Big Stories

Delhi : కొత్త పార్లమెంట్‌ భవనం వైపు దూసుకెళ్లిన రెజ్లర్లు.. ఢిల్లీలో టెన్షన్..

Delhi : భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రెజ్లర్లు చేపట్టిన ఆందోళన ఆదివారం ఉద్రిక్తతలకు దారి తీసింది. పార్లమెంట్‌ నూతన భవనం వైపు మార్చ్ చేపట్టేందుకు రెజ్లర్లు ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. రెజ్లర్లను నిర్బంధించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

- Advertisement -

బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు ‌ బ్రిజ్‌ భూషణ్‌ పలువురు అథ్లెట్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రెజ్లర్లు చాలారోజులుగా ఆరోపిస్తున్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల రోజులుగా రెజ్లర్లు వినేశ్‌ ఫొగాట్‌, సాక్షి మాలిక్‌, బజ్‌రంగ్‌ పునియా సహా చాలామంది రెజ్లర్లు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం మహిళా సమ్మాన్‌ మహాపంచాయత్‌ నిర్వహించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు పార్లమెంట్‌ భవనానికి రెండు కిలోమీటర్ల పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేశారు . జంతర్‌ మంతర్‌ వద్ద భద్రతా బలగాలను భారీగా మోహరించారు.

- Advertisement -

పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా రెజ్లర్లు పార్లమెంట్‌వైపు మార్చ్‌ను కొనసాగించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. వినేష్‌ ఫొగాట్‌, సంగీతా ఫొగాట్‌ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుని ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో రెజ్లర్లకు , పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను నిర్బంధించి బస్సుల్లోకి ఎక్కించామని
ఢిల్లీ ప్రత్యేక కమిషనర్‌ దీపేంద్ర పాఠక్‌ ప్రకటించారు. శాంతి భద్రతల నిబంధనలను ఉల్లంఘించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఏప్రిల్‌ 23 నుంచి రెజ్లర్లు కొనసాగిస్తున్న దీక్షా శిబిరాన్ని పోలీసులు తొలగించారు.

రెజ్లర్లను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న వీడియోను సాక్షి మాలిక్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియోపై ఢిల్లీ సీఎం అరవింద్ ‌ కేజ్రీవాల్‌ స్పందించారు. దేశ గౌరవాన్ని పెంచే క్రీడాకారులతో ఇలా ప్రవర్తించడం తప్పని మండిపడ్డారు. మరోవైపు రెజ్లర్లు చేపట్టిన నిరసనకు మద్దతుగా ఆదివారం మహిళా మహాపంచాయత్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఖంఝావాలా చోక్‌లోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్కూల్‌ను తాత్కాలిక జైలుగా ఉపయోగించుకొనేందుకు ఢిల్లీ మేయర్‌ను పోలీసులు అనుమతి కోరారు. అయితే మేయర్ పోలీసుల అభ్యర్థనను తిరస్కరించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News