Congress News Telangana : తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీలకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఖమ్మంలో నిర్వహించిన తొలి కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత ఆదిలాబాద్ లోనూ అదే స్పందన లభించింది. ఇక నల్గొండలో నిర్వహించిన మూడో నిరసన ర్యాలీ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
నిరుద్యోగ యువత కాంగ్రెస్ ర్యాలీల్లో పాల్గొంటున్నారు. భారీగా ప్రజలు తరలివస్తున్నారు. అందుకే కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన ర్యాలీ కార్యక్రమాలు జన సంద్రాన్ని తలపిస్తున్నాయి. కార్నర్ సభల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను రేవంత్ వివరిస్తున్నారు. ఓటర్లలో చైతన్యం తీసుకొస్తున్నారు.
ఇక తర్వాత కార్యక్రమం హైదరాబాద్ వేదికగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఎల్బీనగర్ లోని తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి విగ్రహం నుంచి సరూర్ నగర్ స్టేడియం వరకు నిరుద్యోగ నిరసన ర్యాలీ చేపడతారు. ఈ ర్యాలీలో ప్రియాంక గాంధీ పాల్గొంటారు.
ప్రియాంక గాంధీ ఈ నెల 8న హైదరాబాద్ వస్తారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పీసీసీ నిర్వహిస్తున్న నిరుద్యోగ నిరసన సభలో ఆమె పాల్గొంటారు. పార్టీ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. వాస్తవానికి ఈ నెల 5 లేదా 6న ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించారు. కానీ 8వ తేదీకి వాయిదా వేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఈ నెల 8తో ముగుస్తుంది. అక్కడి నుంచి ప్రియాంక గాంధీ నేరుగా హైదరాబాద్‌కు వస్తారని పార్టీ వర్గాలు ప్రకటించాయి.