Big Stories

Khairatabad Maha Ganesh: ఖైరతాబాద్ విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభం.. ఈసారి ఎత్తు ఎంతంటే..?

Khairatabad Maha Ganesh Karra Puja: ఖైరతాబాద్ మహా గణపయ్య విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు సోమవారం కర్రపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈసారి 70 అడుగుల గణనాథుడి మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు ఆయన తెలిపారు. ‘ఖైరతాబాద్ లో పర్యావరణరహిత విగ్రహం ఏర్పాటు చేస్తాం. సంప్రదాయం ప్రకారం కర్రపూజ చేసి విగ్రహ ఏర్పాటు పనులను ప్రారంభించాం. గతంలో కంటే ఈసారి మెరుగ్గా ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అన్ని విభాగాలను సమాయత్తం చేస్తున్నాం. రెండుమూడు రోజుల్లో ఉత్సవ కమిటీలతో సమావేశమై చర్చిస్తాం. వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాదం ఇచ్చే విధంగా ఈసారి చర్యలు తీసుకుంటాం’ అంటూ ఎమ్మెల్యే పేర్కొన్నారు.

- Advertisement -

అయితే, ఖైరతాబాద్ గణనాథుడికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతి సంవత్సరం వినాయక చతుర్థి వేడుకలలో ఈ విగ్రహం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తది. ఈ మహాగణపతిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు.. దేశ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఖైరతాబాద్ వినాయక విగ్రహ తయారీ పనులను నేడు ప్రారంభించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7న వినాయక చవితి ఉన్న నేపథ్యంలో పనులను ప్రారంభించారు.

- Advertisement -

ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. మొదటగా కర్రపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పనులను ప్రారంభించారు. అయితే, ఈసారి మాత్రం 70 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాదితో ఖైరతాబాద్ మహాగణపతికి 70 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా 70 అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించాలని నిర్వాహకులు నిర్ణయించారు.

గత సంవత్సరం 45 నుంచి 50 టన్నుల బరువుతో 63 అడుగుల ఎత్తులో పూర్తిగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి సరికొత్త రికార్డును సృష్టించారు. ఈసారి కూడా 70 అడుగుల మట్టి విగ్రహాన్ని రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ఈ హైట్ తో ఖైరతాబాద్ గణనాథుడు తన పేరు మీద ఉన్న రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

Also Read: ట్రాఫిక్ కానిస్టేబుల్‌ చేసిన సాయానికి సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌లు

1954 సంవత్సరం నుంచి ఖైరతాబాద్ వినాయకుడి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆ ఏడాది ఒక్క అడుగుతో ఈ గణనాథుడి చరిత్ర ప్రారంభమయ్యింది. గత 67 ఏళ్లకు పైగా ఇంతింతై వటుడింతై అన్నట్లు వినాయకుడు మహా గణపతిగా భక్తులకు దర్శనమిస్తూ వస్తున్నాడు. గత సంవత్సరం కంటే మెరుగ్గా ఈసారి ఉత్సవాలను నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ సిద్ధమైంది. ఈ ఏడాది వినాయకుడు ఏ రూపంలో దర్శనమివ్వబోతాడోననేది త్వరలో వెల్లడించే అవకాశముంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News