Big Stories

Joinings in Congress Party : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకతో.. కాంగ్రెస్ లో చేరికలకు లైన్ క్లియర్

Telangana congress news(TS today news): కాంగ్రెస్ పార్టీలో చేరికలకు అడ్డు పడింది. ఒక్క ఎమ్మెల్యేను చేర్చుకుంటేనే పార్టీలో ముసలం మొదలైంది. ఇక ముందు ముందు ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటారు? ఇవీ నిన్నటి వరకు వినిపించిన ప్రశ్నలు. అవును.. మనం మాట్లాడేది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో.. అలకపాన్పు ఎక్కిన జీనవ్ రెడ్డి గురించే. కానీ ఈ సమస్యను చాలా సామరస్యంగా తీర్చడమే కాదు. మొత్తం చేరికలకే లైన్‌ క్లియర్ చేసింది కాంగ్రెస్ పార్టీ.

- Advertisement -

కాంగ్రెస్‌లో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్ చేరిక ఓ ముసలాన్ని పుట్టిస్తుందని భావించారు అంతా. ఎందుకంటే సంజయ్ అలా కండువా కప్పుకోగానే.. పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి అలకపాన్పు ఎక్కారు. తనపై పోటీ చేసి గెలిచిన వ్యక్తిని.. తనకు చెప్పకుండా ఎలా చేర్చుకుంటారు? ఇది అన్యాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అని కూడా అన్నారు. ఏకంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా వెళ్లి బుజ్జగించినా ఒక్క మెట్టు కూడా దిగిరాలేదు జీవన్ రెడ్డి. నిజానికి ఇది పెద్ద విషయమే. ఎందుకంటే జీవన్ రెడ్డి అనే నేత పార్టీలో చాలా సీనియర్.. ఆయనకు చాలా ప్రాధాన్యత ఉంది. గెలుపోటములతో సంబంధం లేకుండా నిత్యం పార్టీనే అంటిపెట్టుకొని నడిచిన వ్యక్తి జీవన్ రెడ్డి. మరి అలాంటి నేత పార్టీని వీడుతారేమో అన్న భయం ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణుల్లో మొదలైంది.

- Advertisement -

నిజానికి జీవన్‌ రెడ్డి పార్టీని వీడితే రెండు నష్టాలు జరిగేవి. ఆయనలాంటి సీనియర్ నేత పార్టీని వీడటం ఒకటైతే.. ఇకముందు జరిగే చేరికలతో మనస్థాపం చెందే నేతలు జీవన్ రెడ్డి బాటలోనే నడవడం రెండోది. మొదటి నష్టాన్ని కవర్ చేసుకోవడం కాస్త సులువే కానీ.. రెండోది జరిగితే కాంగ్రెస్ భవిష్యత్ వ్యూహాలకు భారీ దెబ్బ. అందుకే కాంగ్రెస్‌ పెద్దలంతా రంగంలోకి దిగారు. ఆయనను బుజ్జగించారు. కాంగ్రెస్‌ను అంటిపెట్టుకొని ఉన్న నేతలకు ఎప్పుడూ నష్టం జరగదని హామీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్‌ నేతలకు ఓ పాజిటివ్ సందేశం పంపినట్టైంది.

Also Read : మాజీ సీఎంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్.. ఆ విషయంలో కేసీఆర్‌కు మాట్లాడే నైతికత లేదని వ్యాఖ్యలు

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకొని.. బీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవాలన్నది కాంగ్రెస్‌ వ్యూహంలా కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోయారు. కానీ ఈ టార్గెట్‌ను రీచ్‌ కావాలంటే భవిష్యత్తులో మరింత మంది బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పాల్సి ఉంటుంది. మరి సంజయ్ చేరిక కారణంగా జీవన్‌ రెడ్డి లాంటి నేతే పార్టీని వీడితే.. మిగతా నియోజకవర్గాల్లో ఉన్న కాంగ్రెస్‌ నేతల పరిస్థితి ఏంటి? ఇది మొదటికే మోసాన్ని తీసుకొచ్చే అంశం.. అంతేకాదు కాంగ్రెస్ వ్యూహం కేవలం పేపర్‌కే పరిమితమవుతుంది. అందుకే హస్తం పార్టీ పెద్దలు చాలా చాకచక్యంగా వ్యవహరించినట్టు కనిపిస్తుంది. జీవన్‌రెడ్డిని అడ్డుకొని భవిష్యత్‌ చేరికలకు లైన్ క్లియర్ చేశారు.

అభివృద్ధి.. ఇదే మంత్రాన్ని జపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయం ఎంత ముఖ్యమో.. పాలనా అంతే ముఖ్యమంటున్నారు రేవంత్. ఇక్కడ కూడా బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు చెప్పకనే ఓ మాట చెబుతున్నట్టు కనిపిస్తుంది. పార్టీని చూసి కాదు.. తమ పాలనను చూసి పార్టీలోకి వచ్చేయండని ఆహ్వానం పంపినట్టు కనిపిస్తుంది. ఏదేమైనా జీవన్ రెడ్డి ఎపిసోడ్‌తో విపక్షాలు.. ఎస్పెషల్లీ బీఆర్ఎస్‌ తమకు లాభం చేకూరుతుందని అంచనా చేసింది. కానీ అలా జరగనివ్వలేదు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి.. ఒక సంక్షోభాన్ని కూడా చాలా తెలివిగా తమకు అనుకూలంగా మలుచుకున్నారు రేవంత్ రెడ్డి.

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకునే విషయంలో ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందో.. అంతే సీక్రెసిని మెయింటేన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దీనికి ఉదాహరణలే.. పోచారం, సంజయ్ చేరికలు. నిజానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి నేత బీఆర్ఎస్‌ను వీడతారని ఎవ్వరూ ఊహించరు. ఇక సంజయ్‌ చేరిక కూడా చాలా వ్యూహాత్మకంగా కనిపిస్తుంది. వీరిద్దరూ బీఆర్ఎస్‌కు, అంతకుమించి కేసీఆర్ కుటుంబానికి కూడా చాలా దగ్గరగా ఉండేవాళ్లు. అలాంటి వారే పార్టీని వీడినప్పుడు.. మనలాంటి వారెంత అనే ఫీలింగ్‌ను తీసుకొచ్చారు మిగతా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలలో.. ఇక్కడ కాంగ్రెస్‌ సక్సెస్ అయినట్టే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచే ఉన్నాయని దీపా దాస్‌మున్షీ చెప్పడం ద్వారా భవిష్యత్తులో మరెంతోమంది నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారన్నది క్లారిటీకి వచ్చేసింది. ఈ మాటలే ఇప్పుడు బీఆర్‌ఎస్‌లో గుబులు పెంచుతున్నాయి. పార్టీలో ఉన్నవాళ్లను కాపాడుకోవడం ఎలా అన్నదానిపై మంతనాలు సాగుతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News