Big Stories

Yakshini Webseries Review: ప్రజలను భయపెట్టిన యక్షిణి కథ.. ఇప్పుడు సిరీస్ లా వచ్చింది.. ఎలా ఉందంటే.. ?

Yakshini Review: సినిమాల కంటే ఓటిటీ సిరీస్ లే ఎక్కువ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రతి శుక్రవారం ఓటిటీలో కొత్త సిరీస్ లు సందడి చేస్తాయన్న విషయం తెల్సిందే. ఇక నిన్న కూడా చాలా సినిమాలు, సిరీస్ లు ఓటిటీ ఎంట్రీ ఇచ్చాయి. అందులో యక్షిణి ఒకటి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను ఆర్కా మీడియా నిర్మించడం విశేషం. దీంతో ఈ సిరీస్ పోస్టర్ రిలీజ్ అయినప్పటినుంచి దీనిపై హైప్ క్రియేట్ అయ్యింది.

- Advertisement -

వేదిక, రాహుల్ విజయ్ జంటగా నటించిన యక్షిణి సిరీస్ లో అజయ్, మంచు లక్ష్మీ కీలక పాత్రల్లో కనిపించారు. సోషియో ఫాంటసీ కథగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ఇప్పటివరకు యక్షిణి కథలను చాలామంది వినే ఉంటారు. కామవాంఛతో రగిలిపోయే యక్షిణి.. పెళ్లికానీ అబ్బాయిల వెంటపడి.. కామవాంఛ తీర్చుకొని.. తన భయంకరమైన ముఖాన్ని చూపించి చంపేస్తుందని కథలుకథలుగా చెప్పుకొస్తారు. అయితే అసలు యక్షిణి ఎందుకు అలా చేస్తుంది.. ? యక్షిణిలు ఎవరు.. ? అనేది ఎవరికి తెలియదు. ఈ సిరీస్ లో వాటి గురించి ప్రస్తావించారు. అవి ఎంతవరకు నిజం అనేది తెలియదు కానీ.. సిరీస్ పరంగా యక్షిణి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం.

- Advertisement -

కథ:

మంచి ఉన్న చోట చేదు ఉంటుంది. దేవత ఉన్నచోట దెయ్యం కూడా ఉంటుంది. అలాగే యక్షిణిలో కూడా రెండు లోకాలు. ఒకటి యక్ష లోకం అయితే రెండోది నాగ లోకం. కుబేరుడు కింద పనిచేసేవారే యక్షిణిలు. పార్వతి దేవి.. శివుని విరహాన్ని తాళలేక రాల్చిన చెమట బిందువులు కిందపడ యక్షిణిలుగా జన్మించారు. అలా జన్మించిందే మాయ(వేదిక) అనే యక్షిణి. ఆమెకు భూలోకంలో ఒక గుడిని సంరక్షించమని కుబేరుడు భూమి మీదకు పంపుతాడు. అయితే మాయను ఎలాగైనా లొంగదీసుకుని యక్ష లోకానికి వెళ్లి దాన్ని మొత్తం నాశనం చేయాలనీ నాగ లోక మాంత్రికుడు మహాకాళ్(అజయ్) ప్రయత్నిస్తూ ఉంటాడు. భయం, బలం చూపించినా మాయ లొంగదని తెలుసుకొని ప్రేమ వల విసురుతాడు. అందులో మాయ చిక్కుకున్న వెంటనే అతడి నిజస్వరూపం బయటపెడతాడు. దీంతో తాను మోసపోయాను అని తెలుసుకున్న మాయ.. మళ్లీ తన పని చేయడానికి వెళ్లగా కుబేరుడు ఆపి.. తన ధర్మాన్ని పాటించుకుందా మానవుల ప్రేమ మోజులో పడినందుకు శాపం విధిస్తాడు. ఆ శాప విమోచనం కావాలంటే.. 100 మంది బ్రహ్మచారులను మోహించి, కామించి చంపాలని, ఆ తరువాత యక్ష లోకానికి అనుమతి ఉంటుందని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక యక్ష లోకానికి వెళ్ళడానికి మాయ 99 మంది బ్రహ్మచారులతో శృంగారం చేసి వారిని చంపేస్తుంది. కానీ, 100 వ బ్రహ్మచారి.. బ్రాహ్మణుడు,చనిపోవడానికి సిద్దపడినవాడు.. ముఖ్యంగా అమ్మాయిని ఇప్పటివరకు ముట్టుకోనివాడు అయ్యి ఉండాలి అనే కండిషన్ ఉండడంతో.. అలాంటివాడి కోసం వేట మొదలుపెడుతుంది. అప్పుడు మాయకు కృష్ణ( రాహుల్ విజయ్) పరిచయమవుతాడు. మాయను మొదటిసారి చూడగానే ప్రేమలో పడిన కృష్ణ.. చివరికి చనిపోయాడా.. ? మాయ యక్ష లోకానికి వెళ్లిందా.. ? మహాకాళ్ అనుకున్నది సాధించాడా.. ? ఈ కథలోకి వచ్చిన జ్వాలా ముఖి( మంచు లక్ష్మీ) ఎవరు.. ? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ:

సోషియో ఫాంటసీ కథ అనగానే గ్రాఫిక్స్ ఎక్కువ ఉంటాయని అనుకుంటాం. అప్పట్లో దేవి, దేవి పుత్రుడు, నాగ దేవత లాంటి సినిమాల్లోనే అద్భుతమైన విఎఫ్ఎక్స్ ను చూపించి ఆశ్చర్యపరిచారు. కానీ, యక్షిణిలో అసలు మిస్ అయ్యిందే విఎఫ్ఎక్స్. విజువల్ వండర్ గా ఉంటుంది అని ఆశించిన ప్రేక్షకులకు పెద్ద నిరాశ అంటే అదే. ఇక కథను కూడా 6 ఎపిసోడ్స్ లో ముగించినా సరిగ్గా కన్క్లూజ్ చేయలేకపోయారు. మధ్య మధ్యలో యక్షిణిలు ఎలా పుట్టారు.. ? నాగలోకానికి, యక్ష లోకానికి వైరం ఎందుకు.. ? అనేది చెప్పి పర్వాలేదనిపించినా.. ఇంకా కథను అద్భుతంగా చూపించి ఉండవచ్చు. రిచ్ లుక్ లో లేకపోయినా అక్కడక్కడా కొన్ని సీన్స్ ఓకే ఓకే అనిపిస్తాయి. క్లైమాక్స్ అయితే మరీ తేల్చేశారు. మొదటి రెండు ఎపిసోడ్స్ లోనే కథ మొత్తాన్ని రివీల్ చేసేశారు. మూడో ఎపిసోడ్ నుంచి హీరో ప్రేమ.. యక్షిణితో ఒక సగటు కుర్రాడు బలయ్యాడా.. ? లేదా.. ? అనే క్యూరియాసిటీతో మిగిలిన ఎపిసోడ్స్ చూడాలి అని అనిపించినా.. మధ్యలో మూడు ఎపిసోడ్స్ వదిలేసి.. లాస్ట్ ఎపిసోడ్ చూసినా తెలిసిపోతుంది. ఇక అటుఇటుగా కొద్దిగా ట్విస్ట్ ఏదైనా ఉంది అంటే అది మంచు లక్ష్మీనే. ఆమె మంచిదా.. ? చెడ్డదా.. ? అని అనే ఆలోచనలో పడేస్తుంది. ఒక్క పాత్రలో కూడా బలం లేదనిపిస్తుంది. ముఖ్యంగా తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని కూడా హీరో.. భార్యతో రొమాన్స్ చేయాలనుకోవడం ప్రేక్షకులకు మింగుడుపడదు. ఎపిసోడ్స్ అన్ని సాగదీతలా అనిపిస్తుంది. దీనికన్నా ప్లాప్ అయిన కొన్ని పథ సినిమాలే బావున్నాయి అనిపించకమానదు.

నటీనటులు

యక్షిణికి ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే అది వేదికను తీసుకోవడమే. ఒక యక్షిణి ఎలా ఉంటుందో ఆమె అలానే కనిపించింది. అందాల ఆరబోత చేస్తూ.. చూడగానే ఎవరైనా పడిపోయేలా కనిపిస్తుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రనే కానీ, ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటె బావుండేది. మహాకాళ్ గా అజయ్ అదరగొట్టాడు. ఇంకా ఆ పాత్రతో భయపెట్టవచ్చు. కానీ, కొంతవరకే అజయ్ ను పరిమితం చేశారు. మధ్యలో వచ్చిన మంచు లక్ష్మీ పాత్ర పర్వాలేదు. మాయపి పగతో రగిలిపోయే పాత్రలో ఆమె తన పరిధిమేరకు నటించింది. కృష్ణ పాత్రలో రాహుల్ విజయ్ ఓకే. కొన్నిసన్నివేశాల్లో అతడి కామెడీ బెడిసికొట్టింది. సీరియస్ సీన్స్ లో కూడా అతడు కామెడీగా చేయడంతో చూడబుద్ది కాదు. మిగతావాళ్లందరికి అంత ప్రాధాన్యత లేని పాత్రలే. చందమామ కథ లాంటి ఒక కథ తీసుకొని నేటి తరం వారికి చెప్పడం బావుంది కానీ, ఇంకొంచెంగ్రిప్పింగ్ గా కథను రాసుకొని ఉంటే ఈ సిరీస్ మరో లెవెల్ లో ఉండేది. మొదటిలో యక్ష లోకం, నాగ లోకం అనే మాటలు వినడంతో ఎపిసోడ్స్ పెరిగే కొద్దీ విజువల్ వండర్ లా ఉంటుంది అని అనుకోలేం. ఒక మోస్తరు గా నార్మల్ సినిమా చూసినట్టే ఉంటుంది. వీకెండ్ లో ఒకసారి చూడొచ్చు.

ట్యాగ్ లైన్: యక్షిణి.. ఏదో అనుకోని వెళ్తే ఏదో ఉంటుంది

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News