Big Stories

BJP in Telangana : తెలంగాణలో ఊకదంపుడు ఉపన్యాసాలకే బీజేపీ పరిమితమా ?

BJP Future in Telangana(Telangana Politics): తెలంగాణలో బీజేపీ భవిష్యత్ ఏంటి? కాంగ్రెస్ ఫుల్ జోష్‌లో ఉంది. చేతి దెబ్బకు కారు షెడ్డుకే పరిమితం అవుతోంది. ఎప్పుడు బయటకొస్తుందో అర్థంకాని పరిస్థితి. 9 ఏళ్లు ఏలిన బీఆర్ఎస్ ఖాళీ అవుతోంది. తెలంగాణలో అధికారంలోకి రావాలని టార్గెట్‌ పెట్టుకున్న కమలనాథుల సంగతేంటి? వ్యూహం ఉందా? మాటలకే పరిమితం అవుతారా?

- Advertisement -

తెలంగాణలో రాజకీయ పరిణామాలు స్పీడుగా మారుతున్నాయి. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ ను పెంచి దూకుడు మీద ఉంది. బీఆర్ఎస్, బీజేపీ సహా ఇతర పార్టీల నేతలను పార్టీ వైపుకు తిప్పుకోవడంలో హస్తం నేతలు సక్సెస్ అవుతున్నారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రేపో మాపో మరికొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ లో బీజేపీ ముఖ చిత్రం ఏ విధంగా ఉండబోతుందనేది హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

గత అసెంబ్లీ ఎన్నికల్లో మిషన్ 90 లక్ష్యంతో ప్రచారాన్ని ఊదరగొట్టిన బీజేపీ.. 90 అసెంబ్లీ స్థానాలు సాధిస్తామని చెప్పి బొక్క బోర్లా పడింది. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గ్యారంటీ తో డబుల్ డిజిట్ స్థానాలకు లెక్కలేసుకున్న బీజేపీ.. కొంత లాభపడినప్పటికి, సింగిల్ డిజిట్ కే పరిమితం కావలసి వచ్చింది. కానీ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా 88 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామనే ధీమాతో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2028 ఎన్నికలే టార్గెట్ గా ప్రణాళికలను అందుకోవాలంటే.. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ నిలబడాలని.. అందుకు గాను బీఆర్ఎస్ స్థానాన్ని భర్తీ చేసే ప్లాన్ లో బీజేపీ నేతలు తలమునకలు అవుతున్నారు.

Also Read : ఆర్ఎస్ఎస్ సూచన, రాజాసింగ్‌కే తెలంగాణ పగ్గాలు?

బీఆర్ఎస్ నేతలను బీజేపీలోకి తెచ్చుకొని.. కారు పార్టీని ఖాళీ చేయాలనే కమలం నేతల వ్యూహాలు మాత్రం బెడిసికొడుతున్నాయి. బీఆర్ఎస్ ను వీడుతున్న నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు యత్నించడం.. ప్రజల్లో ప్రజాపాలన పట్ల మంచి అభిప్రాయం ఉండటమే అందుకు కారణంగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ స్థానానికి బీజేపీ రావాలంటే.. ఆపరేషన్ కమలం స్పీడప్ చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచిస్తున్నారు.

రాష్ట్రంలో కారు పార్టీని ఖాళీ చేసి, బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడుతుందా..? లేదా అనేదే అటుంచితే… ఆపరేషన్ లోటస్ లోకి వచ్చే నేతలు ఎవరున్నారు..? ఎవరొస్తారు..? అనే చర్చ బీజేపీలో జోరుగా సాగుతోంది. గ్రౌండ్ లేవల్లో పార్టీ బలంగా లేకుండా రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎలా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సైతం అపరేషన్ లోటస్ పూర్తిగా విఫలం అయ్యిందనే విమర్శలు సైతం సొంత నేతల నుంచే రావడం నాయకులను విస్మయానికి గురి చేస్తున్నాయి. ఆపరేషన్ లోటస్ కు పడిన నేతలు కూడా ఎక్కువకాలం పార్టీలో ఇమడలేక తిరిగి సొంత గూటికి వెళ్లడం కమలం నేతల్లో కలవరం పుట్టిస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర కేబినెట్ లో అవకాశం రాని ప్రస్తుత ఎంపీలు సైతం అసంతృప్తితో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో ఎవరు ఎప్పుడు బీజేపీ నుంచి జంప్ అవుతారో తెలియని సస్పెన్స్ పార్టీ వర్గాల్లో నెలకొంది. మోడీ హవా తగ్గిందనడానికి మొన్నటి ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు రాకపోవడమే అనేది క్లియర్ కట్ గా నేతలను ఆలోచనలో పడేస్తోందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే బీజేపీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం మాట పక్కన పెడితే.. ఉన్న క్యాడర్ ని కూడా కోల్పోయి.. జీరోకు పడిపోయే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలవాలని.. ఉవ్విల్లూరుతున్న బీజేపీ నేతలకు.. ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నాయి. స్థానాల విషయంలో లక్ష్యం నెరవేరకపోయినా.. బీఆర్ఎస్ స్థానం లోకి మాత్రం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. బీఆర్ఎస్ ఖాళీ అయితే.. రాష్ట్రంలో కాంగ్రెస్ తరువాత స్థానంలో బీజేపీ ఉంటుంది. ప్రజలు తప్పకుండా బీజేపీ వైపు చూస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనను చూసిన ప్రజలు.. బీజేపీని కూడా పట్టం కడతారని అంచనా వేసుకుంటున్నారు. ఆ నమ్మకంతోనే ఎన్నికలు ఎప్పుడొచ్చినా 88 స్థానాలు గెలుస్తామనే ధీమాతో బీజేపీ నేతలు ఉన్నారని చర్చ జరుగుతోంది. ఇక మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్, విచారణ సంస్థలే ప్రధాన అస్త్రాలుగా తెలంగాణలో ఆకార్ష్ కమలం స్పీడ్ పెంచాలనే ప్లాన్ లో ఉందనే టాక్ వినిపిస్తోంది.

మొత్తంగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడుతాం.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా 88 స్థానాలతో అధికారాన్ని చేపడతామని కలలు కంటున్న బీజేపీ ఆశలు.. నెరవేరుతాయా లేదా అనేది చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News