Big Stories

MLC Jeevan Reddy: సంజయ్ చేరికతో జీవన్ రెడ్డి మనస్తాపం.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా?

MLC Jeevan Reddy Ready to Resign: తెలంగాణలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. సార్వత్రిక ఎన్నికల్లోనూ కారుపార్టీ బోర్లా పడడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల నుంచి మాజీ మంత్రుల వరకూ అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేతల్లో లుకలుకలు మొదలయ్యాయి. ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా పార్టీలోకి ఆహ్వానిస్తుండడంతో కొందరు సీనియర్లు గుర్రుగా ఉన్నారు. వీరిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి కొత్త చేరికలపై మీడియా వేదికగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కనీసం సమాచారం ఇవ్వకుండా తన సొంత నియోజకవర్గానికి చెందిన వారిని పార్టీలోకి ఆహ్వానించడం అవమానంగా భావించిన ఆయన రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

ఈ నెల 22న బీఆర్ఎస్ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేరికపైన జీవన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తమపార్టీకి సరిపోయినంత మెజార్టీ ఉన్నప్పుడు మిగతా పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఇలాంటి చర్యలను తాను ప్రోత్సహించనని నిర్మొహమాటంగా మీడియా సమక్షంలో వెల్లడించారు. పోచారం చేరిక పూర్తిగా అవకాశవాదానికి నిదర్శనమేనని వ్యాఖ్యానించారు.

- Advertisement -

ఈ వ్యాఖ్యలు చేసిన కొన్నిగంటల్లోనే జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడాన్ని జీవన్ రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నారు. కనీసం మాటమాత్రం చెప్పకుండా చేర్చుకుంటారా అనే ఆగ్రహంతో అలకపాన్పు ఎక్కారు. ఈ పరిణామాల నేపథ్యంలో కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. వారందరితో తన అసహనాన్ని వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయాలనే ఆలోచనను కార్యకర్తలతో ప్రస్తావించినట్టు తెలిసింది. జీవన్ రెడ్డి ‌అలకబూనిన విషయాన్ని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్.. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణం స్పందించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. జీవన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. కాంగ్రెస్ ‌సీనియర్ నాయకులు‌, మంత్రి‌ శ్రీధర్ రెడ్డిని ఆయన నివాసానికి పంపి బుజ్జగించే ప్రయత్నాలు చేపట్టారు.

Also Read: బీఆర్ఎస్ నేతలకు గతాన్ని గుర్తు‌చేసిన షబ్బీర్ అలీ.. మిమ్మల్నే ఫాలో అవుతున్నామంటూ..

తనను రెండుసార్లు ఓడించిన తన ప్రత్యర్థి డాక్టర్ సంజయ్ ని తనకు చెప్పకుండా పార్టీలోకి ఆహ్వానించారంటే పొమ్మనకుండానే పొగబెట్టినట్టుగా చేశారనే ఆవేదనలో జీవన్ రెడ్డి సతమతమవుతున్నారు. నియోజకవర్గంలో తన ప్రాబల్యానికి అధిష్టానం గండికొట్టినట్టుగా భావిస్తున్న జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడానికి సైతం సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ రెడ్డి రాయబారం సఫలీకృతం కాలేదని తెలిసింది. ఆయనతో జరిపిన చర్చలు అసంతృప్తి గా ముగియడంతో మరోసారి హైదరాబాద్ లో జీవన్ రెడ్డి తో చర్చలు జరపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అయితే నిన్న రాత్రి‌ జగిత్యాల ఇంటి నుంచి జీవన్ రెడ్డి హైదరాబాద్ కు బయల్దేరారు. ఈ రోజు గాంధీభవన్ కు వెళ్లి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారని తెలిసింది. జీవన్ రెడ్డి వెంట 20 వాహనాలలో అనుచరులు కూడా హైదరాబాద్ చేరుకున్నారు.

పార్టీ నేతలు, అనుచరులతో భేటీ అయిన జీవన్ రెడ్డి.. పార్టీలో తనకు గౌరవం తగ్గినట్లుగా అనిపిస్తుందని అన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉంది, ప్రభుత్వానికి కావలసినంత బలం ఉంది.. కానీ బీఆర్ఎస్ చేసిన పొరపాట్లే కాంగ్రెస్ కూడా చేస్తే ఎలా అని జీవన్ రెడ్డి వాపోయారు. పాంచ్ న్యాయ్ కు విరుద్ధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందన్నారు. పార్టీ మారితే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేయాలని ఉందని.. కాంగ్రెస్ ఆ చర్యలు చేపట్టడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read: TG Government: గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. నిధులు విడుదల చేస్తూ జీఓ

అయితే తాను రాజీనామా చేసేది పదవికే కానీ..పార్టీకి కాదని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు తనను సంప్రదించారన్న వార్తల్ని జీవన్ రెడ్డి ఖండించారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి.. ప్రతీ పల్లెకు తిరిగి ప్రజల అభిప్రాయం తీసుకుంటానన్నారు. జీవన్ రెడ్డి రాజీనామా చేయకుండా ఉండేందుకు మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు బుజ్జగిస్తున్నారు. అయినా సరే.. కాంగ్రెస్ పట్ల దురుసుగా వ్యవహరించిన నేతల్ని పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజీనామాపై సాయంత్రం లోగా ప్రకటన చేసే అవకాశాలున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News