Big Stories

Odisha Train Accident: అత్యంత వేగంగా.. రెస్క్యూ ఆపరేషన్‌ ముగిసిందిలా.. మోదీ ఆరా..

Odisha Train Accident: గతంలో రైలు ప్రమాదం జరిగితే రెండు, మూడు రోజుల తరబడి సహాయక చర్యలు జరిగేవి. కానీ, ఈసారి అలా కాలేదు. శుక్రవారం రాత్రి ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. దుర్ఘటనలో సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వెయ్యి మంది క్షతగాత్రులయ్యారు. 24 గంటలు ముగియకముందే.. శనివారం మధ్యాహ్నానికే రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ చేశారు.

- Advertisement -

NDRF, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ బృందాలు నిరంతరాయంగా పనిచేసి.. సహాయక చర్యలను వేగంగా పూర్తి చేశాయి. రైలు బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. అంబులెన్సులు, హెలికాప్టర్లలో క్షతగాత్రులను ఆసుపత్రులకు చేర్చారు. ట్రాక్ క్లియర్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్ ముగిసినట్టు ప్రకటించారు. ఇంత పెద్ద ప్రమాదంలో.. ఇంత వేగంగా సహాయక చర్యలు పూర్తవడం బహుషా ఇదే మొదటిసారి కావొచ్చు.

- Advertisement -

–శుక్రవారం సాయంత్రం 6.55 గంటలకు రైలు ప్రమాదం జరిగింది. ఘటనా స్థలం భువనేశ్వర్‌కు 170 కి.మీ, కోల్‌కతాకు 250 కి.మీ దూరంలో ఉంది.

–ప్రమాద విషయం తెలియగానే.. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు (NDRF) వెంటనే రంగంలోకి దిగాయి. రాత్రి 8.30 కల్లా బాలాసోర్ నుంచి మొదటి బృందం స్పాట్‌కు చేరుకుంది. ఆ తర్వాత కటక్‌, కోల్‌కతా నుంచి మరికొన్ని బృందాలు వచ్చాయి. మొత్తం 300 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్టీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారంతా తొమ్మిది బృందాలుగా విడిపోయారు. కొందరు మహిళా సిబ్బంది కూడా ఉన్నారు.

–రైలు బోగీల్లో చిక్కుకుని ప్రాణాలతో ఉన్న క్షతగాత్రులను బయటకు తీసేందుకు ప్రయత్నం చేశారు. ఇరుక్కుపోయిన వారిని గుర్తించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ జాగిలాలు వారికి సహాయపడ్డాయి. భారీ క్రేన్లు.. గ్యాస్‌, ప్లాస్మా కట్టింగ్‌ యంత్రాలతో రైలు బోగీలను విడదీశారు. వైద్య బృందాలు క్షతగాత్రులకు అక్కడే ప్రాథమిక చికిత్స అందించాయి. చనిపోయిన వారి మృతదేహాలను అక్కడి నుంచి తరలించారు.

–ప్రమాదం జరగ్గానే.. అధికారులు 200 అంబులెన్సులను ఘటనా స్థలానికి పంపించారు. 50 బస్సులు, 45 మొబైల్‌ హెల్త్ సెంటర్లను రెడీ చేశారు. మొత్తంగా సుమారు 1200 మంది సిబ్బంది రెస్య్కూ ఆపరేషన్లో భాగస్వామ్యం అయ్యారు. ఇందులో దాదాపు 100 మంది వరకు డాక్టర్లే ఉన్నారు.

–ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు ఎంఐ 17 హెలికాప్టర్లు తీవ్రంగా గాయపడిన వారిని ఆకాశమార్గాన హాస్పిటల్స్‌కు చేరవేయడంలో సహాయపడ్డాయి. ఆర్మీ మెడికల్ టీమ్స్, అంబులెన్సులు కూడా సేవలు అందించాయి.

–ఇలా పలు విభాగాల సమన్వయంతో, అత్యంత వేగంగా సహాయక చర్యలు పూర్తి చేశారు. ఘటనా స్థలాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్ తీరును అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఘటనపై ప్రాథమిక రిపోర్టును ప్రధానికి వివరించారు కేంద్రమంత్రులు, రైల్వే, ఎన్డీఆర్‌ఎఫ్ అధికారులు.

–ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు ప్రధాని మోదీ. వారికి అందుతున్న చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు.

–రైలు ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించిన మోదీ.. ఘటనకు కారణమైనవారు ఎవరైనా వదిలిపెట్టబోమని.. కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News