Big Stories

Hyderabad Girl Death : గుంతల దారికి చిన్నారి బలి.. మూగబోయిన దీక్షిత యూట్యూబ్ ఛానెల్..

Hyderabad girl death news

- Advertisement -

Hyderabad girl death news(TS news updates):

యూట్యూబ్‌తో ప్రస్తుతం చాలా మంది ఫేమ్‌ అయ్యారు. అలాగే బాచుపల్లికి చెందిన దీక్షిత తన చిట్టి గొంతుతో పాటలు, కళాత్మక అంశాలు, వినోదాత్మక రీల్స్‌ పోస్టు చేస్తూ నెట్టింటి ప్రేక్షకులకు చేరువైంది. కానీ ఆ చిట్టి గొంతు అంతలోనే మాయమైంది. చిట్టితల్లి యూట్యూబ్‌ ఛానల్‌ మూగబోయింది. బాచుపల్లిలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన చిన్నారి యూట్యూబ్‌ ఛానల్‌ ‘దీక్షిత గుండా’ మూగబోయింది. ఆ పాప పలు వీడియోలను తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేసేది. ఈ ఛానల్‌ తన సొంతమని..ప్రోత్సాహం అందించాలని ఇటీవల ఓ వీడియోలో దీక్షిత స్వయంగా చెబుతూ అభ్యర్థించింది. కానీ ఇప్పుడు ఆ గొంతు జ్ఞాపకాలుగా మిగిలిపోయింది.

- Advertisement -

రోజూ మాదిరిగా తన చిట్టి తల్లిని నిద్రలేపింది ఆ కన్నతల్లి. స్కూల్‌కు రెడీ చేయించి..టిఫిన్‌ బాక్స్‌, బుక్స్‌ బ్యాగులో పెట్టింది. తల్లి వద్ద నుంచి బ్యాగ్‌ తీసుకుని మమ్మీ స్కూల్‌కు వెళ్తున్నా అని చెప్పి నాన్న బండి ఎక్కింది. తల్లికి బై బై చెప్పి.. ఇంటి నుంచి నాన్న బండిపై స్కూల్‌కు బయలుదేరిన ఆ చిన్నారి 5 నిమిషాల్లోనే అనంత లోకాలకు చేరుకుంది. ప్రమాదవశాత్తు స్కూల్‌ బస్సు కింద పడి 8 ఏళ్ల బాలిక దీక్షిత అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ గారాలపట్టి ఇక లేదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది ఆ కన్నపేగు. చిట్టితల్లి.. బంగారం లే అంటూ.. కూతురు కోసం గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిదండ్రులను చూసి రోడ్డుపై వెళ్లేవారు కూడా కన్నీరు పెట్టారు.

బాచుపల్లి సమీపంలోని ఇంద్రప్రస్థా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న కిశోర్‌, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు దీక్షిత.. భౌరంపేట్‌లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో మూడో తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం 7.40 గంటలకు రెడ్డి ల్యాబ్స్‌ సమీపంలో కిశోర్‌ తన స్కూటీ వెనక భాగంలో కూతురు దీక్షతను కూర్చోబెట్టుకుని భౌరంపేట్‌లోని స్కూల్‌లో దింపేందుకు వెళుతున్నాడు. ఇదే క్రమంలో బాచుపల్లి నుంచి ప్రగతినగర్‌ వైపు వెళుతున్న స్కూల్‌ బస్సు స్కూటీని ఢీకొట్టడంతో తండ్రి, కూతురు ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. వేగంగా వచ్చిన స్కూల్‌ బస్సు దీక్షితపై నుంచి వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందింది. ప్రమాదంలో కిశోర్‌ కుడి భుజానికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ప్రమాదానికి కారణమైన బస్సును సీజ్‌ చేసి..డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు పోలీసులు. బస్సుకు ఫిట్‌నెస్‌, ఇన్సూరెన్స్‌ లేవని తేల్చారు. ఇలాంటి బస్సును వినియోగిస్తున్నందుకు స్కూల్‌ నిర్వాహకులపైనా కేసు నమోదు చేశారు. చిన్నారిని ఢీకొట్టిన సమయంలో స్కూల్‌ బస్సు డ్రైవర్‌ ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీక్షిత మృతదేహాన్ని తమ సొంతూరుకు తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలు చేశారు తల్లిదండ్రులు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News