Big Stories

NEET-UG Paper Leak: నీట్ పేపర్ లీక్ కేసులో అరెస్టుల పర్వం ప్రారంభం.. బీహార్‌లో ఇద్దరిని..!

NEET-UG Paper Leak – CBI Makes First Arrests: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ – యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ కేసుకు సంబంధించి దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. ఈ కేసులో అరెస్టుల పర్వం ప్రారంభమైంది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న అశుతోష్, మనీశ్ ప్రకాశ్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. బీహార్ లోని పట్నాలో వీరిని అదుపులోకి తీసుకుంది. లీకైన పేపర్ ను పొందిన విద్యార్థులను మనీశ్ తన కారులోనే తరలించినట్లు అధికారులు గుర్తించారు. ఆ విద్యార్థుల్లో రెండు డజన్లమందికి అతడే ఒక రూమ్ ను కూడా బుక్ చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇక రెండో నిందితుడైన అశుతోష్ పేపర్ లీక్ లో భాగస్వాములైన విద్యార్థులకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించినట్లు గుర్తించారు. అయితే, పేపర్ లీక్ కు సంబంధించి సీబీఐ ఇప్పటికే క్రిమినల్ కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు బీహార్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నమోదుచేసినటువంటి అభియోగాలను సైతం తమకు బదలాయించాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే గుజరాత్ లోని గోద్రా తాలూకా పోలీస్ స్టేషన్ లో మాల్ ప్రాక్టీస్ పై ఓ ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. సీబీఐ మొత్తం ఈ వ్యవహారంలో ఆరు కేసులకు సంబంధించి దర్యాప్తు చేస్తోంది.

- Advertisement -

Also Read: బీహార్ షాకింగ్ ఘటన, పిడుగు నుంచి తప్పించుకున్న బాలిక

కాగా, నీట్-యూజీ 2024 పరీక్షను మే 5న దేశవ్యాప్తంగా నిర్వహించారు. 24 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. అయితే, బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ పేపర్ లీకైనట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. జూన్ 4న ఎన్టీఏ ఫలితాలు ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతోపాటు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ఈ వ్యవహారంపై సీరియస్ గా దృష్టి సారించింది. జూన్ 22న సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ఇందుకు సంబంధంచి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఆ వెంటనే బీహార్ లోని పాట్నా, గజరాత్ లోని గోద్రాకు ప్రత్యేక బృందాలను పంపిన విషయం తెలిసిందే.

అయితే, బీహార్ కు వెళ్లిన సీబీఐ బృందంపై స్థానికులు దాడి చేశారు. నవాడాలోని కశియాద గ్రామంలో జూన్ 22న ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేశారు. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

ఇదిలా ఉంటే.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరును సమీక్షించడానికి, పరీక్ష సంస్కరణలను ప్రతిపాదించడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణన్ అధ్యక్షతన ఈ కమిటీని నియమించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News