Big Stories

Ind vs SA Highlights T20 WC 2024 Final: హై ఓల్టేజ్ ఫైనల్ లో జయం మనదే.. టీ 20 ప్రపంచకప్ విజేతగా టీమ్ ఇండియా

India vs South africa T20 World Cup 2024 Final Match Highlights: ఫైనల్ దేవుళ్లు… కొహ్లీ, అక్షర్, బుమ్రా, పాండ్యా, సూర్యా, అర్షదీప్
17 ఏళ్ల తర్వాత రెండోసారి విశ్వ విజేతగా టీమ్ ఇండియా
17 ఓవర్ల తర్వాత టర్న్ అయిన మ్యాచ్
క్లాసెన్ ని అవుట్ చేసిన పాండ్యా..
డేవిడ్ మిల్లర్ క్యాచ్ పట్టిన సూర్యా

- Advertisement -

టీ 20 ప్రపంచకప్ విశ్వ విజేతగా టీమ్ ఇండియా నిలిచింది. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను ఓడించి.. ట్రోఫీని ముద్దాడింది. కోట్లాదిమంది భారతీయులకు అపరిమితమైన ఆనందాన్నిచ్చింది. వారి మనసులను ఉప్పొంగేలా చేసింది. ఒక దశలో ఓడిపోతుందనుకున్న మ్యాచ్ ని బౌలర్లు మళ్లీ గెలుపు బాట పట్టించారు. ఆ క్షణం మనవాళ్లు నిప్పులు చెరిగే బంతులు వేసి దక్షిణాఫ్రికాను అష్టదిగ్భంధం చేశారు. చివరి మూడు ఓవర్లు అయితే బాల్ బాల్ కి టెన్షన్ టెన్షన్ గా సాగింది. నరాలు తెగే ఉత్కంఠతో మ్యాచ్ సాగింది.

- Advertisement -

సౌతాఫ్రికా లక్ష్య ఛేదనలో వికెట్లు పడకపోయినా, అప్పటికి 36 బంతుల్లో 54 పరుగులు చేయాలి. ఆ టైమ్ లో 15 ఓవర్ ని రోహిత్ శర్మ అక్షర్ పటేల్ కి ఇచ్చాడు. అంతే ఆ ఓవర్ లో 24 పరుగులు వచ్చాయి. క్లాసెన్ 2 ఫోర్లు, 2 సిక్స్ లు నిలుచున్న చోట కదలకుండా కొట్టేశాడు. ఒక్కసారి గడియారం ముల్లు తిరిగినట్టు సమీకరణాలు గిర్రుమని తిరిగాయి. ఇక మ్యాచ్ టీమ్ ఇండియా చేయి జారిపోయిందని అంతా అనుకున్నారు.

అప్పుడు సౌతాఫ్రికా స్కోరు 147కి వచ్చింది. 30 బంతుల్లో ఇక 30 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. ప్రమాదకర బ్యాటర్లు క్లాసెన్, మిల్లర్ క్రీజులో ఉన్నారు.

16వ ఓవర్ బుమ్రా వేశాడు. వికెట్ రాలేదు. కానీ 4 పరుగులే ఇచ్చాడు. అప్పుడు 24 బంతులు 26 పరుగులు టార్గెట్ గా మారింది. ఇంకా క్లాసెన్ ఉన్నాడు. ఒకటే దంచి కొడుతున్నాడు. 27 బంతుల్లో 5 సిక్స్ లు, 2 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. మరోవైపు మిల్లర్ అలా చూస్తున్నాడు.

17వ ఓవర్ హార్దిక్ పాండ్యా వచ్చాడు. ఫస్ట్ బాల్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వేశాడు. క్లాసెన్ దాన్ని టచ్ చేసి, కీపర్ కి క్యాచ్ ఇచ్చాడు. అంతే ఒక్కసారి టీమ్ ఇండియాలో హై ఓల్టేజ్ స్టార్టయ్యింది. ఇక మ్యాచ్ ని వదలకూడదని పట్టు బిగించేశారు. రోహిత్ శర్మ నుంచి అసలైన కెప్టెన్ బయటకు వచ్చాడు. బాల్ బాల్ కి బౌలర్లకి సూచనలిచ్చాడు. నిజంగా పాండ్యా ఆ ఓవర్ లో క్లాసిన్ ని అవుట్ చేయడమే కాదు, 4 పరుగులే ఇచ్చాడు. అప్పుడు స్కోరు 5 వికెట్ల నష్టానికి 155. ఇంకా సౌతాఫ్రికా 18 బంతుల్లో 22 పరుగులు చేయాలి.

18వ ఓవర్ బుమ్రా వేశాడు. అది తనకి ఆఖరి ఓవర్. అటువైపు ప్రమాదకర మిల్లర్ ఉన్నాడు. కానీ స్ట్రయికింగ్ ఎక్కువ మార్కో జాన్సన్ కి వచ్చింది. దాంతో బుమ్రా బాల్ కి జాన్సన్ బలైపోయాడు. ఆ ఓవర్ లో వికెట్ తీయడంతో పాటు 2 పరుగులే ఇచ్చాడు. ఇప్పుడు సౌతాఫ్రికా 12 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

19వ ఓవర్ అర్షదీప్ వేశాడు. వికెట్ రాలేదు. కానీ 4 పరుగులే ఇచ్చాడు.
అప్పటికి 6 బంతుల్లో 16 పరుగులు చేయాలి.

Also Read: విరాట్ కోహ్లి బాటలోనే రోహిత్.. టీ20లకు ప్రకటించిన టీమిండియా కెప్టెన్

20 ఓవర్.. అది ఆఖరి ఓవర్. పాండ్యా వచ్చాడు. అటువైపు డేంజరస్ మిల్లర్ ఉన్నాడు. ఫస్ట్ బాల్ గట్టిగా లాగిపెట్టి కొట్టాడు. అది గాల్లోకి ఎగిరింది. సిక్స్ అనుకున్నారందరూ. కానీ బౌండరీ లైన్ దగ్గర సూర్య కుమార్ అద్భుతంగా అందుకున్నాడు. నిజంగా అదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. బౌండరీ లైన్ కి కాలు టచ్ కాకుండా, ఎడ్జ్ నుంచి పరిగెడుతూ బాల్ ని బయటకు విసిరి, తను లోనికి వెళ్లి, మళ్లీ బయటకు వచ్చి పట్టుకున్న తీరు నభూతో నభవిష్యత్ అని చెప్పాలి.

అంతే మిల్లర్ అయిపోయాడు. 5 బంతుల్లో 16 పరుగులు చేయాలి. రబడ వచ్చాడు. అనూహ్యంగా స్లిప్ లోంచి ఫోర్ వెళ్లిపోయింది. దీంతో 4 బంతుల్లో 12 పరుగులుగా సమీకరణాలు మారిపోయాయి. అప్పుడొక వైడ్ వచ్చింది. 4 బంతులు 11  పరుగులు. మూడో బంతికి రెండు పరుగులు వచ్చాయి.

దీంతో చివర 2 బంతులు.. 9 పరుగులుగా మారింది. అప్పుడు మరో వికెట్ వచ్చింది. రబడ అవుట్ అయ్యాడు. చివరికి 1 బంతి 8 పరుగులుగా మారింది. ఆఖరి బాల్ కి సింగిల్ వచ్చింది. అంతే టీమ్ ఇండియా 7 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టీ 20 ప్రపంచకప్ సాధించి విశ్వవిజేతగా నిలిచింది.

టీ 20 ప్రపంచకప్ మ్యాచ్ అంతా కూడా ఆఖరి మూడు ఓవర్ల మధ్యే జరిగింది. అక్కడే సినిమా మారిపోయింది. అయితే చివర్లో ఒత్తిడికి గురై సౌతాఫ్రికా ఓటమి పాలైంది. కానీ వాళ్లు గట్టి ఫైట్ ఇచ్చారు. క్లాసెన్ అద్భుతంగా ఆడాడు.

ఫస్ట్ లోనే బుమ్రా, అర్షదీప్ చెరొక వికెట్ తీసుకున్నారు. ఓపెనర్ హెండ్రిక్స్ (4), కెప్టెన్ మార్ క్రమ్ (4) వెంటనే అయిపోయారు. 2 వికెట్ల నష్టానికి 12 పరుగులతో సౌతాఫ్రికా విలవిల్లాడింది. ఈ సమయంలో డికాక్ ధనాధన్ ఆడాడు. అయితే 39 పరుగులు చేసిన తనని అర్షదీప్ అవుట్ చేశాడు. లాంగ్ ఆన్ లో కులదీప్ కి క్యాచ్ ఇచ్చాడు.

స్టబ్స్ (31), డేవిడ్ మిల్లర్ (21) చేసి, సౌతాఫ్రికాను గెలుపు ముంగిట వరకు తెచ్చారు. కానీ 7 పరుగుల తేడాతో పరాజయం పాలయ్యారు. మొత్తానికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు దగ్గర ఆగిపోయింది.

టీమ్ ఇండియా బౌలింగులో అర్షదీప్ 2, బుమ్రా 2, అక్షర్ 1, పాండ్యా 3 వికెట్లు తీశారు.

అంతకుముందు టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ తీసుకుంది. ఓపెనర్లుగా ఎప్పటిలా విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ వచ్చారు. ఈసారి విరాట్ మాత్రం చాలా సాధికారికంగా ఆడాడు. గాల్లోకి కాకుండా గ్రౌండు మీద కొట్టాడు. బాల్ ని చూసి ఆడాడు. దీంతో వరుసగా ఫోర్ల మీద ఫోర్లు వచ్చాయి. ఈ క్రమంలో రోహిత్ శర్మ (9), పంత్ (0), సూర్య (3) ఇలా ఫటఫటా పడిపోయాయి. అందరూ షాక్.. ఏం జరుగుతోందక్కడ.. అనుకున్నారు.

అప్పుడొచ్చాడు అక్షర్ పటేల్. తనలోని ఆల్ రౌండర్ ని బయటకు తీశాడు. సీనియర్లు ఆడలేని పిచ్ పై ఇరగదీసి వదిలాడు. 31 బంతుల్లో 4 సిక్స్ లు, 1 ఫోర్ సాయంతో 47 పరుగులు చేసి దురదృష్టవశాత్తూ రనౌట్ అయిపోయాడు. నిజంగా తను ఉండి ఉంటే, టీమ్ ఇండియా స్కోరు 200 దాటేదని అంతా అనుకున్నారు. అది సౌతాఫ్రికా అదృష్టమనే చెప్పాలి.

Also Read: హార్ట్ బ్రేకింగ్ న్యూస్.. రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లి

మరోవైపు విరాట్ నెమ్మదించాడు. ఎందుకంటే తన వికెట్ పడిపోతే, మ్యాచ్ అయిపోయినట్టే. ఆ సంగతి తెలుసు. అందుకే కంగారుపడలేదు. గేమ్ ప్లాన్ మార్చాడు. సింగిల్స్ తీస్తూ, స్ట్రయికింగ్ అక్షర్ కి ఇచ్చాడు. తర్వాత దుబె (27)తో ఆడించాడు.  ఆఫ్ సెంచరీ అయ్యాక, తను రిథమ్ లోకి వచ్చాడు. చితక్కొట్టాడు. ఈ క్రమంలో 59 బంతుల్లో 2 సిక్స్ లు, 6 ఫోర్లతో 76 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చివర్లో పాండ్యా (5 నాటౌట్) ఉండిపోయాడు. చివరికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.

సౌతాఫ్రికా బౌలింగులో మార్కో జాన్సన్ 1, కేశవ్ మహరాజ్ 2, రబడా 1, అన్రిచ్ 2 వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News