Big Stories

Dharani portal: ధరణి పోర్టల్‌ను ప్రక్షాళన చేసేందుకు చర్యలు చేపట్టాం: మంత్రి పొంగులేటి

Dharani portal: ధరణి పోర్టల్ వల్ల ఎదురైన సమస్యలను పరిష్కరించేందుకు ధరణి పోర్టల్ ను పునర్ వ్యవస్థీకరించి, భూ వ్యవహరాలకు సంబంధించిన చట్టాల్లో మార్పులు తేవాల్సిన అవసరమేర్పడిందని, ఆ దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టామంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలోని తన ఛాంబర్ లో ధరణి కమిటీ సభ్యులతో మంత్రి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు భూసమస్యలను ఎదుర్కొంటున్నారని, అంతేకాదు.. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికే ధరణి పోర్టల్ ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టామన్నారు.

- Advertisement -

‘గత ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం చేయకుండానే హడావుడిగా ధరణి పోర్టల్ ను తీసుకొచ్చింది. ధరణి వల్ల ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. వాటన్నిటినీ పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ధరణిని ప్రక్షాళన చేసేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నాం. ఈ పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యలను అధ్యయనం చేసేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేశాం. కమిటీ ఇచ్చిన సిఫారసులపై సమావేశంలో చర్చించాం. కమిటీ తుది నివేదిక ప్రభుత్వానికి ఇచ్చే ముందు అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తాం’ అని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Also Read: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే

అదేవిధంగా.. ఈ కమిటీ రాష్ట్రంలో భూసంబంధిత నిపుణులు, అధికారులతో చర్చించారని, వీటితోపాటు 18 రాష్ట్రాల్లోని ఆర్వోఆర్ యాక్ట్ ను క్షుణ్ణంగా పరిశీలించిందని మంత్రి చెప్పారు. భూ వివాదాల పరిష్కారం కోసం రెవెన్యూ ట్రైబ్యునల్ లను ఏర్పాటు చేయాలని, భూమికి సంబంధించినటువంటి ముఖ్యమైన చట్టాలను కలిపి ఒకే చట్టంగా రూపొందించాలని కమిటీ సూచించినట్లు మంత్రి తెలిపారు. ధరణి పోర్టల్ ను బలోపేతం చేయడంతోపాటు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా, అందరికీ సులువుగా అర్థమయ్యేలా మార్పులు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వం పార్ట్-బిలో ఉంచిన భూ సమస్యలను పరిష్కరించడానికి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలియజేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News