Big Stories

Kodandaram : టీజేఎస్ విలీనం..! ఏ పార్టీలో..?

Kodandaram : తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్‌ కోదండరాం ఎంతో చురుకైన పాత్ర పోషించారు. విద్యార్థులను ,యువతను ఉద్యమ కెరటాలుగా మలిచారు. రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన చేసిన ప్రసంగాలు ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించాయి. ఆ సమయంలో కేసీఆర్ తో సమానంగా కోదండరాంకు ప్రాధాన్యత దక్కింది. ఉద్యోగులు, విద్యార్థులు, యువతలో ఆయన ప్రసంగాలు స్ఫూర్తిని రగిలించాయి. కేసీఆర్ కూడా కోదండరాంకు ఎంతో విలువ ఇచ్చారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రమంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఉద్యమ పార్టీగా పుట్టిన బీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత కమర్షియల్ పాలిటిక్స్ మొదలుపెట్టింది. ఇదే సమయంలో కేసీఆర్ తో కోదండరాంకు దూరం పెరిగింది. అనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో కోదండరాం సొంతంగా రాజకీయ పార్టీ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు 8 నెలల ముందు 2018 లో తెలంగాణ జన సమితిని స్థాపించారు. పార్టీ స్థాపించి ఇప్పటికీ 5 ఏళ్లు అయినా రాజకీయంగా ప్రభావం చూపించలేదు. ఈ పరిస్థితుల్లోనే ఆయన పార్టీని విలీనం చేయాలనే యోచన చేస్తున్నారని తాజాగా చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

- Advertisement -

కేసీఆర్ ను వ్యతిరేకించే పార్టీలతో కోదండరాం ఇన్నాళ్లూ జత కట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. ఇప్పుడు ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో అయినా పనిచేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. సూర్యాపేటలో నిర్వహించిన తెలంగాణ జనసమితి ప్లీనరీ సమావేశాల్లోఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఏ నిర్ణయానికైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అవసరమైతే పార్టీని విలీనం చేస్తామని కోదండరామ్‌ ప్రకటించడంపై కొత్త చర్చ మొదలైంది.

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని ప్రజల్లో అభిమానం ఉంది. కానీ కాంగ్రెస్ ఆ అభిమానాన్ని ఓటుగా మార్చుకోవడంలో గత రెండు ఎన్నికల్లోనూ విఫలమైంది. కేసీఆర్ తెలంగాణ ఏర్పాటుకు ముందుకు గులాబీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పారు. కానీ ఆ తర్వాత మాట మార్చారు. పార్టీని విలీనం చేసేది లేదని స్పష్టం చేశారు.

ఇప్పుడు కోదండరాం పార్టీ విలీనంపై ప్రతిపాదన చేశారు. అంటే ఆయన పార్టీ కాంగ్రెస్ లో తప్ప మరో పార్టీలో విలీనం చేసే అవకాశం లేదు. ఎందుకంటే తెలంగాణ ఆకాంక్షలను బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని కోదండరాం ఎన్నోసార్లు విమర్శలు చేశారు. అందుకే రాష్ట్ర ఏర్పాటు కలను నెరవేర్చిన కాంగ్రెస్ లోనే పార్టీ విలీనం చేస్తారా..? కాంగ్రెస్ కు అధికారం ఇచ్చి తెలంగాణ ప్రజలను రుణం తీర్చుకోమని కోరతారా..? కాంగ్రెస్ కు అధికారం వస్తేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని కోదండరాం అనకుంటున్నారా..? ఆయన దారెటు..?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News