Big Stories

Ksheerabdi Dwadashi : సాగరమథనపు ఆరంభ తిథి.. క్షీరాబ్ది ద్వాదశి

Ksheerabdi Dwadashi

Ksheerabdi Dwadashi : కార్తీక మాసంలో వచ్చే ముఖ్య పర్వదినాలలో క్షీరాబ్ది ద్వాదశి ఒకటి. దేవదానవులు ఈ రోజునే క్షీర సాగరాన్ని మథించడం మొదలుపెట్టారు. చిలకటం అనే పనిని ఆరంభించిన రోజు కనుక దీనికి ‘చిలుకు ద్వాదశి’ అనే పేరు వచ్చింది. దీనినే కొందరు యోగీశ్వర ద్వాదశి అనీ, మథన ద్వాదశి అనీ అంటుంటారు. ఈ రోజున నాలుగు నెలల అనంతరం పాల కడలి నుంచి యోగనిద్రను చాలించిన శ్రీమన్నారాయణుడు బ్రహ్మాదిదేవతల సమేతంగా బృందావనం(తులసివనం)లోకి ప్రవేశిస్తాడు. అందుకే దీనికి తులసి ద్వాదశి అనే పేరూ వచ్చింది. అందుకే ఈ రోజున తులసి పూజ చేస్తారు.

- Advertisement -

క్షీరసాగర మధనంలో ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మిని నేడు విష్ణువు వివాహమాడాడు. అందుకే ఈ రోజున వీరి కల్యాణం జరిపించడం సర్వశుభప్రదమనే భావనతో విష్ణు స్వరూపమైన ఉసిరి కొమ్మకు, లక్ష్మీస్వరూపమైన తులసికి వివాహం చేస్తారు. ఈరోజే మోహనీ అవతారంతో శ్రీమహావిష్ణువు అమృతం దేవతలకు పంచి ఇచ్చాడట. అందుకనే ఈరోజు విష్ణాలయాల్లో స్వామిని మోహినీరూపంతో అలంకరిస్తారు. సుగంధ ద్రవ్యాలు కలిపిన క్షీరాన్ని అమృత భావనతో భక్తులకు స్వామి ప్రసాదంగా పంచుతారు.

- Advertisement -

ఇక కార్తీకంలో ఉసిరి చెట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉసిరి నీడ పడిన నీటిలో స్నానం చేసినా, సాయంవేళ ఉసిరి చెట్టు కింద దీపాన్ని ఉంచినా విశేషఫలితం దక్కుతుందని పెద్దల మాట. క్షీరాబ్ది ద్వాదశినాడు తులసికోటలో విష్ణుమూర్తి రూపాన్నీ, ఉసిరికాయతో కూడిన ఉసిరి కొమ్మనీ ఉంచి `‘ఓం శ్రీం తులసీ ధాత్రి సహిత లక్ష్మీనారాయణస్వామినే నమః’ అనే మంత్రాన్ని చెబుతూ దీపారాధన, సంకల్పం, పూజ చేసి నైవేద్యాలను సమర్పించి విష్ణుమూర్తిని కొలుస్తారు. ఈ రోజున దీపారాధన చేస్తే.. ఏడాదంతా దీపాన్ని వెలిగించిన ఫలితం దక్కుతుందని, ఈ రోజు దీపదానం చేస్తే.. పాపం నశిస్తుందని చెబతారు.

ఇక క్షీరసాగరమథనాన్ని పరిశీలిస్తే అందులో అనేక యోగ, ఆధ్మాత్మిక రహస్యాలున్నాయి. ఇందులో నాగులకు రాజైన వాసుకి తాడుగా, మంధర పర్వతం కవ్వంగా, కవ్వం కిందికి జారిపోకుండా దన్నుగా విష్ణువు కూర్మావతారంలో నిలిచారు. ఇందులో మనం గమనిస్తే.. ఏదైనా ప్రమాదం వస్తే.. తాబేలు టక్కున లోపలికి ముడుచుకుపోతుంది. దీని అర్థం.. మనిషి కూడా తన ఇంద్రియాలను నిగ్రహించుకోవాలని అర్థం. ఇక పాము కుండలికి గుర్తు. మనిషిలోని మంచిచెడులే దేవదానవులు! మనిషి అంతర్మఖుడై, తనలో నిద్రాణంగా ఉన్న ఆధ్మాత్మిక శక్తులను మేల్కొల్పడానికి నిత్యం చేసే ప్రయత్నమే సాగరమథనం.

అలా మనిషి తన అంతర్మథనాన్ని మొదలుపెట్టగా ముందుగా సత్యం అనే గరళం(విషం) వస్తుంది. దాని తర్వాత అధికారం(ఐరావతం), ఆ తర్వాత సంపద (లక్ష్మీదేవి), ఆరోగ్యం (ధన్వంతరి), కీర్తి (చంద్రుడు).. ఇలా అన్నీ వస్తాయి. ఇంతటితో ఆగిపోకుండా వీటిని పక్కనబెట్టి అన్వేషణను కొనసాగిస్తేనే అమృతం వస్తుంది. కానీ.. బలహీనతలకు లొంగిపోయి.. మోహినిని చూసి రాక్షసులు అమృతాన్ని జారవిడుచుకున్నట్లు దిగజారితే మోక్షమనే అమృతం దక్కదు.

ఈ రోజు తెల్లవారుజామునే పుణ్యస్త్రీలు తలంటు స్నానం చేసి, తులసికోట దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణలు చేయాలి. ఆ తరువాత ఇంట్లో పూజ చేసుకుని, సాయంత్రం వరకు ఉపవాసం ఉండి, తులసి కోటను లక్ష్మీ నారాయణుల స్వరూపంగా భావించి అలంకరించాలి. తులసికోట చుట్టూ దీపాలను వెలిగించి, లక్ష్మీనారాయణులను పూజించి, నివేదన చేసి, దీపదానాలు చేయడం వలన సమస్త దోషాలు నశిస్తాయనీ, అపమృత్యు భయాలు తొలగిపోతాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News