Big Stories

IND vs ENG Semifinal Match Highlights : పదేళ్ల తర్వాత.. ఫైనల్ కి టీమ్ ఇండియా

  • రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్
  • సూర్యకుమార్ క్లాసిక్ షో
  • అక్షర్ పటేల్, కులదీప్ మ్యాచ్ విన్నర్స్

IND vs ENG Semifinal Match Highlights in ICC men’s t20 Worldcup 2024 : టీ 20 ప్రపంచకప్ ఫైనల్లోకి టీమ్ ఇండియా ఘనంగా అడుగుపెట్టింది. ఇంగ్లండ్ ని చిత్తుచిత్తుగా ఓడించింది. రెండేళ్ల కిందట అంటే 2022లో ఇదే టీ 20 ప్రపంచకప్ సెమీఫైనల్ లో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఇండియాని ఓడించి ఇంగ్లండ్ ఫైనల్ కి వెళ్లింది. ఆనాటి పరాభవానికి ఇండియా నేడు 68 పరుగుల భారీ తేడాతో ఓడించి, అద్భుతమైన రీవెంజ్ తీర్చుకుంది. అలా మూడోసారి టీ 20 ప్రపంచకప్ ఫైనల్ కి దూసుకెళ్లింది. ఇక శనివారం బార్బడోస్ లో జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది.

- Advertisement -

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య గయానాలో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ దశలో టాస్ ఓడిన టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ కి వచ్చింది. అయితే 8 ఓవర్లు అయిన తర్వాత మళ్లీ వర్షం వచ్చి మ్యాచ్ ఆగిపోయింది. అప్పటికి భారత్ 2 వికెట్ల నష్టానికి 65 పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది. వర్షం ప్రారంభమయ్యాక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 68 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది.

- Advertisement -

172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ కి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అయితే అప్పటికి అర్షదీప్, బుమ్రా 3 ఓవర్లు వేశారు. వికెట్ పడలేదు. స్కోరు కూడా 26 పరుగుల మీద ఉంది. ఈ సమయంలో రోహిత్ శర్మ వ్యూహాత్మకంగా పవర్ ప్లేలో అక్షరపటేల్ ను తీసుకొచ్చాడు. తను వేసిన మొదటి బంతికే ప్రమాదకరమైన ఓపెనర్ జోస్ బట్లర్ (23) ని అవుట్ చేసి తొలి బ్రేక్ ఇచ్చాడు. ఇంక అక్కడ నుంచి మొదలైన వికెట్ల పతనం అలా కొనసాగిపోయింది.

Also Read : ఈ ప్రపంచకప్ ని మరిచిపోలేం: ఆఫ్గాన్ కెప్టెన్ రషీద్

తర్వాత ఓవర్ వేసిన బుమ్రా.. మరో ప్రమాదకరమైన ఓపెనర్ ఫిల్ సాల్ట్ (5) ను బౌల్డ్ చేసి, భారత శిబిరంలో ఆనందాన్ని నింపాడు. వెంటనే అక్షర పటేల్ తను వేసిన రెండో ఓవర్ లో మళ్లీ తొలి బంతికి మరో ప్రమాదకరమైన జానీ బెయిర్ స్టో (0)ని అవుట్ చేశాడు. తర్వాత మూడో ఓవర్ వేసి మెయిన్ ఆలీ (8)ని ఇంటికి పంపించాడు. అలా.. ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ ఒక్కసారి కుప్పకూలిపోయింది. 7.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 46 పరుగులతో ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

అక్షర పటేల్ వరుసగా మూడు ఓవర్లు వేసి, మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. అలా మ్యాచ్ ని ఏకపక్షంగా మార్చేశాడు. తర్వాత వచ్చిన హ్యారీ బ్రూక్ (25) కాసేపు పోరాడాడు. తనని కులదీప్ బౌల్డ్ చేశాడు. తర్వాత ఓవర్ లో శామ్ కర్రాన్ (2) ఎల్బీగా అవుట్ చేశాడు. మూడో ఓవర్ వేస్తూ క్రిస్ జోర్డాన్ (1) ని ఎల్బీగా అవుట్ చేశాడు. అలా తను కూడా వరుసగా మూడు ఓవర్లు వేసి కీలకమైన ఇంగ్లండ్ మిడిల్ ఆర్డర్ ని కుప్పకూల్చాడు.

మొత్తానికి ఇద్దరు స్పిన్నర్లు కలిసి ఇండియాను గెలిపించారు. ఫైనల్ కి తీసుకెళ్లారు. తర్వాత మనవాళ్లు అద్భుతంగా ఫీల్డింగ్ చేసి 2 రన్ అవుట్లు చేశారు. ఆదిల్ రషీద్ (2) ను సూర్య డైరక్ట్ స్టంప్ తో అవుట్ చేశాడు. లివింగ్ స్టోన్ (11) ను కులదీప్ రనౌట్ చేశాడు. చివర్లో ధనాధన్ సిక్స్ లు కొడుతున్న ఆర్చర్ (21)ను బుమ్రా ఎల్బీగా అవుట్ చేసి, ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కి తెరదించాడు. మొత్తానికి 16.4 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 68 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పరాజయం పాలైంది. సెమీస్ నుంచి ఇంటి ముఖం పట్టింది.

టీమ్ ఇండియా బౌలింగులో కులదీప్ 3, అక్షర్ పటేల్ 3, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియాకి ఎప్పటిలా శుభారంభం దక్కలేదు. సెమీస్ లోనైనా ఆడతాడని భావించిన విరాట్ కొహ్లీ తన పాత ఫామ్ నే కొనసాగిస్తూ 9 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఈసారి చాలా దూకుడుగా ప్రతీ బాల్ ని ఎటెం చేశాడు. అంటే వర్షం వచ్చే అవకాశాలు ఉండటంతో వేగంగా పరుగులు చేయాలనే భావనతో ప్రయత్నించి అవుట్ అయిపోయాడు.
తర్వాత వచ్చిన రిషబ్ పంత్ (4) కూడా ఎక్కువ సేపు నిలవలేదు.

కానీ మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం వికెట్లు పడుతున్నా వెనుకడుగు వేయలేదు. ఆస్ట్రేలియా మీద ఆడిన ఫామ్ నే కొనసాగించాడు. అయితే అక్కడంత ఊపు లేదు గానీ, ఈ పిచ్ మీద ఆడిన ఇన్నింగ్స్ మాత్రం అద్భుతమనే చెప్పాలి. 39 బంతుల్లో 2 సిక్స్ లు, 6 ఫోర్లతో 57 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ కి సపోర్ట్ గా నిలిచిన సూర్యకుమార్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.
36 బంతుల్లో 2 సిక్స్ లు, 4 ఫోర్ల సాయంతో 47 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

తర్వాత వచ్చిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన 2 సిక్స్ లు కొట్టి స్కోరు బోర్డుని పరుగులెత్తించాడు. అలా 13 బంతుల్లో 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా 9 బంతుల్లో 17 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ మధ్యలో వచ్చిన శివమ్ దుబె గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. కానీ తర్వాత వచ్చిన అక్షరపటేల్ (10) అదరగొట్టాడు. లాస్ట్ ఓవర్ లో ఒక సిక్స్ కొట్టి మ్యాచ్ ని 170 దాటించాడు. మొత్తానికి 20 ఓవర్లలో టీమ్ ఇండియా 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.

ఇంగ్లండ్ బౌలింగులో క్రిస్ జోర్డాన్ 3, ఆదిల్ రషీద్ 1, సామ్ కర్రాన్ 1, జోఫ్రా ఆర్చర్ 1, టోప్లీ 1 వికెట్ పడగొట్టారు.

మొత్తానికి టీమ్ ఇండియా ఘనంగా ఫైనల్ లో అడుగుపెట్టింది. యావద్భారతదేశాన్ని ఆనంద సాగరంలో ముంచెత్తింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News