Big Stories

G7 summit: జీ7 సదస్సుకు ఇటలీ వెళ్లనున్న ప్రధాని.. మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి విదేశీ పర్యటన

G7 summit: దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోనే విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 9న మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మోదీ.. ఆ వెంటనే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 100 రోజుల ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకొని కార్యాచరణను సైతం తొలి కేబినేట్‌లో సూచించారు. తాజాగా, మూడో దశ పాలనలో భాగంగా తన తొలి విదేశీ పర్యటన కావడం విశేషం. అయితే ప్రధాని 13న బయలుదేరి 14న అర్ధరాత్రి తిరిగి భారత్ వస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ పర్యటనపై అధికార ప్రకటన రాలేదు.
జీ7 దేశాల కీలక సదస్సు
 జీ7 దేశాల కీలక సదస్సులో పాల్గొనేందుకు గురువారం ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీకి బయలుదేరనున్నారు. ఈ నెల 13 నుంచి 15 వరకు ఇటలీలోని అపూలియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియాలో ఓ రిసార్టులో జరిగే జీ7 దేశాల కీలక సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి మోదీ హాజరుకానున్నారు. ఈ సదస్సులో ‘అధునాతన ఆర్థికవ్యవస్థల నిర్మాణం’ అనే అంశంపై జీ7 దేశాలు చర్చించనున్నాయి. అయితే ఇటలీలో జరుగుతున్న ఈ సదస్సు వార్షిక శిఖరాగ్ర సదస్సు కావడం గమనార్హం.
ఈ అంశంపై చర్చించనున్నారా?
గత కొంతకాలంగా ఉక్రెయిన్ యుద్ధం, గాజా సంఘర్షణ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఉద్ధృతమవుతున్న ఈ విషయాలపై జీ7 దేశాల సదస్సులో ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సదస్సుకు అమెరికా, ఫ్రెంచ్ అధ్యక్షులు జో బైడెన్, ఇమ్మానుయేల్ మైక్రాన్‌లతో పాటు జపాన్ ప్రధాని ఫుమియో కిషిద, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వంటి అగ్రనేతలు హాజరుకానున్నారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా ఒక సెషన్‌కు హాజరుకానున్నట్లు సమాచారం. ఇందులో ప్రధానంగా తమ దేశంపై రష్యా జరుపుతున్న దాడిపై ఉక్రెయిన్ చర్చించే అవకాశం ఉంది.
సభ్య దేశాలు ఇవే..
జీ7 కూటమిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్ సభ్యదేశాలు ఉన్నాయి. అయితే ఈ వార్షిక సమావేశానికి భారత్‌తోపాటు ఆఫ్రికా, సౌతాఫ్రికా, ఇండో పసిఫిక్ ప్రాంతంలోని 11 అభివృద్ధి చెందుతున్న దేశాల నేతలను ఇటలీ ఆహ్వానించింది. ఇందులో భాగంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతోపాటు పలువురు నేతలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. కానీ దౌత్య విభేదాలు కొనసాగుతున్న తరుణంలో కెనడా ప్రధాని ట్రూడోతో భేటీ ఉంటుందనే విషయంపై క్లారిటీ లేదు. కాగా, గతేడాది మేలో హిరోషిమాలో జరిగిన జీ7 సమావేశానికి మోదీ హాజరైన సంగతి తెలిసిందే.
- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News