IPL : ఐపీఎల్‌లో మరోసారి బెంగళూరుకు భంగపాటు తప్పలేదు. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో నెగ్గి ప్లేఆఫ్స్ కు చేరాలనుకున్న ఆ జట్టుకు నిరాశే ఎదురైంది. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమితో ఆర్సీబీ లీగ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఎప్పుడో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన టైటాన్స్.. శుభ్‌మన్ గిల్ సూపర్ శతకంతో 6 వికెట్ల తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది. విరాట్ కోహ్లి (101 నాటౌట్) సెంచరీ చేసినా.. RCBని ప్లేఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 5 వికెట్లకు 197 పరుగులు చేసింది. గిల్‌తో పాటు విజయ్ శంకర్ రెచ్చిపోవడంతో గుజరాత్ లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
బెంగళూరు అంత స్కోరు చేసిందంటే అందుకు ప్రధాన కారణం విరాట్ విలువైన ఇన్నింగ్సే. జట్టు తడబడ్డా కోహ్లి కడవరకూ క్రీజులో నిలబడ్డాడు. వరుసగా రెండో శతకాన్ని నమోదు చేశాడు. ప్రత్యర్థి బౌలర్లకు చిన్న అవకాశమైనా ఇవ్వకుండా ముచ్చటైన షాట్లతో చిన్నస్వామి స్టేడియంలో అభిమానులను ఉర్రూతలూగించాడు.
గుజరాత్ ఇన్నింగ్స్ లో శుభ్‌మన్ గిల్ (104 నాటౌట్) ఆట హైలైట్‌గా నిలిచింది. వరుసగా రెండో శతకంతో అతడు టైటాన్స్‌కు విజయాన్నందించాడు. మరో ఓపెనర్ సాహా త్వరగానే ఔటైనా.. గిల్ అదరగొట్టాడు. విజయ్ శంకర్ కూడా రాణించడంతో గుజరాత్ సునాయాసంగా లక్ష్యాన్ని చేధించింది. చివరి ఓవర్ లో గుజరాత్ విజయానికి 8 పరుగులు అవసరం కాగా.. పార్నెల్ మొదట నోబాల్, ఆ తర్వాత వైడ్ వేశాడు. ఆ తర్వాత బంతికి సిక్స్ కొట్టి గిల్ జట్టును విజయతీరాలకు చేర్చి.. బెంగళూరు ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ పరాజయంతో బెంగళూరు ఇంటిముఖం పట్టింది. ముంబై ప్లేఆఫ్స్ కు చేరింది. అంతకుముందే గుజరాత్, చెన్నై, లక్నో ప్లేఆఫ్స్ చేరాయి.
Leave a Comment