Big Stories

Team India T20 World Cup Glory: టీమిండియాకు కప్పు అందించిన ఐదు కీలక ఘట్టాలు..

Five key moments that changed the phase of the T20 World Cup Final: 17 ఏళ్ల తర్వాత టీమిండియా పొట్టి కప్పును సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో టీమిండియా సౌతాఫ్రికాను చిత్తు చేసి 11 ఏళ్ల నిరీక్షణకు తెరదీసింది. చివరగా టీమిండియా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఆ తరువాత మరో కప్పు సాధించడానికి 11 ఏళ్ల సమయం పట్టింది.

- Advertisement -

ఇక బార్బడాస్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఒక దశలో సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. 30 బంతుల్లో 30 పరుగుల చేయాల్సిన తరుణం నుంచి 7 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందంటే మ్యాచ్ ఎంత మజా ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -

అసలు ఓటమి అంచుల నుంచి టీమిండియాను గట్టెక్కించి కప్పు సాధించేందుకు తోడ్పడిన ఐదు కీలక ఘట్టాల గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

1. జస్ప్రీత్ బుమ్రా మ్యాజిక్: వైట్-బాల్ ఫార్మాట్‌లో ఇండియా ఆల్ టైమ్ బౌలర్ అని చెప్పడంలో అతిశయోక్తిలేదు. బుమ్రా చేతిలో ఓ మ్యాజిక్ ఉంది. అతను టీమిండియాకు లైఫ్‌లైన్‌గా మారడు. ఫైనల్‌లో టీమిండియాను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు.

30 బంతుల్లో 30 పరుగులు కావాల్సిన సమయం. అప్పటికే అక్షర్ పటేల్ వేసిన ఓవర్లో 24 పరుగులు కొట్టిన క్లాసెన్ మరో రెండు ఓవర్లలో మ్యాచ్‌ను ముగించేలా కనిపించాడు. ఈ తరుణంలో బౌలింగ్ చేయడానికి భయపడకుండా 16వ ఓవర్ బౌలింగ్ చేసి కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ తరువాత 18వ ఓవర్లో జాన్సెన్ వికెట్ తీసి కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. మొత్తంగా 4 ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు.

2. హార్దిక్ పాండ్యా బౌలింగ్: గత కొన్ని నెలలుగా కొన్ని కఠినమైన సమయాలను ఎదుర్కొన్నప్పటికీ, హార్దిక్ ధృడంగా నిలిచాడు. టీమిండియా కప్పు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

భారత డిఫెన్స్‌లో చివరి నాలుగు ఓవర్లలో అతను రెండు ఓవర్లు బౌలింగ్ చేసి సఫారీలను కట్టడి చేశాడు. 16వ ఓవర్‌లో బుమ్రా ఒత్తిడిని సృష్టించిన తర్వాత, హార్దిక్ 17వ ఓవర్ తొలి బంతికే క్లాసెన్‌ను అవుట్ చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఇక ఆఖరి ఓవర్‌లో 16 పరుగులను డిఫెండ్ చేయాల్సిన తరుణంలో మిల్లర్ వికెట్ తీయడంతో పాటు టీమిండియాకు కప్పు అందించాడు.

3.అర్ష్‌దీప్ సింగ్: ఈ టోర్నమెంట్‌లో టీమిండియా తరఫున అద్భుత ప్రదర్శన చేసిన మరో రత్నం అర్ష్‌దీప్ సింగ్. తొలి ఓవర్లలో అర్ష్‌దీప్ సింగ్ స్వింగ్ ప్రత్యర్థులను ఇబ్బందులకు గురిచేసింది.

భారత స్పిన్నర్లపై క్లాసెన్, డి కాక్ ఎదురుదాడికి దిగిన తరుణంలో రోహిత్ శర్మ అర్ష్‌దీప్ సింగ్‌కు బంతి అందించాడు. కెప్టెన్ నమ్మకాన్ని సింగ్ వమ్ము చేయలేదు. 13వ ఓవర్లో డికాక్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ తరువాత కీలకమైన 19వ ఓవర్లో బౌలింగ్ చేసి కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 2 వికెట్లు తీసి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

Also Read: హై ఓల్టేజ్ ఫైనల్ లో జయం మనదే.. టీ 20 ప్రపంచకప్ విజేతగా టీమ్ ఇండియా

4. సూర్యకుమార్‌ యాదవ్‌ క్యాచ్‌: సపారీల విజయానికి చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం. క్రీజులో మిల్లర్. సఫారీలలో మిల్లర్ ఉన్నాడనే ధీమా. 20వ ఓవర్ తొలి బంతిని పాండ్యా లో ఫుల్ టాస్ వేయగా మిల్లర్ దాన్ని లాంగాఫ్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అందరూ సిక్స్ అనుకున్నారు. కానీ సూర్యకుమార్ అద్భుతమైన రీతిలో క్యాచ్ ఒడిసిపట్టుకుని టీమిండియాకు కప్పు అందించాడు. అతను క్యాచ్‌ను కాదు కప్పును పట్టుకున్నాడని చెప్పొచ్చు.

5. విరాట్ కోహ్లి-అక్షర్ పటేల్ బ్యాటింగ్: టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు విరాట్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. జాన్సెన్ వేసిన తొలి ఓవర్లో కోహ్లీ 3 బౌండరీలు సాధించాడు. టీమిండియా వెంటవెంటనే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ తరుణంలో కోహ్లీతో అక్షర్ పటేల్ జతకట్టాడు. వీరిరువురు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధించారు. ముఖ్యంగా అక్షర్ సిక్స్‌లతో చెలరేగాడు. 31 బంతుల్లో 47 కీలక పరుగులు చేసిన అక్షర్ రనౌట్ అయ్యాడు. ఇక కోహ్లీ 59 బంతుల్లో 76 పరుగులు చేసి టీమిండియా భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News