Big Stories

USA vs IND ICC men’s T20 World Cup 2024 Match Highlights : సూపర్ 8 కి టీమిండియా : గెలిపించిన అర్షదీప్, సూర్యకుమార్

INDIA vs USA match highlights t20(Today’s sports news): టీ 20 ప్రపంచకప్ లో టీమిండియా సూపర్ 8లో అడుగుపెట్టింది. అమెరికాతో జరిగిన మ్యాచ్ లో బౌలింగులో అర్షదీప్, బ్యాటింగ్ లో సూర్యకుమార్ ల ప్రతిభతో విజయదుందుభి మోగించింది. అయితే పాకిస్తాన్ ని ఓడించిన అమెరికా అంత తేలికగా ఓటమిని ఒప్పుకోలేదు. ఇండియాని ముప్పుతిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగించింది.

- Advertisement -

లక్ష్య చేధనలో విరాట్ కొహ్లీ గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ వెంటనే అయిపోయాడు. కీలకమైన రెండు వికెట్లు ప్రారంభంలోనే పడిపోయాయి. ఈ దశలో అయిపోయింద్రా…ఇండియా పరిస్థితి అని అంతా అనుకున్నారు. అప్పుడు సూర్యా వచ్చి ఒంటిచేత్తో టీమిండియాని గెలిపించాడు.

- Advertisement -

ఇండియా టాస్ గెలిచి మొదట బౌలింగ్ తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో టీమ్ ఇండియా 18.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసి విజయం సాధించింది. సూపర్ 8లో ఘనంగా అడుగుపెట్టింది.

ఇక వివరాల్లోకి వెళితే.. 111 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకి ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. ఎవరైతే టీమిండియాకి బలమని అంతా నమ్మారో, వారే బలహీనతగా మారిపోయారు. విరాట్ కొహ్లీ ఓపెనర్ గా వచ్చి ఎదుర్కొన్న మొదటి బంతికే అవుట్ అయి, గోల్డెన్ డక్ అవుట్ గా వెనుతిరిగాడు.

ఆ షాక్ నుంచి తేరుకోకముందే మూడో ఓవర్ లో 3 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ అయిపోయాడు. ఒక్కసారి స్టేడియం మూగబోయింది. టీవీల ముందు కూర్చుని చూస్తున్నవాళ్లు నిశ్చేష్టులైపోయారు. వీరిద్దరి వికెట్లను మన ప్రవాస భారతీయుడు సౌరభ్ నేత్రావల్కర్ తీయడం విశేషం.

Also Read : ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలో భారత్.. ఏడో ప్లేస్‌లో పాకిస్థాన్..

ఫస్ట్ డౌన్ వచ్చిన రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ ల పై భారమంతా పడింది. అయితే పంత్ మాత్రం ఇప్పుడు జాగ్రత్తగా ఆడాడు. పాకిస్తాన్ పై ఆడినట్టు లైఫ్ లతో ఆడలేదు. మంచి టైమింగ్ తో బ్యాటింగ్ చేశాడు. సరిగ్గా సెట్ అయ్యాడనుకునే సమయంలో 18 పరుగుల మీద ఉండగా అలిఖాన్ అద్భుతంగా వేసిన బాల్ కి క్లీన్ బౌల్డ్ అయిపోయాడు.

అప్పుడు శివమ్ దుబె వచ్చాడు. నిజానికి గత రెండు మ్యాచ్ ల్లో పెద్దగా పెర్ ఫార్మ్ చేయని దుబెని పక్కన పెడతారని అంతా అనుకున్నారు. కానీ టీమ్ మేనేజ్మెంట్ మరొక అవకాశం ఇచ్చింది. దీంతో తను చాలా జాగ్రత్తగా మ్యాచ్ ఆడాడు. తన సహజశైలికి భిన్నంగా డిఫెన్స్ ఆడుతూ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ వెళ్లాడు. విజయం చివరి వరకు ఉండి 35 బంతుల్లో 1 సిక్సర్, 1 ఫోర్ సాయంతో 31 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

అయితే సూర్యకుమార్ యాదవ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తనని గేమ్ ఛేంజర్ అని ఎందుకంటారో ఇప్పుడందరికీ అర్థమైంది. ఒకే ఒక్కడు అతి క్లిష్టమైన పిచ్ మీద నిలబడి, దెబ్బలు తగిలించుకుని మరి ఒంటిచేత్తో భారత్ కి విజయాన్ని అందించి, అందరితో శభాష్ అనిపించుకున్నాడు. టీమ్ ఇండియా సూపర్ 8కి చేరడంలో కీలక పాత్ర పోషించాడు.

మొత్తానికి 18.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసి ఇండియా విజయం సాధించింది. అమెరికా బౌలింగులో నేత్రావల్కర్ 2, ఆలిఖాన్ 1 వికెట్ పడగొట్టారు.

Also Read : ఇండియా-పాక్ మ్యాచ్‌పై వ్లాగ్.. పాకిస్తాన్ యూట్యూబర్ దారుణ హత్య!

అంతకుముందు బ్యాటింగ్ చేసిన అమెరికా ఇంత స్కోరు చేస్తుందని అస్సలు అనుకోలేదు. అర్షదీప్ ధాటికి విలవిల్లాడింది. తన కెరీర్ లో బెస్ట్ స్పెల్ వేశాడు. 4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. అమెరికా పతనాన్ని శాసించాడు. అయితే పాండ్యాకు 2 వికెట్లు వచ్చాయి. విచిత్రం ఏమిటంటే బుమ్రాకి ఒక్క వికెట్ రాలేదు. అంతేకాదు పరుగులు కూడా బాగా సమర్పించుకున్నాడు.

మొత్తానికి ఫస్ట్ బ్యాటింగ్ ప్రారంభించిన అమెరికాకి కలిసి రాలేదు. ఓపెనర్ శ్యాం జహంగీర్ గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ స్టీవెన్ టేలర్ (24) 2 సిక్స్ లు కొట్టి అవుట్ అయిపోయాడు. తర్వాత వచ్చిన ఆండ్రిస్ గౌస్ (2), కెప్టెన్ జోన్స్ (11) చేసి వెంటనే అయిపోయారు. ఒకదశలో ఫస్టాఫ్ లోని 10 ఓవర్లలో అమెరికా 3 వికెట్ల నష్టానికి 42 పరుగులు మాత్రమే చేసింది. అక్కడ నుంచి పుంజుకుని సెకండాఫ్ 10 ఓవర్లలో 68 పరుగులు చేసి, ఇండియాకి గట్టిపోటీ ఇచ్చింది.

ముఖ్యంగా నితీష్ కుమార్ (27) ఇండియా బౌలింగుని అలవోకగా ఎదుర్కొన్నాడు. బుమ్రా వేసిన ఒక ఓవర్ లో ఒక సిక్స్, ఫోర్ కొట్టి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశాడు. అలాంటి వాడ్ని అర్షదీప్ అవుట్ చేశాడు. తర్వాత ఆండర్ సన్ (15), హర్మీత్ సింగ్ (10), షాడ్లీ వాన్ (11) ఇలా తలా కొన్ని చేసి అవుట్ అయ్యారు. మొత్తానికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది.

టీమిండియా బౌలింగులో అర్షదీప్ 4, పాండ్యా 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. శివమ్ దుబె, సిరాజ్, బుమ్రాకి వికెట్లు రాలేదు. రవీంద్ర జడేజాకి కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఇవ్వలేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News