Big Stories

Telangana Legislative Council: శాసనమండలిపై కాంగ్రెస్ ఫోకస్.. టార్గెట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు!

Congress Targets Telangana Legislative Council: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దెబ్బకి.. కారు పార్టీ ఇప్పటికే షెడ్డుకి వెళ్లింది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో హస్తం పార్టీ హవాతో బీఆర్ఎస్ చతికిలపడింది. ఇక ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ లను టార్గెట్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో ఇప్పటికే నేతల ఓటమి, పార్టీ మార్పులతో బీఆర్ఎస్ దాదాపు ఖాళీ అయ్యింది. ఇక ఎమ్మెల్సీ లలో కూడా బీఆర్ఎస్ బలం తగ్గిపోతే కార్యకర్తలు కూడా పార్టీ బై బై చెప్పి.. కారు శాశ్వతంగా షెడ్డులో పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ తో బీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు పుడుతోందని చర్చించుకుంటున్నారు.

- Advertisement -

గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సున్నాకే పరిమితం కావడంతో భవిష్యత్ ఏంటనే చర్చ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రజలు బీఆర్ఎస్ ను విశ్వసించడం లేదని నేతలు డైలామాలో పడ్డారు. దీంతో పార్టీకి మనుగడ కష్టమనే భావనకు వస్తున్నారు నేతలు. ఇప్పటికే పలువురు ఘోర పరాభవంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుంటే.. మరికొందరు ముఖ్య నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజా పరిస్థితులను గమనిస్తే ఓడిపోయిన నేతలే కాకుండా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం పార్టీ మార్పుపై సన్నాహాలు చేసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

అసెంబ్లీ, పార్లమెంటులో బీఆర్ఎస్ ని సైడ్ చేసేసిన కాంగ్రెస్ ఇప్పుడు శాసన మండలిపై ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు.. హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. నిధులు, పదవుల కోసం వారు పార్టీ మారితే పరిస్థితి ఏంటని కేసీఆర్ ఆలోచనలో పడ్డారట. ప్రస్తుతం శాసనమండలిలో మొత్తం 40 మంది సభ్యులు ఉండగా.. వారిలో 29 మంది బీఆర్ఎస్‌కు చెందిన వారే ఉన్నారు. కాంగ్రెస్‌కు నలుగురు, బీజేపీకి ఒక్కరు.. ఎంఐఎం నుంచి ఇద్దరు, ఉపాధ్యాయ సంఘాలకు చెందిన ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు. గవర్నర్ కోటా కింద మరో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

Also Read: BRS New plan: బీఆర్ఎస్ ప్లాన్, ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు.. మహారాష్ట్ర ఫార్ములా

గులాబీ పార్టీ బలాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’ చేపట్టింది. ఇప్పటికే కొందరితో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం వస్తుండగా.. పార్టీలో చేరేందుకు సైతం కొందరు సిద్ధమైనట్టు టాక్ నడుస్తోంది. దీంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ అధిష్టానం.. ఎవరెవరు పార్టీ మారే అవకాశం ఉందని ఆరా తీస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీలకు సన్నిహితంగా ఉండే వారి నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలంటే మండలిలో కచ్చితంగా బలం ఉండాలని భావిస్తున్న గులాబీ పార్టీ.. తమ ఎమ్మెల్సీలు పార్టీ మారకుండా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం అందుతుంది.

త్వరలోనే అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. అందులో కొన్ని నిర్ణయాలు, బిల్లులు పాస్ చేసేందుకు సిద్ధమవుతుంది. బిల్లులు ఆమోదం పొందాలంటే మెజార్టీ సభ్యులు ఆమోదం తెలపాలి. ప్రస్తుతం కాంగ్రెస్‌కు శాసనసభలో తిరుగులేని బలం ఉన్నా.. మండలిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలే ఎక్కువగా ఉన్నారు. దీంతో కీలక బిల్లుల ఆమోదం, ఇతర అంశాలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అడ్డంకిగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు అభిప్రాయపడుతున్నారు.

Also Read: TG IAS Transfers : తెలంగాణలో మరోసారి ఐఏఎస్ ల బదిలీలు.. జీహెచ్ఎంసీ కమిషనర్ గా అమ్రపాలి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తమ పార్టీలో చేరితే పదవులు, నిధులు ఇస్తామని కాంగ్రెస్ హామీలు ఇస్తున్నట్టు సమాచారం. దాంతో రాజకీయ భవిష్యత్ ఇచ్చినప్పటికీ మరో కొంతకాలం పదవి ఉండాలంటే పార్టీ మారడం శ్రేయస్కరమని కొందరు ఎమ్మెల్సీలు భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. అందుకు గాను పలువురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొందరితో పార్టీ అధినేత కేసీఆర్ ఫోన్‌లో సంప్రదిస్తే.. వారి నుంచి సరైన సమాధానం రాలేదని.. పార్టీలో కొనసాగుతామని సైతం చెప్పలేదని పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

ఇక వ‌రంగ‌ల్ జిల్లా నుంచి ఎమ్మెల్సీలుగా ఉన్న ఆరుగురు బీఆర్ఎస్ నేత‌లు.. కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితులుగా పేరుంది. అయితే మారిన రాజ‌కీయ ప‌రిస్థితులు, ప్రస్తుత ప‌రిణామాల నేప‌థ్యంలో పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌ కోసం పార్టీ మారేందుకు వారంతా సిద్ధమవుతున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత బీఆర్ఎస్ తీరును.. టికెట్ల కేటాయింపును వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ బ‌హిరంగంగానే త‌ప్పుబ‌ట్టారని నేతల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం త‌న స్థానిక నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్‌కు కంచుకోట‌గా మార‌డంతో.. బీఆర్ఎస్‌ను వీడి హస్తం పార్టీలో చేరాలని ఓ ఎమ్మెల్సీపై తన అనుచరులు ఒత్తిడి చేస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.

అలానే మ‌రో ఎమ్మెల్సీపైనా కూడా అనుచ‌రుల ఒత్తిడి ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్‌లోకి వ‌స్తే భ‌విష్యత్ రాజ‌కీయ అవ‌కాశాల‌పై సీఎం రేవంత్‌కు స‌న్నిహితుడైన ఓ ఎమ్మెల్యే.. భరోసా ఇచ్చారని చెప్పినట్టు స‌మాచారం. మరోవైపు వీరిద్దరే కాకుండా ఇద్దరు కాంగ్రెస్ మంత్రుల‌తో అత్యంత స‌న్నిహిత సంబంధాలు క‌లిగి ఉన్న మ‌రో ఎమ్మెల్సీ సైతం పార్టీ మారే అవకాశాలు మెండుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. వీరు ముగ్గురి ఎఫెక్ట్ తో మిగిలిన ఎమ్మెల్సీలు కూడా ఆచితూచి అడుగు వేసే ధోర‌ణితో ఉన్నారంటున్నారు.

కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ప్లాన్ తో.. 29 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీల్లో కనీసం పది మందైనా మిగులుతారా ? లేదా అనే సందేహాలు ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. మరి హస్తం దెబ్బకి కారు పార్టీ గల్లంతు అవుతుందా ? లేదో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News