Big Stories

Kale Yadaiah Jumps Into Congress: మరో వికెట్ కోల్పోయిన బీఆర్ఎస్‌.. కాంగ్రెస్ గూటికి చేవెళ్ల ఎమ్మెల్యే..

BRS MLA Kale Yadaiah Jumps Into Congress: బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు. తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారాయన. దీంతో బీఆర్ఎస్ మరో వికెట్ కోల్పోయింది.

- Advertisement -

తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారు దిగి కాంగ్రెస్ గూటికి వరుసకట్టారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో ఈ వలసలు మెదలయ్యాయి. ఆ తరువాత స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

- Advertisement -

సార్వత్రిక ఎన్నికల తర్వాత మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హస్తం గూటికి చేరుకున్నారు. ఇక ఇవాళ చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలను కైవసం చేసుకున్న కారు పార్టీ ప్రస్థుతం 32 ఎమ్మెల్యేలతో కొనసాగుతుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన దివంగత సాయన్న కూతురు లాస్య నందిత మృతి చెందడంతో బై పోల్ అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేశ్ విజయం సాధించడంతో సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ కోల్పోయింది.

ఉన్న 32 మంది ఎమ్మెల్యేలలో మరికొందరు త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరుతారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి.

బీఆర్ఎస్‌లో కేసీఆర్, కేటీఆర్ తప్ప ఎవరూ మిగలరని.. హరీష్ రావు వంటి వారు బీజేపీలో చేరే అవకాశం ఉందని ఇటీవల దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఎల్లప్పుడూ వార్తల్లో నిలిచే మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని దానం నాగేందర్ పేర్కొన్నారు.

Also Read: కాంగ్రెస్‌లో చేరిన పోచారం.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి

కాలె యాదయ్య 2014లో కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద చేవెళ్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి సాయన్న రత్నం మీద 781 స్వల్ప మెజార్టీతో గెలిచారు. ఆ తరువాత కాలె యాదయ్య హస్తం వీడి గులాబీ కండువా కప్పుకున్నారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి సాయన్న రత్నం మీద 33 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

Also Read: కాంగ్రెస్‌లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే

2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ బీ ఫామ్ మీద పోటీ చేసిన కాలె యాదయ్య సమీప కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్ మీద 268 ఓట్ల స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. ఇక ప్రస్తుతం ఆయన కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరడంతో అసెంబ్లీలో హస్తం పార్టీ బలం 71కు చేరుకుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News