Big Stories

Sunita Williams Stuck in Space: అంతరిక్షంలో చిక్కుపోయిన భారతీయ మహిళ..

Astronaut Sunita Williams Stuck in Space(Telugu flash news): ప్లాన్ చేసింది కొన్ని రోజులే.. కానీ, మూడు వారాలు దాటేసింది. ఇంకొన్ని రోజులు పోతే, స్టార్‌లైనర్‌లో ఇంధనం కూడా నిండుకుంటుంది. అప్పుడేం చేస్తారు..? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత సంతతికి చెందిన ఆస్ట్రనాట్ సునీతా విలియమ్స్ చిక్కుకుపోయిన ఘటన అంతర్జాతీయంగా ఆందోళన పెంచుతోంది. స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో ఉన్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎప్పుడు తిరిగి వస్తారో ఇప్పటికీ తెలియని పరిస్థితి. ఇంతకీ, అంతరిక్షంలో సునీతా విలియమ్స్ పరిస్థితి ఏంటీ..? ఆమె స్పేస్‌లో చిక్కుకుపోయినట్లేనా..? నాసా చేసిన మిస్టేక్ ఏంటీ..?

- Advertisement -

సునీతా విలియమ్స్.. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. ఇప్పటికే మూడు సార్లు అంతరిక్షంలో పర్యటించిన ఆమె సామర్థ్యం ప్రపంచమంతా ప్రశంసించింది. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ నాసాకు చెందిన అంతరిక్ష పరిశోధకురాలు. ఆస్ట్రనాట్‌గా ఆమె జీవితం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. మహిళగా ఆమె సాధించిన విజయాలు యావత్ మహిళా లోకానికి ప్రేరణగా ఉంటాయి. అలాంటి వ్యక్తి ఇప్పుడు అంతరిక్షంలో చిక్కుకుపోయారు. ఎనిమిది రోజుల్లో భూమికి తిరిగిరావాల్సిన సునీతా విలియమ్స్ మూడు వారాలు దాటుతున్నా ఇంకా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోనే ఉండాల్సి వచ్చింది. ఆమెతో పాటు ISSకు వెళ్లిన మరో వ్యోమోగామి బుచ్ విల్మోర్ కూడా అక్కడే ఉండిపోయారు. వీళ్లద్దరూ భూమికి ఎప్పుడు తిరిగి వస్తారా అనే సందేహం ఇప్పుడు అందరినీ కలవరపరుస్తుంది.

- Advertisement -

సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు జూన్ 5న ప్రారంభమైన టెస్ట్ ఫ్లైట్ స్టార్‌లైనర్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణం అయ్యారు. అయితే, స్టార్‌లైనర్‌‌లో హీలియం లీక్‌లు, థ్రస్టర్ వైఫల్యాలు వంటి అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఇలాంటి, ఎదురుదెబ్బలు ఉన్నప్పటికీ, స్టార్‌లైనర్ వ్యోమగాముల భద్రతకు భరోసా ఇస్తుందని నాసా అధికారులు హామీ ఇచ్చారు. కానీ, దానికి తగ్గట్లు పరిస్థితులు కనిపించట్లేదు. బోయింగ్ కంపెనీ తయారు చేసిన స్టార్‌లైనర్ స్పేస్ షిప్‌లో ఉన్న ఇద్దరు వ్యోమగాములు సురక్షితంగా అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నప్పటికీ.. ఇప్పుడు తిరిగి వచ్చే సమయంలో అనిశ్చితి నెలకొంది. మిషన్ వ్యవధి దాటేసి వారాల సమయం అవుతోంది. ప్రారంభంలో కొన్ని రోజులు మాత్రమే ఉండేలా ప్రణాళిక చేసింది నాసా. కానీ, మిషన్‌లో ఎదురైన సాంకేతిక సవాళ్లతో వీళ్లు భూమికి ఎప్పుడు తిరిగి వస్తారో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

జూన్ 5న ప్రయోగించిన స్టార్‌లైనర్ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న కొద్దిసేపటికే ఎక్కువ హీలియం లీక్‌లు, థ్రస్టర్ వైఫల్యాలను ఎదుర్కొంది. అంతేకాదు, భూమి నుండి ఫ్లైట్ సమయంలోనే విద్యుత్ అందక స్పేస్‌క్రాఫ్ట్ సర్వీస్ మాడ్యూల్ సమస్యలను ఎదుర్కొంది. ఇందులో ఐదు థ్రస్టర్‌లు పనిచేయకుండా పోయి, అనేక హీలియం లీక్‌లు కనిపించాయి. వీటిలో నాలుగు థ్రస్టర్‌లు మాత్రమే ఇప్పుడు సాధారణంగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, నాసాకు చెందిన కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ చెబుతున్న ప్రకారం.. ఈ సమస్యలను పూర్తిగా పరిష్కరించడానికి స్టార్‌లైనర్ మిషన్‌ను 45 రోజుల నుండి 90 రోజులకు పొడిగించాలని నాసా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: హాథ్రస్ ఘటనలో గంట గంటకు పెరుగుతున్న మృతులు.. 121కి చేరిన సంఖ్య

న్యూ మెక్సికోలో దీనికి సంబంధించిన పరీక్షలను నిర్వహించడానికి, డేటాను సమీక్షించడానికి టైమ్‌లైన్‌ని చూస్తున్నామని స్టిచ్ మీడియా బ్రీఫింగ్‌లో వెల్లడించారు. అయితే, ఇప్పటి వరకూ నాసా కచ్ఛితమైన ల్యాండింగ్ తేదీని నిర్ణయించలేకపోతోంది. నిజానికి, సునీతా వియలియమ్స్ మూడో అంతరిక్ష యాత్ర ప్రకటించినప్పటి నుండీ అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయి. అందులోనూ, నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా బోయింగ్‌ సంస్థ రూపొందించిన ఈ స్టార్‌లైనర్‌ స్పేస్‌క్రాఫ్ట్‌కు ఇదే తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర. ఇక, ఈ ప్రయాణం ప్రారంభంలోనే సాంకేతిక అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో అనుకున్న తేదీ కూడా వాయిదా పడింది.

ఇక ఆ తర్వాత లోపాల్ని సవరించిన స్టార్ లైనర్ వారిని జూన్ 5 సురక్షితంగా స్పేస్‌కి పంపించింది. అయితే, ప్రయాణం మొదలు కాకముందే స్టార్‌లైనర్‌ స్పేస్‌క్రాఫ్ట్‌లో చివరి నిమిషంలో కొన్ని సమస్యలు తలెత్తాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. హీలియం గ్యాస్‌ లీకులు.. థ్రస్టర్లు మొరాయించడం అప్పటికే ఉందనీ.. అయితే, దానికి నాసా, బోయింగ్ అధికారలు పట్టించుకోకుండా పంపించారనే అనుమానాలు వస్తున్నాయి. బోయింగ్‌ సైంటిస్టులు అప్పటికప్పుడు కొన్ని మరమ్మతులు చేయడంతో వ్యోమనౌక అంతరిక్షంలోకి చేరుకుందని కొన్ని నివేదికలు చెప్పాయి. ఇక, ప్రారంభంలో ఎలాంటి సమస్య ఎదురయ్యిందో మళ్లీ అదే సమస్యతో ఇప్పుడు సునీతా విలియమ్స్ అక్కడ చిక్కుకుపోయారనే ఆరోపణలు వస్తున్నాయి.

అయితే స్టార్‌లైనర్‌లో సమస్యలు ప్రస్తావించక ముందు సునీత విలియమ్స్‌ గురించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి ఓ సమాచారం వచ్చింది. అంతరిక్ష కేంద్రానికి అత్యంత సమీపంలో రష్యాకు చెందిన ఓ పనికిరాని ఉపగ్రహానికి చెందిన వంద శకలాలు పడి ఉండడంతో యాత్రకు ఆటంకాలు కలుగుతున్నట్లు ప్రకటించింది. రష్యాకు చెందిన కాలం చెల్లిన ఈ శాటిలైట్‌ శకలాల కారణంగానే సునీత విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి కూడా చిక్కుకుపోయినట్లు ISS వెల్లడించింది. నిజానికి, జూన్ 14వ తేదీన సునీతా భూమి మీదకు చేరుకోవాల్సి ఉంది. కాగా, రష్యా శాటిలైట్ శకలాల కారణంగా ఈ ప్రయాణం 26వ తేదీకి వాయిదా పడిందని అన్నారు.

తర్వాత, స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. దీనితోనే వారి ప్రయాణం వాయిదా పడినట్టు నాసా ప్రకటించింది. ప్రస్తుతం సునీతా విలియమ్స్‌, బుచ్ విల్మోర్.. మరో ఏడుగురు సిబ్బందితో పాటు అంతరిక్ష కేంద్రంలో సురక్షితంగా ఉన్నారని నాసా చెబుతోంది. సమస్య పరిష్కారం అయ్యి అన్నీ అనుకూలిస్తే.. వీళ్లు జూలై 6న భూమ్మీద ల్యాండ్‌ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. బోయింగ్, నాసాలు కలిసి స్టార్‌లైనర్‌లో థ్రస్టర్ లోపాలను బాగా అర్థం చేసుకోవడానికి న్యూ మెక్సికోలో గ్రౌండ్ టెస్ట్‌లను నిర్వహించే పనిలో ఉన్నాయి. బోయింగ్ వైస్ ప్రెసిడెంట్, ప్రోగ్రామ్ మేనేజర్ మార్క్ నప్పి ఈ పరీక్షల ప్రాముఖ్యతపై వివరాలు వెల్లడించారు. న్యూ మెక్సికోలో జరిగే ఈ పరీక్ష ఇచ్చే సమాధానాలు వారిని సురక్షితంగా భూమిపైకి చేరుస్తాయని అంటున్నారు.

Also Read: ‘నీట్ పీజీ’ నిర్వహణకు కీలక నిర్ణయం.. పరీక్షకు 2 గంటలకు ముందే ఎగ్జామ్ పేపర్ రెడీ

ఈ పరీక్షల వల్ల 80 శాతం సమాధానం వస్తే.. అంతరిక్ష కక్ష్యలో ఉన్న స్టార్‌లైనర్‌లో డాక్ చేసిన హాట్ ఫైర్ టెస్ట్‌తో 100 శాతం సమాధానం దొరుకుతుందనీ.. అయితే, ఈ సమాచారం పొందగలిగేలా స్టార్‌లైనర్ అక్కడ ఉండాలని నాసా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే, అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఇంజినీర్లంతా స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలను పరీక్షిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని భూమికి పంపిస్తున్నారు. ఈ వాహనం అంతరిక్షంలో ఉండగానే భూసార పరీక్షలను నిర్వహించడం లక్ష్యంలో భాగంగా థ్రస్టర్‌లు పనిచేయకపోవడానికి గల కారణాలను తెలుసుకోడానికి న్యూ మెక్సికోలో కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, అటు నింగిలో.. ఇటు భూమిపైన చేస్తున్న పరీక్షల ఫలితాల తర్వాత గానీ.. సునీతా విలియమ్స్ ఎప్పుడు తిరిగివస్తారో తెలుస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News