Big Stories

Naatu Naatu: మోదీ వల్లే ఆస్కార్?.. ‘నాటు నాటు’ పాలి..ట్రిక్స్

Naatu Naatu: నాటు నాటు..అంటూ ప్రపంచం ఊగిపోతోంది. కొడాక్ థియేటర్ దద్దరిల్లిపోయింది. ఆస్కార్ తలవంచింది. తెలుగోడి సత్తా హాలీవుడ్‌కు తెలిసొచ్చింది. రాజమౌళి ఇండియన్ సినిమా రారాజుగా నిలిచారు.

- Advertisement -

అద్భుతం. అత్యద్భుత విజయం. RRR టీమ్‌కి హ్యాట్సాప్. కీరవాణి, చంద్రబోస్‌లకు కంగ్రాట్స్. ఆస్కార్ వేదికగా భారత కీర్తి పతాక రెపరెపలాడించారు. ఈ ఘనత తెలుగుజాతికే కాకుండా యావత్ భారతీయులది. దేశమంతా RRRని, ఆస్కార్‌ని తమదిగా భావిస్తోంది. ఇలాంటి సమయంలో.. ఆస్కార్‌నూ రాజకీయాలకు వేదికగా మార్చేసింది బీఆర్ఎస్. మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు బండి సంజయ్, మోదీ టార్గెట్‌గా పదునైన విమర్శలు చేశారు. పాత కామెంట్లను కొత్తగా బయటకు తీసి.. రాజకీయ కలకలం రేపారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

- Advertisement -

నాటు నాటు పాట‌కు మోదీ వ‌ల్లే ఆస్కార్ అవార్డు వ‌చ్చిందని ఇలాంటి మ‌తోన్మాద వ్య‌క్తులు చెప్పుకుంటారేమోన‌ని కేటీఆర్ అన్నారు. దిలీప్ అనే యూజర్ ట్విటర్‌లో చేసిన కామెంట్లను సమర్థిస్తూ కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.

గతంలో ఆర్ఆర్ఆర్ మూవీపై తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేసిన కామెంట్లను కొణ‌తం దిలీప్ గుర్తు చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ఇలాంటి ద్వేషపూరిత వ్య‌క్తుల‌ను దూరంగా ఉంచుదాం అంటూ.. బండి సంజయ్ చేసిన పాత డైలాగ్‌ల వీడియోను రీపోస్ట్ చేశారు. ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ ఓ మతానికి సంబంధించిన టోపీతో కనిపించడం.. కుమురం భీం క్యారెక్టర్‌కు ముస్లిం క్యాప్ పెట్టడంపై బండి సంజయ్ మండిపడ్డారు. ఇలా చేస్తే ఊరుకోమని.. నిజం ఫోటోకి బొట్టు పెట్టి సినిమాలో చూపించే ధైర్యం ఉందా? అంటూ కామెంట్లు చేశారు. సినిమా ఇలానే రిలీజ్ చేస్తే కొట్టికొట్టి చంపుతాం.. ఏ థియేటర్లో రిలీజ్ చేస్తే ఆ థియేటర్లను అంటిపెడతాం.. అంటూ బండి సంజయ్ మాట్లాడిన పాత వీడియోను ఇప్పుడు కొత్తగా తెరమీదకు తీసుకొచ్చింది బీఆర్ఎస్.

దిలీప్ పోస్ట్ చేసిన ఆ వీడియోకు స్పందిస్తూ.. నాటు నాటు పాట‌కు మోదీ వ‌ల్లే ఆస్కార్ అవార్డు వ‌చ్చిందని ఇలాంటి మ‌తోన్మాద వ్య‌క్తులు చెప్పుకుంటారేమోన‌ని కేటీఆర్ పొలిటికల్ పంచ్‌లు వేశారు.

మరోవైపు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం బీజేపీ టార్గెట్‌గా విమర్శలు చేశారు. ఆర్ఆర్ఆర్‌ను కేంద్రం తరఫున ఆస్కార్‌కు నామినేట్ చేయమని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపినా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేశారు. తెలుగు సినిమాను కాదని.. మోదీ సొంతరాష్ట్రమైన గుజరాత్‌కు చెందిన “ఛెల్లో షో”ను దేశం తరఫున అధికారికంగా ఆస్కార్‌కు పంపించారని విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రానికి ఎప్పుడూ చిన్నచూపే ఉంటుందంటూ మంత్రి తలసాని కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఇలా నాటు నాటుకు ఆస్కార్ అవార్డు వరించిన వేళ.. బీఆర్ఎస్ చేస్తున్న టార్గెట్ బీజేపీ పాలిటిక్స్ రాష్ట్రంలో ఆసక్తికరంగా మారాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News