Big Stories

Fire accident at Shadnagar: షాద్‌నగర్‌లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి

Fire accident at Shadnagar(TS today news): రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. జిల్లాలోని షాద్ నగర్ లో ఉన్న ఓ గ్లాసు కంపెనీలో కంప్రెషర్ పేలడంతో ఆరుగురు దుర్మరణం చెందారు. పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిన్నాభినమయ్యాయి. మంటలు భారీగా ఎగిసిపడడంతో మరికొంతమంది కార్మికులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

ఒకేసారి కంప్రెషర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఎలా జరిగిందనేదానిపై అధికారులు ఇంకా ఆరా తీస్తున్నారు. మృతులు బీహార్ యూపీ, ఒడిశా వాసులుగా గుర్తించారు. తీవ్ర గాయాలైనవారిని మెరుగైన చికిత్స కోసం గాంధీ, ఉస్మానియా ఆసుపత్రికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, గతంలో ఇక్కడ ఇలాంటి ఘటన జరిగినప్పుడు కార్మికుల భద్రత దృష్ట్యా జాగ్రతలు తీసుకోవాలనే అంశంపై ఇచ్చిన సూచనలను ఏ మేరకు పాటించారనేదానిపై అధికారులు పరిశీలిస్తున్నారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశం

షాద్ నగర్ అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో గాయపడినవారిని వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖ, కార్మిక, పరిశ్రమలు, వైద్య బృందాలు ఘటనా స్థలిలోనే ఉండి సమన్వయంతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలంటూ సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలోనే ఉన్న కలెక్టర్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Also Read: రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు: సీఎం రేవంత్ రెడ్డి

ఇటు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా షాద్ నగర్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News