Big Stories

Yuvraj Singh Tweet Viral: ‘గుడ్ నైట్ బామ్మర్దులూ’.. ఇంగ్లాండ్ ఆటగాళ్లపై యువరాజ్ సెటైరికల్ పోస్ట్..

Yuvraj Singh Tweet After England Lost to India in Semifinal: యువరాజ్ సింగ్.. ఈ పేరంటూ తెలియని వారు ఉండరు. ముఖ్యంగా బౌలర్లకు అతనో పీడకల. అన్ని దేశాల సంగతి పక్కనబెడితే ఇంగ్లాండ్ ఆటగాళ్లకి యువరాజ్ సింగ్ నిద్రలేని రాత్రులను మిగిల్చాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంగ్లాండ్‌తో యువరాజ సింగ్‌కు బంధుత్వం కూడా ఉంది. అదెలా అనుకుంటున్నారా.. యూవీ భార్య హెజిల్ కీచ్ బ్రిటీష్ మోడల్. ఇంగ్లాండ్‌లోని ఎస్సెక్స్‌లో ఆమె జన్మించింది. దీంతో యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ అల్లుడు అయిపోయాడు. అల్లుడు అంటే బామ్మర్దులను కూడా జాగ్రత్తగా చూసుకుంటాడని అంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అనుకుంటున్నారా..? అయితే ఇది చదవాల్సిందే

- Advertisement -

ప్రపంచ కప్ 2024లో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ మధ్య గయానా వేదికగా సెమీఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇండియా ఇంగ్లాండ్ జట్టును మట్టికరిపించి ఫైనల్ చేరింది. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత యువరాజ్ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశాడు. ఇండియా ఆటగాళ్లను అభినందిస్తూ ట్వీట్ చేశాడు. ఇదే ట్వీట్‌లో ఇంగ్లాండ్ ఆటగాళ్లను టీజ్ చేస్తూ గుడ్ నైట్ బామ్మర్దులూ అంటూ పేర్కొన్నాడు. దీంతో ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

- Advertisement -

ఈ ట్వీట్‌పై క్రికెట్ ప్రేమికులు, నెటిజన్లు స్పందిస్తున్నారు. బామ్మర్దుల మీద ఎంత ప్రేమో అంటూ పలువురు అభిప్రాయపడగా.. నిజంగా నువ్వో గొప్ప భర్తవి అంటూ ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ అల్లుడు కాబట్టి బామ్మర్దులను ఓదార్చుతున్నావు అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

ట్వీట్ విషయం పక్కనబెడితే యువరాజ్ సింగ్, ఇంగ్లాండ్ మధ్య గొప్ప అనుబంధమే ఉంది. 2007 టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్ మీదే యువీ ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాది రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ ఆటగాడు ఫ్లింటాఫ్ కయ్యానికి కాలు దువ్వడంతో యువీ నోరుకు పని చెప్పకుండా బ్యాట్‌కు పనిచెప్పాడు. వీరిద్దరి గొడవకు నిజంగా బలైంది మాత్రం ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్. బ్రాడ్ వేసిన ఓవర్లోనే యువీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఒక్కో బంతిని ఒక్కో దిశగా కొడుతుంటే ఇంగ్లాండ్ ఆటగాళ్లు నిస్సహాయులుగా మిగిలిపోయారు. కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి మరో రికార్డు నెలకొల్పాడు యువరాజ్ సింగ్.

అంతకుముందు ఓ వన్డే మ్యాచ్‌లో యువరాజ్ బౌలింగ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ మాస్కెరెన్హాస్ ఒకే ఓవర్లో 5 సిక్సర్లు బాదాడు. దీంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా రెండిటికీ ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు.

Also Read: పదేళ్ల తర్వాత.. ఫైనల్ కి టీమ్ ఇండియా

ఇక సెమీఫైనల్ విషయానికొస్తే ఇండియా జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 68 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో గత టీ20 ప్రపంచ కప్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది రోహిత్ సేన. పదేళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్ ఫైనల్ చేరిన ఇండియా కప్పు గెలిచి 17 ఏళ్ల నిరీక్షణకు తెరదీస్తుందా అనేది ఇంకొక్కరోజు వేచి చూడాలి. కాగా ఫైనల్లో ఇండియా సౌతాఫ్రికాతో శనివారం తలపడనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News