిషన్ చైర్మన్‌ని ప్రశ్నించారు. అరెస్ట్ భయంతోనే ఆయన విచారణ కమిషన్‌కు ముఖ్యం చాటేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. విద్యుత్‌ కొనుగోలులో తప్పు చేయకపోతే కమిషన్‌ ముందు హాజరై నిరూపించుకోవచ్చు కదా అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ప్రశ్నిస్తున్నారు.

చేసిన తప్పిదాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయని, శిక్ష పడుతుందనే భయం ఆయనలో మొదలైందని కమిషన్‌కు రాసిన 12 పేజీల లేఖ ద్వారా స్పష్టమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి జరగకపోతే జస్టిస్‌ నరసింహారెడ్డి ముందు హాజరై తన తప్పిదం లేదని నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదంటున్నారు. తెలంగాణ వాళ్లను విచారిస్తారా అంటూ మళ్లీ సెంటిమెంట్‌ రాజేసే ప్రయత్నం చేస్తున్నారని కమిషన్‌కు రాసిన లేఖ ద్వారా కేసీఆర్‌ భయాందోళనలు బయటపడ్డాయంటున్నారు.

వాస్తవ పరిస్థితులు చూస్తే  పదేళ్లు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన బీఆర్‌ఎస్‌ అధినేతకేసీఆర్‌ పార్టీ ఉనికి కాపాడుకోవడానికి నానా పాట్లు పడాల్సి వస్తుందిప్పుడు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన షాక్‌ నుంచి కోలుకోక ముందే.. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ వాసులు మరింత పెద్ద షాక్ ఇచ్చారాయనకి .. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కలలు కన్న కల్వకుంట్ల దొరకి లోక్‌సభలో ప్రాతినిధ్యమే లేకుండా చేశారు. పార్టీ పేరులో నుంచి తెలంగాణను తీసేసిన ఆయన్ని  తెలంగాణ జనం కూడా పక్కన పెట్టేశారు. దాంతో తత్వం బోధపడిన కేసీఆర్.. ఫాంహౌస్‌కు చేరి  పలకరింపుల కోసం ఎదురు చూసే పరిస్థితి తలెత్తింది.

Also Read: కమిషన్ ముందు హాజరయితే కేసీఆర్‌కు వచ్చే నష్టమేమిటి..? : భట్టి

మరోవైపు ఆయన్ని మూడు సార్లు గెలిపించి గజ్వేల్ ఓటర్లు  మా ఎమ్మెల్యే కనపడటం లేదంటూ రోడ్డెక్కుతూ కేసీఆర్‌కి ఊపిరి సలపకుండా చేస్తున్నారు. గజ్వేల్‌ ఎమ్మెల్యే కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికలైనప్పటి నుంచి కనబడటం లేదని, ఎవరికైనా ఆచూకీ తెలిస్తే చెప్పాలని, వారికి తగిన బహుమానం ఇస్తామని బీజేపీ నాయకులు గజ్వేల్‌ పట్టణంలో పోస్టర్లు వేశారు. తర్వాత పోలీస్‌ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు.

మొత్తమ్మీద ఉద్యమనేతగా ఫోకస్ అయి మాజీ ముఖ్యమంత్రిగా మిగిలిన కేసీఆర్ ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు కనపిస్తున్నారు. పదేళ్లు ఏకఛత్రాధిపత్యం కొనసాగించిన ఆయనకు అటు విచారణ కమిషన్ ముందు హాజరయ్యే ధైర్యం లేదు. చేసిన తప్పిదాలతో ఇటు జనంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అందుకే ఎర్రవెల్లి ఫాం హౌస్‌లో వచ్చిన వాళ్లకి శాలువాలు కప్పుతూ అలా కానిచ్చేస్తున్నారంట.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News