Big Stories

Tirunellai Narayana Iyer Seshan : నేషన్ మెచ్చిన శేషన్..!

Tirunellai Narayana Iyer session

Tirunellai Narayana Iyer Seshan : దేశంలో ఎక్కడ, ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. ఒక్కసారైనా జనానికి గుర్తొచ్చే పేరు.. టీ ఎన్ శేషన్. ఒక సమయంలో దేశంలోని రాజకీయ నాయకులకు ఈయన సింహస్వప్నంగా మారారు. ఇంతా చేసి.. ఆయన చేసిందేమీ లేదు. జస్ట్.. దుమ్ముపట్టిన రూల్స్ బుక్ బయటికి తీసి.. తు.చ తప్పక అందులోని రూల్స్ అన్నింటినీ అమలుచేసి ఎన్నికలు జరిపారు. దీంతో అప్పటివరకు వక్రమార్గంలో నడిచిన భారత ఎన్నికల ప్రచార సరళి సమూలంగా మారిపోయింది. నేటికీ ఆయన వేసిన దారిలోనే కొనసాగుతోంది.

- Advertisement -

టి.ఎన్‌.శేషన్‌గా సుప్రసిద్ధుడైన ఈయన పూర్తిపేరు.. తిరునెళ్లై నారాయణ అయ్యర్‌ శేషన్‌. 1932 డిసెంబర్‌ 15న కేరళలోని పాలక్కాడ్‌లో జన్మించారు. సివిల్‌ సర్వీస్‌ పరీక్షలో మంచి ర్యాంకుతో 1954లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. 1955లో తమిళనాడు కేడర్‌ ఐఏఎస్‌ అధికారిగా ఉద్యోగజీవితంలో ప్రవేశించారు. తమిళనాడులో వివిధ హోదాల్లో పనిచేసి, కేంద్రప్రభుత్వంలో కీలక శాఖల్లో విధులు నిర్వహించారు.

- Advertisement -

దేశానికి 10వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా 1990 డిసెంబర్‌ 12న బాధ్యతలు చేపట్టిన శేషన్‌.. ఆరేళ్ల పాటు కొనసాగారు. ఎన్నికల నిర్వహణ, ప్రచారం తదితర వ్యవస్థల్లో వందకు పైగా లోపాలను ఆయన గమనించి వాటకి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించారు.

ఒకరికి బదులు మరొకరు ఓటేయడాన్ని ఆపేందుకు ప్రతి ఓటరుకూ ఫోటో గుర్తింపు కార్డును తీసుకొచ్చారు. అలాగే.. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాల అధికారులను పర్యవేక్షణ కోసం నియమించారు. ఇక.. డబ్బు, మద్యంతో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రభావితం చేయకుండా అభ్యర్థుల ఎన్నికల ఖర్చుకు పరిమితులు విధించారు.

ఎన్నికల కోసం.. ప్రభుత్వ వనరులను, యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయటం, కుల, మత వైషమ్యాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటున్న పద్ధతికి స్వస్తి చెప్పి, ఆలయాలు, చర్చిలు, మసీదులో ఎన్నికల ప్రచారం కుదరదని తేల్చి చెప్పారు. పోలింగ్‌ బూతుల ఆక్రమణకు పాల్పడిన వారిపై కేసులు పెట్టి లోపల వేయించి, వాటిని సత్వరం విచారించి శిక్షపడేలా చేయటం ఈయన హయాంలోనే మొదలైంది.

గతంలో ఎన్నికలంటే లౌడ్‌ స్పీకర్లే గుర్తొచ్చేవి. శేషన్‌ తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ఎన్నికల్లో లౌడ్‌ స్పీకర్ల వినియోగంపై పలు ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అలాగే.. గోడలకు స్టిక్టర్లు అంటించటం, గోడల మీద పెయింటింగ్‌లు వేసి అభ్యర్థుల ప్రచారం చేయటం ఆగిపోయాయి.
బిహార్, పంజాబ్‌ రాష్ట్రాల్లో 1992లో జరిగిన ఎన్నికలను శేషన్‌ నేతృత్వంలోని ఎన్నికల సంఘం రద్దు చేసింది. అంతేకాదు.. 1992 ఎన్నికల్లో ఖర్చులకు లెక్కలు చూపని 1,488 మంది అభ్యర్థులను మూడేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు.

అలాగే.. 1999 ఎన్నికల్లో తప్పుడు ఎన్నికల ప్రచారపు లెక్కలు చూపి.. దొరికిపోయిన 14 వేల మందిని మూడేళ్లపాటు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించారు. సంస్థాగత ఎన్నికలు జరపని పార్టీల గుర్తింపు రద్దు చేస్తానని హెచ్చరించి ఎన్నికలు జరిపించారు. ఇలా.. పలు సంస్కరణలతో అవినీతి, అక్రమాలతో అపవిత్రమైన ఎన్నికల క్షేత్రాన్ని ప్రక్షాళన చేసి.. మన ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేశారు. విధి నిర్వహణలో చండశాసనుడిగా పేరుపొందారు.

శేషన్‌ తెచ్చిన ఎన్నికల సంస్కరణల ధాటికి తట్టుకోలేక నాటి పార్టీలన్నీ గడగడ వణికాయంటే ఆశ్చర్యం కాదు. కొందరైతే.. ‘నేషన్‌ వర్సెస్‌ శేషన్‌’ అన్నారు. మరికొందరు ‘అల్‌శేషన్‌’ అంటూ ఆల్సేషియన్‌ జాతి శునకంతో పోల్చి ఆయనను అవమానించారు. కానీ.. ఆయన దేనికీ జంకకుండా ముందుకే సాగిపోయారు.

ఇంత ధైర్యంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నారు? మీ బ్రేక్‌ఫాస్ట్ ఏమిటి?’ అని అడిగిన పత్రికల వారితో ‘రాజకీయ నాయకులే నా బ్రేక్ ఫాస్ట్’ అని చెప్పారంటే.. ఆయన వల్ల నాటి నేతలు ఎన్ని తిప్పలు పడ్డారో అర్థమవుతుంది. ‘నేను బంతిలాంటి వాడిని. ఎంత వేగంగా గోడకు కొడితే అంత వేగంగా వెనక్కు వస్తాను’ అనేవారు శేషన్.

ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిగల సంస్థ అని ధైర్యంగా చాటిచెప్పారు. దీనికి అంగీకరించని నాటి ప్రభుత్వాలు దీనిని ఒప్పుకోలేదు. దీనిపై క్లారిటీ ఇచ్చేవరకు దేశంలో ఏ ఎన్నికా జరగటానికి వీల్లేదని ఎన్నికలను వాయిదావేసి పారేశారు. దీంతో నాటి కేంద్రప్రభుత్వం దిగివచ్చి, ఎన్నికల సంఘానికి స్వయంప్రతిపత్తి ఇచ్చింది.

పీవీ నరసింహారావు హయాంలో ఆయన మంత్రివర్గ సభ్యులు సీతారాం కేసరి, కల్పనాథ్‌ రాయ్‌లు ఓటర్లను ప్రభావితం చేశారని, వారిని కేబినెట్‌ నుంచి తొలగించాలని శేషన్‌ ఏకంగా ప్రధానికి సిఫార్సు చేశారు. దీంతో శేషన్‌ తన పరిధులు దాటి ప్రవర్తిస్తున్నారంటూ.. ఆయన్ను పార్లమెంటులో అభిశంసించాలనే డిమాండ్‌ తలెత్తింది.

అది అసాధ్యమని భావించిన పీవీ ఎం.ఎస్‌.గిల్‌, జీవీజీ కృష్ణమూర్తిలను ఎన్నికల కమిషనర్లను నియమించి శేషన్‌కు ముకుతాడు వేసే ప్రయత్నం చేశారు. దీంతో మండిపడ్డ శేషన్.. వారిద్దరనీ గాడిదలుగా వర్ణించి, వారిని ఆఫీసులో కాలుపెట్టనీయలేదు.
ఈ వ్యవహారంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఎన్నికల కమిషన్‌ బహుళ సభ్య సంస్థగా ఉండాలన్న రాజ్యాంగ నిబంధనలను గుర్తుచేస్తూ సుప్రీంకోర్టు శేషన్‌ పిటిషన్‌ను కొట్టేసింది.

1996లో రిటైర్ అయ్యారు. అప్పటి వరకు ఎవరికీ పెద్దగా తెలియని ఎలక్షన్ కమిషన్ శేషన్ పుణ్యమా అని దేశమంతా మార్మోగిపోయింది. ఈ రంగంలో ఆయన తెచ్చిన సంస్కరణలకు గుర్తింపుగా, శేషన్ 1997లో రామన్ మెగాసేసే అవార్డ్‌ను అందుకున్నారు. 1997లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కే.ఆర్. నారాయణన్ ప్రత్యర్థిగా శేషన్ పోటీ చేసి ఓడిపోయారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో అహ్మదాబాద్ నుంచి ఎల్.కే. అద్వానీపై పోటీ చేసి పరాజయం పాలయ్యారు. చెన్నైలో ఓ ఆశ్రమంలో భార్యతో కలసి జీవించిన శేషన్.. 2019 నవంబరు 10న కన్నుమూశారు.

‘శేషన్‌లాంటివాళ్లు ఎప్పుడో ఒకసారిగాని కన్పించరు! శేషన్‌లాంటి వ్యక్తిత్వం గలవాళ్లు ఎన్నికల కమిషనర్‌గా రావాలి!’ అని గతంలో ఎన్నికల కమిషనర్‌ నియామకాలపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందంటే.. ఆయన సేవలు ఎంత గొప్పవో అర్థమవుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News