India vs New zealand:- భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగే తొలి వన్డే కోసం ఉప్పల్ స్టేడియంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు… పోలీసులు. ఏకంగా 2,500 మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు. మైదానం బయట, వాహనాల పార్కింగ్, తనిఖీల ప్రాంతంలో మొత్తం 300 సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షించనున్నారు. నిఘా కోసం ప్రత్యేకంగా జాయింట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వేల మంది తరలివస్తారు కాబట్టి… ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
స్టేడియంలోకి వెళ్లే ప్రేక్షకులను సెల్ ఫోన్లు మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. స్టేడియం లోపలికి ల్యాప్‌టాప్‌లు, బ్యానర్లు, వాటర్ బాటిళ్లు, కెమెరాలు, సిగరెట్లు, అగ్గిపెట్టె, లైటర్, పదునైన సామగ్రి, ఎలక్ట్రానిక్ వస్తువులు, బైనాక్యులర్లు, నాణేలు, పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్‌లు, పర్ఫ్యూమ్‌లు, బ్యాగులు, బయటి తినుబండారాలను తీసుకెళ్లడంపై నిషేధం విధించారు. మొబైల్ ఫోన్లను కూడా తనిఖీ చేసేందుకు ప్రతి గేటు దగ్గర నలుగురు సాంకేతిక సిబ్బందిని నియమించారు. తాగే నీళ్లు, తినుబండారాలు స్టేడియం లోపలే అందుబాటులో ఉంటాయి కాబట్టి… వాటర్ బాటిళ్లను, బయటి ఆహారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని పోలీసులు చెప్పారు. కాలినడకన వచ్చే అభిమానులు… స్టేడియంలోకి ఏ గేటు నుంచైనా వెళ్లవచ్చు. బైక్స్ మీద వచ్చే వాళ్లు పార్కింగ్ ఏరియా Bలో వాహనాలు పెట్టాలని, దివ్యాంగులు రామంతాపూర్ రోడ్డు మీదుగా మూడో నెంబరు గేటు నుంచి వచ్చి… వారి వాహనాలను పార్కింగ్ ఏరియా Bలో పెట్టాలని పోలీసులు సూచించారు. ఇక కార్ పాస్ ఉన్న వాళ్లు రామంతాపూర్ వైపు నుంచి వచ్చి పార్కింగ్ ఏరియాలు A,Bల్లో వాహనాలు నిలపాలని కోరారు.
మరోవైపు, మ్యాచ్ టికెట్లను బ్లాక్‌లో అమ్మడంపైనా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్న 15 మందిని అరెస్టు చేశారు. వారి దగ్గరి నుంచి 54 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.
Follow this link for more updates:- Bigtv