Big Stories

Ramasetu : ప్రపంచంలో మరో అద్భుతం.. కళ్లముందుకు రానున్న అలనాటి రామసేతు

Dhanushkodi to Srilanka New Ram Setu Project : ప్రపంచంలో మరో అద్భుతం జరగబోతోంది. వేల ఏళ్లనాటి నమ్మకానికి నిజ రూపం రానుంది. ప్రపంచ రహస్యాల్లో ఒకటైన రామసేతు మార్గంలో ఆధునిక మనిషి ప్రయాణం చేయబోతున్నాడు. భారత్, శ్రీలంక మధ్య భూమార్గంలో వంతెన నిర్మాణంపై చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. అయితే, ఈ వంతెన నిర్మాణం సాధ్యం అవుతుందా..? ఈ ఆధునిక రామసేతు ఎలా ఉండబోతోంది..? ఇప్పటివరకు ఇరు దేశాల మధ్య ఉన్న విమాన, పడవల రాకపోకలు.. ఇకపై రోడ్డు మార్గం ద్వారా సాగుతాయా..? వారధి వస్తే లాభం ఏంటి..?

- Advertisement -

వినడానికే కాదు.. రామసేతుని త్వరలో చూడబోతున్నామనీ… ఆ వారధిపై ప్రయాణించబోతున్నామనే ఊహ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అవును, హిందువుల విశ్వసిస్తున్న వేల సంవత్సరాల నాటి అంశం ఇది. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపడిన విషయం అది. సాక్షత్తూ భగవంతుడిగా పూజింపబడుతున్న శ్రీరాముడు ఆధ్వర్యంలో కట్టిన వారధి. త్వరలో నిజరూపం దాల్చడం అబ్బురపరిచే వార్త. దశాబ్దాలుగా శాస్త్రీయ పరిశోధనల్లో ఉన్న రామసేతు నిజానిజాలు ఇంకా రహస్యంగానే ఉన్నాయి. అయితే, రామసేతు మూలాలు మాత్రం సజీవంగానే పలకరిస్తున్నాయి. ప్రధాని మోడీ మూడో టర్మ్‌లో దాన్నే టార్గెట్ చేశారు.

- Advertisement -

గత పదేళ్ల పాలనలో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న కీలకమైన చారిత్రక నిర్ణయాల్లో అయోధ్య రామాలయం ఒకటైతే.. మూడో టర్మ్‌లో రామసేతును చేపట్టనున్నారు. దీని దిశగా ఇటీవల కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత్ శ్రీలంక మధ్య భూ మార్గంలో అనుసంధానం కోసం చేసిన ప్రతిపాదనలపై శ్రీలంక కీలక ప్రకటన చేసింది. ఇరు దేశాల మధ్య భూమార్గానికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై చేస్తున్న అధ్యయనం చివరి దశకు చేరుకుందని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే వెల్లడించారు. భారత పర్యటనలో ఉన్న రణిల్ విక్రమసింఘే.. తమిళనాడులోని మన్నార్‌ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా భారత్ శ్రీలంక మధ్య ప్రతిపాదిత భూమార్గం అధ్యయనంపై ప్రాథమిక అంశాలు ముగిశాయని.. త్వరలోనే తుది దశ నివేదిక పూర్తవుతుందని ప్రకటించారు. అయితే, గత ఏడాది జూలైలో భారత పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య వారధి నిర్మాణంపై ప్రధాని మోడీతో జరిగిన సమావేశంలో రణిల్‌ విక్రమసింఘె చర్చలు జరిపారు.

ఇక, జూన్ 20వ తేదీన భారత విదేశాంగ శాఖా మంత్రి జైశంకర్ శ్రీలంకకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీలంక పర్యటన సందర్భంగా ప్రతిపాదిత వారధి నిర్మాణంపై ఈ పర్యటనలో జైశంకర్‌ చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక, ఇరు దేశాల మధ్య భూ మార్గం ఏర్పడాలనే ప్రతిపాదన ముందుగా శ్రీలంక నుంచే వచ్చిందని భారత ప్రభుత్వం గతంలోనే పేర్కొంది. పర్యాటక రంగ అభివృద్ధిపై ఫోకస్‌ చేసిన కేంద్రం భారత్‌ శ్రీలంక మధ్య కొత్తగా వంతెనను నిర్మించాలని ఎప్పటి నుండో అనుకుంటుంది. దీని కోసం 40 వేల కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. భారత్‌లోని ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్‌ను కలిపేలా వంతెన నిర్మాణం చేపట్టాలని మోడీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా.. సముద్రంపై 23 కిలోమీటర్ల పొడవున వంతెన నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నట్లు గతంలోనూ వార్తలు వచ్చాయి.

9 సంవత్సరాల క్రితమే భారత్- శ్రీలంక మధ్య రోడ్డు, రైలు వంతెనలను నిర్మించే ప్రణాళికపై చర్చలు జరిగాయి. ప్రాజెక్టు ప్రారంభానికి ముందు సాంకేతికత, ఆర్థిక, పర్యావరణం తదితర అంశాలను పరిశీలించాల్సి ఉండగా.. దీనికి సంబంధించిన నివేదిక పూర్తి కానుంది. ధనుష్కోడి.. తలైమన్నార్‌-శ్రీలంక పాల్క్‌ జలసంధిని కలుపుతూ 23 కిలోమీటర్ల పొడువున రోడ్డు, రైలు మార్గం నిర్మించాలనేది కేంద్ర ప్రభుత్వం ప్లాన్‌. 40 వేలకోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. కొత్త వంతెన నిర్మాణంతో ఇరు దేశాల మధ్య పర్యాటక రంగానికి కొత్త ఊపు వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఇరు దేశాలకు ఉపయోగకరంగా ఉండటం కోసం రామేశ్వరం నుంచి శ్రీలంక మధ్య రామసేతు వారధి నిర్మాణం ఇప్పుడు కీలకంగా మారింది. కొత్తగా నిర్మించబోతున్న రామ సేతు ప్రాజెక్టును త్వరలో ప్రారంభించడానికి సాధ్యాసాధ్యాలపై NHAI కూడా అధ్యయనం చేస్తోంది.

ఆధునిక మానవుడు ఛేదించాలనుకున్న ప్రపంచ రహస్యాల్లో రామసేతు కూడా ఒకటి. ఇది దశాబ్ధాలుగా చర్చల్లో నానుతూనే ఉంది. శ్రీరాముడు వానర సేన సాయంతో రామసేతు నిర్మించాడన్న వాదన ఒక వైపు.. వేల సంవత్సరాలుగా భూ పలకల్లో చోటు చేసుకున్న మార్పుల వల్ల ఏర్పడిన సహజ సిద్దమైన నిర్మాణమని చెబుతున్న వాదన మరోవైపు.. ఇలా పలు వాదనలు కొనసాగుతున్న సమయంలో.. దాదాపు దశాబ్ధం క్రితం.. అమెరికాకు చెందిన డిస్కవరీ కమ్యూనికేషన్స్‌ సంస్థకు చెందిన ‘సైన్స్‌ చానల్‌’ రామసేతుపై ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. పలువురు భూగర్భ, పురాతత్వ శాస్త్రవేత్తలు.. వివిధ ఉపగ్రహ చిత్రాలను పరిగణలోకి తీసుకుని ఆ నిర్మాణం సహజసిద్ధమైనది కాదనీ.. మానవ నిర్మితమైనదేనని తేల్చింది. అప్పటి నుండి రామ సేతుపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి మరింత పెరిగింది.

రామసేతు.. తమిళనాడులోని పంబన్ దీవికి, శ్రీలంకలోని మన్నార్ దీవికి మధ్యనున్న సముద్రంలో చేపట్టిన ఒక నిర్మాణం. దక్షిణాదిలో దీనిని రామసేతు అని, శ్రీలంకలో అడాంగ పాలం అని పిలుస్తారు. దీనినే ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. అయితే, శ్రీలంక ప్రభుత్వం కూడా ఇది రాముడు నిర్మించిన వారధే అని ప్రచారం చేస్తోంది. 30 కిలోమీటర్ల పొడవున్న ఈ వారధి ఇప్పటికీ చాలా వరకు సముద్రం మీద తేలుతూ కనిపిస్తుందనడానికి ఆధారం ఉంది. అది రాముని స్పర్శ సోకిన నిర్మాణమే అన్న నమ్మకాన్ని కలిగిస్తుంది. అందుకే.. ఒకప్పుడు ఈ వారధిని తవ్వి పోర్ట్ అభివృద్ధి పనులు చేయాలనుకున్నప్పుడు.. ఆ ప్రయత్నాన్ని హిందూవాదులు అడ్డుకొన్నారు. ఇక, శ్రీలంకలోని కొందరు ఈ వారధి రావణాసురుడు నిర్మించినదని నమ్ముతారు. రావణుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు భారతదేశంలోకి ప్రవేశించేలా ఈ వారధిని నిర్మించాడని ప్రతీతి. రావణాసురుడు కోరుకున్నప్పుడల్లా ఈ వారధి పైకి తేలుతుందనీ, అవసరం లేనప్పుడు అది నీటి అడుగున ఉండిపోతుందనీ లంకవాసుల నమ్మకం.

ఇక, ఇరు దేశాల ప్రజలకూ.. విశ్వాసాల పరంగా రామ సేతుతో ప్రత్యేక అనుబంధం, అనుభూతులు ఉన్నాయి. ఇలాంటి, నాటి రామ సేతును గుర్తుకు తెచ్చుకుంటూ నిర్మించాలనుకుంటున్న కొత్త రామసేతు నిర్మాణంపై ఇరు దేశాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనడంలో సందేహం లేదు. ఈ ఆధునిక రామసేతు పూర్తిగా రూపొందించిన తర్వాత.. రామసేతుపై ప్రయాణం చేస్తున్నవారికది అనిర్వచనీయ అనుభవంగా ఉంటుదనడంలో సందేహం లేదు. వేల సంవత్సరాల నాటి శ్రీరాముణ్ని గుర్తు చేసుకుంటూ.. రాముడు, హనుమంతుడు నడయాడిన మార్గంలో ప్రయాణం చేయడం అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఈ వారధి కేవలం పర్యాటక, వ్యాపార మార్గంగానే కాకుండా భక్త జనసందోహానికి ప్రత్యేక ప్రదేశంగా మారుతుందనడంలో సందేహం లేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News