Big Stories

Rahul Dravid: ఆచార్య ద్రవిడ్ ఫ్రెండ్లీ కోచ్ కి.. గొప్ప గిఫ్ట్

Indian Players Carry Rahul Dravid Give him Iconic Farewell after T20 World Cup victory: 2007, మార్చి 23, వన్డే వరల్డ్ కప్.. గ్రూప్ బిలో శ్రీలంకతో కీలకమైన మ్యాచ్ వెస్టిండీస్ లో ట్రినిడాడ్ లో జరుగుతోంది. టీమ్ ఇండియాలో అతిరథ మహారథులు, పేపరు పులులు అంతా అక్కడ ఉన్నారు. రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో 254 పరుగుల లక్ష్యంతో దిగిన మనవాళ్లు ఎలా అయిపోయారంటే..

- Advertisement -

సచిన్ టెండుల్కర్, ఎంఎస్ ధోనీ ఇద్దరూ డక్ అవుట్లు, సౌరవ్ గంగూలీ (7), యువరాజ్ (6), రాబిన్ ఉతప్ప (18) ఐదుగురు అయిపోయారు. సెహ్వాగ్ (48), ద్రవిడ్ (60) ఇద్దరూ పోరాడి అవుట్ అయిపోయారు. చివరికి 185 పరుగుల వద్ద ఇండియా ఆలౌట్ అయిపోయింది. 69 రన్స్ తేడాతో పరాజయం పాలైంది. గ్రూప్ దశ నుంచి ఇంటి ముఖం పట్టింది.

- Advertisement -

కానీ నాడు కెప్టెన్ గా సాధించలేకపోయిన ట్రోఫీని, నేడు టీమ్ ఇండియా కోచ్ గా సాధించాడు. 17 ఏళ్ల తర్వాత జీవితంలో మిగిలిపోయిన ఒక వెలితిని పూర్తి చేసుకున్నాడు. అండర్ 19 జూనియర్ కోచ్ గా, తర్వాత జాతీయ జట్టు కోచ్ గా వరల్డ్ కప్ లు అందించి ఒక సంపూర్ణ క్రికెటర్ గా  రిటైర్ అవుతున్నాడు. నిజానికి జీవితంలో దొరికిన అతికొద్ది మధురక్షణాలను తను కూడా ఆస్వాదించాడు. 2024 టీ 20 వరల్డ్ కప్ సాధించిన  ఆనందంలో ఆటగాళ్లందరితో కలిసి చిందులు వేశాడు. భావోద్వేగాలను నియంత్రించుకోలేక పిడికిలి బిగిస్తూ గట్టిగా అరుపులు, కేకలతో ఆకాశం వైపు చూస్తూ హోరెత్తించాడు.

నిజానికి టీమ్ ఇండియాలో తనెంత విలువైన ఆటగాడిగా ఉండేవాడో, కోచ్ గా అంతకన్నా ఎక్కువ టీమ్ ఇండియాకి సేవలు అందించాడు. ఇప్పుడు టీమ్ ఇండియాకి ఆడుతున్న పలువురు క్రికెటర్లు అందరూ అండర్ 19లో రాహుల్ ద్రవిడ్ కోచింగ్ లో తర్ఫీదు పొందినవారే.

క్రికెట్ లోకి వచ్చిన కొత్తలో పెద్ద పెద్ద క్రికెట్ టోపీలు పెట్టుకుంటూ వెరైటీగా గ్రౌండులోకే వచ్చే ద్రవిడ్ మొదటి నుంచి చాలా కూల్ గా ఉండేవాడు. భావోద్వేగాలను ఎక్కడా ప్రదర్శించేవాడు కాదు. జంటిల్మన్ క్రికెటర్ గా పేరున్న ద్రవిడ్ ఆ ఆటకెంతో వన్నెతెచ్చాడు.

Also Read: రోహిత్ కెప్టెన్సీ బాగుంది.. టీమిండియాకు ఫోన్ చేసిన మోదీ

జూనియర్ కోచ్ గా ఉన్నప్పుడు రవిశాస్త్రి పదవీకాలం అయిన తర్వాత ద్రవిడ్ ని కోచ్ గా ఉండమని గంగూలీ అడిగాడు. ఎందుకంటే వీళ్లందరూ సమకాలీకులు. వీరిమధ్య మంచి అనుబంధం కూడా ఉంది. నిజానికి గంగూలీ బలవంతం వల్లనే ద్రవిడ్ టీమ్ ఇండియా కోచ్ గా రావడానికి ఒప్పుకున్నాడని అందరూ అంటారు. ఒకరకంగా సౌరవ్ గంగూలీ కూడా ఇండియన్ క్రికెట్ కి మేలే చేశాడని చెప్పాలి.

2021 నవంబరులో బాధ్యతలు స్వీకరించిన రాహుల్ ద్రవిడ్.. ప్రారంభంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాడు. 2022 ఆసియా కప్, టీ 20 ప్రపంచకప్ లో టీమ్ ఇండియా ఆకట్టుకోలేకపోయింది. టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో కూడా ఓటమి పాలైంది. అందరూ గొప్ప గొప్ప ప్లేయర్లే. కానీ సమష్టి క్రషి లేక పరాజయాలు తప్పడం లేదు. దీంతో అందరితో స్నేహభావంతో ఉండేవాడు. అలా ఫ్రెండ్లీ కోచ్ గా పేరు సంపాదించాడు.

ఇక 2023 వన్డే వరల్డ్ కప్ నకు ఏడాది ముందు నుంచి తన ప్రణాళికను అమలు చేశాడు. 24 మంది మెరికల్లాంటి ఆటగాళ్లతో ఒక టీమ్ తయారు చేశాడు. వారికి కఠినమైన శిక్షణ ఇప్పించాడు. వారిలో లోపాలను సరిచేశాడు. సెలక్టర్లు, కెప్టెన్ తో కర్రా విరగకుండా, పాము చావకుండా సమన్వయంతో వ్యవహరించాడు. మొత్తానికి 2023 వన్డే ప్రపంచకప్ ని గెలిచినంత పని చేశారు. దురదృష్టం ఫైనల్ లో పరాజయం పాలైంది. చివరికి 2024 తనకి కూడా కోచ్ గా ఆఖరి మెగా సిరీస్. తన జీవితంలో మిగిలిన ఏకైక కోరిక. ఎట్టకేలకు టీమ్ ఇండియా జట్టు ప్రపంచకప్ గెలిచి.. సగర్వంగా ఆచార్య ద్రవిడ్ కి వీడ్కోలు పలికింది.

రాహుల్ ద్రవిడ్ లో గొప్ప తనం ఏమిటంటే, ఎందరో క్రికెటర్లకి ఎన్నో అవకాశాలిస్తూ వెళ్లాడు. ఒక మ్యాచ్ లో సరిగా ఆడకపోయినా, మరో మ్యాచ్ లో, అక్కడ ఆడకపోయినా మరొకటి, అలా అవకాశాలిస్తూ నాణ్యమైన క్రీడాకారులుగా మార్చాడు.  2023 వన్డే వరల్డ్ కప్ నుంచి శ్రేయాస్ అయ్యర్ కి ఇచ్చినన్ని అవకాశాలు మరెవరికి ఇవ్వలేదు. తను విఫలమయ్యాడంతే.

ఇక 2024 టీ 20 వరల్డ్ కప్ నే చూస్తే.. విరాట్ కొహ్లీ, రవీంద్ర జడేజా, శివమ్ దుబె వీరందరికి వరుస ఛాన్స్ లు ఇచ్చాడు. రిజర్వ్ బెంచ్ లో ఉన్నా సరే, వీరినే రిస్క్ తీసుకుని ఆడించాడు. అది విరాట్ రూపంలో ఫైనల్ లో అక్కరకు వచ్చింది. దూబె సెమీఫైనల్ డక్ అవుట్ అయినా, ఫైనల్ లో అవకాశం ఇవ్వడమంటే సాహసమనే చెప్పాలి.

Also Read: జయహో భారత్.. రోహిత్ సేనాకు పలువురు రాజకీయ ప్రముఖులు ప్రశంసలు

ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే.. ప్రపంచకప్ లు ఆడేటప్పుడు టోర్నమెంట్లలో ఉండే ఒత్తిడి, ఆడే విధానం ఇవన్నీ దూబెకు అనుభవంలోకి వచ్చాయి. వచ్చే రెండేళ్లలో మళ్లీ టీ 20 ప్రపంచకప్ ఆడేటప్పుడు తను విరాట్, రోహిత్ ప్లేస్ ని ఆక్రమించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇదే ఆచార్యుడు ద్రవిడ్ నీతి. రేపటి క్రికెట్ కోసం కూడా ఒక పటిష్ట ప్రణాళికలతో ముందడుగు వేశాడు.

నిజానికి రాహుల్ ద్రవిడ్ 2011న వన్డే, టీ 20 మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకంటించాడు. 2012లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అలా 16 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కు తెరదించాడు. తన కెరీర్ లో 164 టెస్ట్ మ్యాచ్ లు ఆడి 13,288 పరుగులు చేశాడు. 36 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు చేశాడు. 344 వన్డేలు ఆడి 10,899 పరుగులు చేశాడు. 12 సెంచరీలు, 83 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ 20 మ్యాచ్ అయితే ఒకటే ఆడాడు. కానీ అదే టీ 20 ప్రపంచకప్ ను సాధించి, భారతీయులకి అందించాడు. భారత క్రికెట్ లో ద్రవిడ్ చెరగని ముద్ర వేశాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News