Big Stories

IPL Final : ముంచెత్తిన వర్షం.. ఐపీఎల్‌ ఫైనల్‌ నేటికి వాయిదా..

IPL Final : వర్షం వల్ల తొలిసారిగా ఐపీఎల్‌ ఫైనల్‌ వాయిదా పడింది. 16వ సీజన్‌ టైటిల్‌ కోసం చెన్నై సూపర్‌కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ పోటీ పడుతున్నాయి. ఇరు జట్లు ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ మైదానంలో తుదిపోరులో తలపడాల్సి ఉండగా భారీ వర్షం ముంచెత్తింది. దీంతో ఫైనల్‌ వాయిదా పడింది. సోమవారం మ్యాచ్ నిర్వహిస్తారు. ఎన్నో ఆశలు, అంచనాలతో ఆదివారం ఐపీఎల్‌ ఫైనల్‌ చూడటానికి వచ్చిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది.

- Advertisement -

వర్షం తగ్గకపోవడంతో ఫైనల్‌ను రిజర్వ్‌ డే సోమవారానికి వాయిదా వేశారు. ఆదివారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కావాల్సి ఉండగా.. గంట ముందే వాన మొదలైంది. క్రమంగా జోరు వర్షంగా మారింది. రెండున్నర గంటలపాటు ఏకధాటిగా వర్షం పడింది. రాత్రి 9 గంటల సమయంలో వర్షం ఆగడంతో అభిమానుల్లో ఆశలు రేకెత్తాయి. కానీ 10 నిమిషాల విరామం తర్వాత మళ్లీ భారీ వర్షం స్టేడియాన్ని ముంచెత్తింది. అర్ధరాత్రి 12.06 గంటలకు మైదానం సిద్ధమైతే 5 ఓవర్ల చొప్పున మ్యాచ్‌ నిర్వహించే అవకాశముండగా.. కానీ ఇక ఆట సాధ్యం కాదని తేలడంతో మ్యాచ్‌ను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నామని అంపైర్లు ప్రకటించారు.

- Advertisement -

సోమవారం కనీసం 5 ఓవర్ల మ్యాచ్‌కూ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే సూపర్‌ ఓవర్‌ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. అదీ కూడా సాధ్యపడక మ్యాచ్‌ రద్దయితే మాత్రం గుజరాత్‌ టైటాన్స్‌ కు ట్రోఫీ దక్కుతుంది.

ఐపీఎల్‌ నియమావళి ప్రకారం ఫైనల్‌ వర్షం వల్ల రద్దయితే లీగ్‌ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. లీగ్‌ దశలో 20 పాయింట్లతో గుజరాత్‌ అగ్రస్థానంలో నిలిచింది. చెన్నై 17 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. గత ఏడాదే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన గుజరాత్‌.. తొలి సీజన్ లోనే విజేతగా నిలిచింది. చెన్నై జట్టు 2010, 2011, 2018, 2021 సీజన్లలో టైటిల్‌ కైవసం చేసుకుంది. ఆ జట్టు మరో ట్రోఫీ సాధిస్తే.. అత్యధికసార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిచిన ముంబైను సమం చేస్తుంది. నేడైనా వరుణుడు కరుణిస్తాడా..?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News