Big Stories

Kuwait Building Fire Latest News: కువైట్ అగ్ని ప్రమాదానికి కారణాలేంటి? అసలేం జరిగింది?

- Advertisement -

మృతుల్లో 42 మందికిపైగా ఇండియాకు చెందిన వారే.. ఇందులో 24 మంది వరకు కేరళకు చెందిన వారు కాగా.. మిగిలిన వారు ఉత్తరప్రదేశ్‌, తమిళనాడుకు చెందిన వారు ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే ఘటనపై ఆరా తీశారు? మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలిపారు. కేంద్ర విదేశాంగ సహాయమంత్రి కీర్తివర్ధన్ సింగ్‌ను వెంటనే కువైట్‌కు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. ఆయన వెళ్లారు.. బాధితులను పరామర్శించారు. మృతదేహాలను తరలించేందుకు ప్రత్యేక ఎయిర్‌ఫోర్స్‌ విమానాన్ని కూడా సిద్ధం చేశారు. అయితే ఇక్కడో ప్రశ్న మాత్రం మళ్లీ తెరపైకి వచ్చింది.

- Advertisement -

వలస కార్మికుల జీవితాలు గాల్లో పెట్టిన దీపాలేనా? వారి జీవితాలకు ఎలాంటి గ్యారెంటీ ఉండదా? వారితో గొడ్డు చారికి చేయించుకొని సరైన వసతులు కూడా ఏర్పాటు చేయరా? యస్.. ఈ ప్రశ్నే ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేస్తుంది. కార్మికులు ఉంటున్న బిల్డింగ్ పెద్దగానే కన్పిస్తున్నా.. అందులో మోతాదుకి మించిన కార్మికులను ఉంచారు. ఒక్కో రూమ్‌ను పార్టిషన్ చేసి అందులో కార్మికులను కుక్కేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది మనం ఇక్కడి నుంచి చేస్తున్న అర్థం లేని ఆరోపణలు కాదు. కువైట్‌ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ షెక్‌ ఫహద్ యూసుఫ్‌ స్వయంగా చేసిన కామెంట్స్ ఇవి. యజమానుల అత్యాత కార్మికుల జీవితాలను బుగ్గిపాలు చేసింది అంటున్నారు ఆయన.

ప్రమాదస్థలాన్ని పరిశీలించిన తర్వాత కువైట్ ఫైర్‌ డిపార్ట్‌మెంట్ ఎక్స్‌పర్ట్స్‌ చేస్తున్న కామెంట్స్‌ కూడా కొంచెం షాకింగ్‌గా ఉన్నాయి. అగ్ని ప్రమాదం గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే స్టార్టయ్యింది. ఆ తర్వాత పై ఫ్లోర్లకు విస్తరించింది. దీంతో కార్మికులెవ్వరూ కిందకు దిగలేకపోయారు. అలాగని టెర్రస్‌పైకి వెళ్దామంటే దానిని లాక్‌ చేసి ఉంచారు. దీంతో ముందుకు రాలేక.. అలాగని వెనక్కి వెళ్లలేకపోయారు కార్మికులు. అంతేకాకుండా రూమ్‌ను పార్టిషన్‌ చేసేందుకు ఉపయోగించిన మెటిరీయల్ కూడా కార్మికుల పాలిట శాపంగా మారింది. అవి పూర్తిగా కాలిపోలేదు.. కానీ దట్టమైన పొగను విడుదల చేశాయి. చాలా మంది ఈ పొగను పీల్చుకుని ఊపిరాడక కొట్టుమిట్టాడి తుదిశ్వాసను వదిలారు. వారు కొట్టుమిట్టాడింది కొన్ని నిమిషాలే కావొచ్చు. కానీ అంతలో వారు ఎంత నరకం అనుభవించి ఉంటారో ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది. ఇక అగ్నికి ఆహుతైన వారి పరిస్థితి అయితే మరీ దారుణం. కనీసం వారి మృతదేహాలను గుర్తించే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు వారి కుటుంబ సభ్యుల డీఎన్‌ఏతో మ్యాచ్‌ చేసి వారిని గుర్తించాల్సిన పరిస్థితి.

Also Read: అమెరికా భయం నిజమైంది, గ్రహాంతరవాసులు మన మధ్యే..

కువైట్ ప్రభుత్వాధికారుల మాటలతో తేలేది ఏంటంటే.. అక్కడ కార్మికులకు సరైన వసతులు లేవు.. ఇటు మన కేంద్రప్రభుత్వమైనా.. అక్కడి స్థానిక ప్రభుత్వాలైనా..ఇప్పటికైనా వలస కార్మికుల జీవితాలు ఎలా ఉన్నాయో ఓసారి ఫోకస్ చేయాలి. తగిన చర్యలు తీసుకోవాలి. సరైన వసతులు కల్పించాలి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి.. నిజానికి వారంతా తమ ఇంటిని చక్కదిద్దుకునేందుకు ఇళ్లను వదిలారు. అంతో ఇంతో సంపాదించి తిరిగి వస్తామని చెప్పి ఇంటి నుంచి కదిలారు. కానీ ఇప్పుడు కొందరు శవాలుగా కూడా తిరిగి రాని పరిస్థితి. కేంద్రం ప్రభుత్వం వెంటనే స్పందించింది..సంతోషం.

గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. మరింత సంతోషం.. మృతదేహాలను వారి కుటుంబాలకు అందించేందుకు చర్యలు తీసుకుంటుంది. అది కూడా సంతోషమే. కానీ అక్కడితో చేతులు దులుపుకోకుండా వారి కుటుంబాలను ఆదుకోవాలని మా విజ్ఞప్తి. ఇంటిని విడిచి.. దేశం కాని దేశంలో అష్టకష్టాలు పడేదే వారి కుటుంబం కోసం. ఇప్పుడలాంటి వ్యక్తే ప్రాణాలతో లేడంటే ఆ కుటుంబంలో ఏర్పడే వెలితి అంతా ఇంతా కాదు. సో.. కేంద్రమైనా.. రాష్ట్ర ప్రభుత్వాలైనా.. ఆ కుటుంబాలను ఆదుకోవాలి. విపత్తు వర్ణనకు అందదు.. విధ్వంసం లెక్కకు దొరకదంటారు. మీరు ఎంత చేసినా వారు లేని లోటు తీరదు. కానీ.. అంతో ఇంతో సాయం చేసిన వారవుతారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News