Big Stories

Delhi Minister Atishi in ICU: పూర్తిగా క్షీణించిన మంత్రి ఆతిశీ ఆరోగ్యం.. ఆసుపత్రికి తరలింపు!

Delhi Minister Atishi in ICU as Blood Sugar Levels Dropped: ఢిల్లీ మంత్రి ఆతిశీ ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఆమె రక్తంలో చక్కెరస్థాయిలు పూర్తిగా పడిపోయిన నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున ఆసుపత్రికి తరలించినట్లు ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం లోక్ నాయక్ ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని, గత నాలుగు రోజులుగా ఏమీ తినకపోవడంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిందని వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా తెలియజేశారు.

- Advertisement -

‘ఢిల్లీ మంత్రి ఆతిశీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఆమె రక్తంలోని చక్కెర స్థాయిలు అర్ధరాత్రి సమయంలో 43కు పడిపోయాయి. తెల్లవారుజామున 3 గంటల సమయానికి 36కు చేరాయి. దీంతో వైద్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. లేకపోతే ఆమె పరిస్థితి మరింత విషమించే అవకాశముందన్నారు. అందుకే ఆమెను ఆసుపత్రికి తరలించాం. ఢిల్లీ ప్రజల కోసం ఆతిశీ పోరాడుతున్నారు. హరియాణా ప్రభుత్వం నీటిని విడుదల చేయాలన్న డిమాండ్ తో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న మంత్రి గత ఐదు రోజులుగా ఏమీ తినలేదు. ప్రస్తుతం ఆమె ఎల్ఎన్ జేపీ ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్నారు. త్వరగా ఆమె కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం’ అంటూ ఆ పోస్ట్ లో ఆప్ పేర్కొన్నది.

- Advertisement -

కాగా, ఢిల్లీకి చెందిన నీటి వాటాను హరియాణా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21 నుంచి మంత్రి ఆతిశీ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. హరియాణా ప్రభుత్వం నీటిని విడుదల చేసేంతవరకు దీక్షను విరమించబోనంటూ ఆమె స్పష్టం చేశారు. గత నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న ఆతిశీ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ 36కు పడిపోయాయని వైద్యులు తెలిపారు. కాగా, ఢిల్లీకి అందాల్సిన నీటి కంటే 100 ఎమ్ జీడీ(రోజుకు మిలియన్ గ్యాలన్ల నీరు) తక్కువగా హరియాణా ప్రభుత్వం విడుదల చేస్తోందని ఆతిశీ అన్నారు. ఈ కారణంగా దాదాపు 28 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

Also Read: కేజ్రీవాల్ కు మళ్లీ నిరాశే.. బెయిల్ పిటిషన్ పై స్టే కంటిన్యూ

మరోవైపు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందిస్తూ.. నీటి విడుదలకు సంబంధించి హరియాణా సీఎం నయాబ్ సింగ్ సైనీని కలిసి తమ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరామన్నారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారంటూ సక్సేనా వెల్లడించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News