Big Stories

Ramoji Rao Funeral: దేశంలోనే ప్రథమం.. అధికార లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు..!

Ramoji Rao’s Funeral With official Ceremonies: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు. 1936 నవంబర్‌ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. 1974 ఆగస్టు 10న విశాఖలో ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు.

- Advertisement -

రామోజీరావు అస్తమయంపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మీడియా రంగంలో విలువలతో పాటు నూతన ఒరవడికి, ఎన్నో సంస్కరణలకు ఆద్యుడంటూ ఆయన్ను గుర్తుచేసుకుంటున్నారు. మీడియా రంగానికి, తెలుగు రాష్ట్రాలకు ఆయన మరణం తీరని లోటు అంటున్నారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు మరువలేనివి అని కొనియాడారు.

- Advertisement -

అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రామోజీరావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ ను ఆదేశించారు. ఒక మీడియా దిగ్గజానికి ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగడం దేశంలో ఇదే ప్రథమం. రేపు ఉదయం 9 గంటలకు రామోజీ రావు అంత్యక్రియలు అధికారలాంఛనాలతో జరగనున్నాయి.

Also Read: బ్రేకింగ్.. ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూత

రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. 2016లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించారు. రామోజీరావు 1962 అక్టోబరులో హైదరాబాద్‌లో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించారు. ఇదే ఆయన తొలి వ్యాపారం. అలాగే.. 1965లో కిరణ్ యాడ్స్ అన్న అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ ప్రారంభించారు.

1967 – 1969 మధ్యకాలంలో ఖమ్మం ప్రాంతంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారాన్ని నిర్వహించారు. 1969లో రామోజీరావు ప్రారంభించిన మొట్టమొదటి పత్రికగా వ్యవసాయ సమాచారంతో సాగే అన్నదాత ప్రారంభించారు. 1970లో ఇమేజెస్ అవుట్‌డోర్ అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ ప్రారంభించారు. దీని బాధ్యతలు ఆయన భార్య రమాదేవి చూసుకునేవారు. రైతు బిడ్డగా మొదలై.. వ్యాపారవేత్తగా రామోజీరావు రాణించి.. అంచెలంచెలుగా ఎదిగి.. ఎంతోమందికి ఉపాధిని కల్పించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News