Big Stories

CM Revanth Reddy Met PM Modi: ఎన్నికల సమయంలోనే రాజకీయాలు.. ఆ తర్వాత ఫోకసంతా అభివృద్ధిపైనే: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Met PM Modi and Amit Shah: ఎన్నికల సమయంలోనే రాజకీయాలు.. ఆ తర్వాత ఫోకసంతా అభివృద్ధిపైనే ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు ఆయన కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన వివిధ అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సింగరేణి బొగ్గు గనులు, పెండింగ్ లో ఉన్న విభజన హామీలు, రక్షణ శాఖ భూముల బదిలీతోపాటు మొత్తం 12 అంశాలపై వినతి పత్రాలను వారికి అందజేశారు.

- Advertisement -

అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు.

- Advertisement -

‘కేంద్రం వేలం వేస్తున్న బొగ్గు గనుల జాబితాలో సింగరేణి ఏరియాలో ఉన్న శ్రావణపల్లి బొగ్గు బ్లాకును చేర్చారు. మైన్స్ అండ్ మినరల్స్ డెవెలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్ చట్టంలో ఉన్న సెక్షన్ 11A / 17(A) (2) ప్రకారం ఈ గనిని వేలం వేసే గనుల జాబితా నుంచి తొలగించాలని.. సింగరేణి ఏరియాలో ఉన్న ఈ గనిని సింగరేణికే కేటాయించాలని కేంద్రాన్ని కోరాం. కోయగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3గనులను కూడా ఇదే చట్టం ప్రకారం సింగరేణికి కేటాయించాలని విజ్ఞప్తి చేశాం.

Also Read: మోదీతో సీఎం రేవంత్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎం స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయంగా తీసుకుంది. కానీ ఇప్పటివరకు తెలంగాణకు ఐఐఎం మంజూరు కాలేదు. తెలంగాణకు ఐఐఎంను మంజూరు చేయాలని అభ్యర్థించాం. హైదరాబాద్‌లో తిరిగి ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని కోరాం.

రాష్ట్ర పునర్విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం కాజీపేటలో వ్యాగన్ తయారీ కేంద్రం ఏర్పాటుకు హామీ ఇచ్చింది.. ఆ హామీని నెరవేర్చాలని వినతిపత్రం ఇచ్చాం. ఇండియా సెమీకండక్టర్ మిషన్ లో తెలంగాణ రాష్ట్రానికి చోటు కల్పించాలని విన్నవించాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ (PMAY) తొలి దశలో తెలంగాణ రాష్ట్రానికి తక్కువ ఇండ్లు మంజూరయ్యాయి. అందువల్ల మరో 25 లక్షల ఇండ్లను మంజూరు చేయాలని కోరాం. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది నిధి (BRGF) కింద కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి 2019 వరకు ఐదేండ్లలో తెలంగాణకు కేటాయించిన రూ.2,250 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాం.

హైదరాబాద్‌లో పెరిగిన ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్–కరీంనగర్ రహదారి, హైదరాబాద్ – నాగ్‌పూర్ (జాతీయ రహదారి- 44)పై ఎలివేటేడ్ కారిడార్లను ప్రభుత్వం నిర్మించ తలపెట్టింది. ఈ రెండు కారిడార్ల నిర్మాణానికి అడ్డంకి లేకుండా మార్గమధ్యంలో రక్షణశాఖ పరిధిలో ఉన్న భూములను బదిలీ చేయాలని కోరాం. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ విషయమై ప్రక్రియను వేగవంతం చేయాలని అభ్యర్థించాం.

హైదరాబాద్ చుట్టూ జాతీయ రహదారుల అభివృద్ధికి అత్యంత ఉపయోగకరంగా ఉండే రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని (చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు) కూడా జాతీయ రహదారిగా గుర్తించాలని.. భారత్ మాల పరియోజనలో భాగంగా ఈ రహదారి నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశాం. తెలంగాణలోని ప్రధాన పట్టణాలు, పుణ్య క్షేత్రాలకు పెరిగిన రవాణా అవసరాల దృష్ట్యా 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరముందని గుర్తుచేశాం.

Also Read: రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా..

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని, రాష్ట్రానికి 24 నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలని కోరాం’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News