IPL : సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ చెలరేగి ఆడింది. క్వాలిఫైయర్ -1 లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై 15 పరుగులతో తేడాతో విజయం సాధించింది. ఆల్‌రౌండ్ షోతో ఐపీఎల్ 16వ సీజన్ లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఏకంగా పదోసారి టైటిల్ పోరుకు సిద్ధమైంది.
పదహారో సీజన్ ప్లేఆఫ్స్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. ధోని తన మార్క్ కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌కు కాస్త కష్టంగా ఉన్న పిచ్‌పై రుతురాజ్ గైక్వాడ్ రాణించడంతో ప్రత్యర్థి ముందు మంచి లక్ష్యాన్ని నిర్దేశించిన సూపర్‌కింగ్స్. శుభ్‌మన్ గిల్ మరోసారి రాణించినా.. జడేజా, తీక్షణ, చాహర్ సూపర్ బౌలింగ్‌తో గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేశారు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ ( 60), డెవాన్ కాన్వే (40) మరోసారి చెన్నైకి శుభారంభం అందించారు. తొలి వికెట్ కు 87 పరుగులు జోడించారు. రుతురాజ్, దూబే (1) ఒక ఓవర్ వ్యవధిలోనే అవుట్ అయ్యారు . అ తర్వాత కాన్వే, రహానే (17), రాయుడు (17) ధాటిగా ఆడే ప్రయత్నంలో పెవిలియన్ చేరారు. జడేజా (22) మెరుపులు మెరిపించడంతో ధోని సేన మంచి స్కోర్ సాధించింది. గుజరాత్ బౌలర్లలో షమీ, మోహిత్ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టారు. దర్శన్, రషీద్ ఖాన్ , నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు.
173 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ ఆరంభం నుంచి తడబడింది. శుభ్‌మన్ గిల్ ఒక్కడే 42 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (12) , కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (8), శనక (17), డేవిడ్ మిల్లర్ (4), విజయ్ శంకర్ (14), రాహుల్ తెవాటియా (3) ఒక్కరూ కూడా క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయారు.
ఒక దశలో 98 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. కానీ రషీద్ ఖాన్ (30) కాసేపు మెరుపులు మెరిపించడంతో విజయంపై ఆశలు చిగురించాయి. అయితే మళ్లీ చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 20 ఓవర్లలో గుజరాత్ 157 పరుగులకు ఆలౌట్ అయ్యింది. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, మహీష్ థీక్షణ, పతిరన రెండేసి వికెట్లు తీశారు. తుషార్ దేశ్‌పాండే కు ఒక వికెట్ దక్కింది. హాఫ్ సెంచరీతో రాణించిన రుతరాజ్ గైక్వాడ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Leave a Comment