Big Stories

Indian Cricketers: పాక్ లోనే కాదు..ఇండియాలోనూ అంతే..! భారత క్రికెటర్లకు చేదు అనుభవాలు

Bad Experiences for Indian Cricketers(Sports news in telugu): టీ 20 ప్రపంచకప్ ఓటమి అనంతరం పాకిస్తాన్ లో అల్లకల్లోలం అవుతున్న సంగతి తెలిసిందే. అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు భయపడి పాక్ క్రికెటర్లు కొందరు లండన్ బాట పట్టిన సంగతి తెలిసిందే. 2023 వన్డే వరల్డ్ కప్ లో కూడా పాకిస్తాన్ గ్రూప్ దశను దాటలేదు. అప్పుడు కూడా ఇంతే వ్యతిరేకత చవిచూసింది.

- Advertisement -

అయితే, అందరూ పాకిస్తాన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ వీరాభిమానం మన ఇండియాలో కూడా ఉందని  గుర్తు చేస్తున్నారు. వాళ్లకి కోపం వస్తే మహామహులని కూడా లెక్క చేయరని అంటున్నారు. ఒకసారి భారత్ లో జరిగిన ఘటనలను పరిశీలించమని చెబుతున్నారు.

- Advertisement -

2003లో ప్రపంచకప్ పోటీల్లో.. లీగ్ దశలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినందుకు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, కెప్టెన్ సౌరభ్ గంగూలి, ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఫొటోలను తగలబెట్టారు. మహ్మద్ కైఫ్ ఇంటిపై హింసాత్మక దాడి జరిగింది. అప్పుడందరూ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని గట్టిగా నమ్మారు. అదే వారి ఆవేశానికి కారణమైంది. దీని తర్వాత మనవాళ్లు వరుసగా 8 మ్యాచ్ లు గెలిచి ఫైనల్ వరకు వెళ్లారు.

1996లో విల్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ కోల్ కతాలో జరిగింది.  శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో భారతజట్టు అనూహ్యంగా ఓటమిపాలైంది. కెప్టెన్ అజారుద్దీన్ డక్ అవుట్ అయ్యాడు. దీంతో ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయి స్టేడియంలోకి వచ్చి విధ్వంసం చేశారు. ఆటగాళ్ల దిష్టిబొమ్మలను దేశవ్యాప్తంగా దహనం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అజారుద్దీన్ ఇంటిముందు పోలీసు భద్రత పెంచారు.

2007లో వెస్టిండీస్ లో జరిగిన ప్రపంచకప్ భారత్ కు పీడకలగా  మారింది. తొలిరౌండ్ లోనే వెనుతిరగడంతో.. నిర్మాణంలో ఉన్న ధోనీ ఇల్లు ధ్వంసమై పోయింది. నాడు కెప్టెన్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ టార్గెట్ అయ్యాడు. అలాగే సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లకు సెగ తగిలింది. ప్లేయర్ల ఇళ్లపై రాళ్ల దాడి చేశారు. దేశ వ్యాప్తంగా ఆటగాళ్ల దిష్టి బొమ్మలు దహనం చేశారు.  ధోనీకి ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకోవాలని ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

2014లో టీ 20 ప్రపంచకప్ ఫైనల్ కి వెళ్లి ఓటమిపాలైంది. యువరాజ్ సరిగా ఆడలేదని అతని ఇంటిపై రాళ్లు రువ్వారు. అంటే తను 21 బంతులాడి 11 పరుగులు మాత్రమే చేశాడు. బాల్స్ వేస్ట్ చేయడం వల్ల ఓటమిపాలయ్యామని యువరాజ్ ని టార్గెట్ చేశారు. చండీగఢ్‌లోని యువరాజ్‌ ఇంటిపైకి రాళ్లు విసిరి నానా హంగామా చేశారు. యువీ రిటైర్‌ కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాకపోతే అప్పుడే తను కేన్సర్ ను జయించి మళ్లీ జట్టులోకి వచ్చాడు. అయినా ఎవరూ కనికరించలేదు.

Also Read: అమెరికా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య.. నేడే సూపర్ 8 తొలిమ్యాచ్

2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా బలైపోయాడు. తొలి ఓవర్ లో ఓపెనర్ ఫకర్ వికెట్ తీశాడు. అయితే అది నోబాల్ కావడంతో తను బతికి పోయాడు. తర్వాత తను సెంచరీ చేసి, పాకిస్తాన్ కి చాంపియన్ ట్రోఫీ అందించాడు. నో బాల్ వేసినందుకు అభిమానుల ఆగ్రహానికి బుమ్రా బలైపోయాడు. అంతేకాదు మీమ్స్, ట్రోల్స్ బారిన పడ్డాడు. ఈ క్రమంలో బుమ్రా ఆవేదనగా ఒక ట్వీట్ చేశాడు.
’ దేశం కోసం శక్తికి మించి ఆడుతున్న ఓ ఆటగాడికి లభిస్తున్న గౌరవం ఇది..‘ అని రాసుకున్నాడు.

క్రికెట్ అనేది ఒక జంటిల్మేన్ గేమ్. ఆటను ఎంజాయ్ చేయాలి తప్ప, ప్రతి మ్యాచ్ గెలవాలి, ప్రతి ట్రోఫీ గెలవాలి అంటే అది అత్యాశే అవుతుందని నెటిజన్లు అంటున్నారు. ఇన్ని దేశాలను ఒక చోట చేర్చి, ఒక మెగా టోర్నమెంటు నిర్వహిస్తున్నారు. ఇదెంతో శ్రమతో కూడుకున్నది. అన్నిదేశాల మ్యాచ్ లను చూసి అభినందించాల్సింది పోయి, ఇలా జట్ల గెలుపు, ఓటములను ఎంచి చూడటం సరికాదని అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News