Big Stories

Nandyal Assembly constituency: రెడ్ల పోరు.. నంద్యాలలో నెగ్గేదెవరంటే..

Nandyal Assembly constituency update(AP political news):

నంద్యాల పార్లమెంట్‌ పరిధిలో అభ్యర్థులంతా ఎవరికి వారే గెలుపు ధీమాతో ఉన్నారు. దేశంలో పేరున్న చోట జెండా పాతేందుకు అధికార వైసీపీతో పాటు కూటమి నేతలూ సర్వయత్నాలూ చేస్తున్నారు. ఇందులో ఎవరి ఎత్తుగడలు ఫలిస్తాయి. నంద్యాల గడ్డపై జెండా ఎగరేసేది ఎవరు? టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి గెలుపునకు ఉన్న అవకాశాలేంటి. వాచ్‌ దిస్ స్టోరీ.

- Advertisement -

నంద్యాల.. భారతదేశంలో ఒక్క వెలుగు వెలిగిన పార్లమెంట్‌ నియోజకవర్గమింది. నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు లాంటి ఉద్దండులు ఇక్కడ నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం ఈ పార్లమెంటు స్థానంపై అందరి చూపూ ఉంది. రాయలసీమలో ఓ బ్రాండ్ సంపాదించుకున్న బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి రాజకీయ వారసురాలిగా శబరి.. బరిలో నిలిచారు. మరోవైపు… ఆమెకు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి పోచా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. ఇద్దరూ ఇద్దరే అయినా.. గెలుపు ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠ.. రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది. నంద్యాల పార్లమెంట్ సెగ్మెంగ్‌లో ఆరు నియోజకవర్గాలున్నాయి. ఆళ్లగడ్డ, బనగానపల్లె, నంద్యాల, నందికొట్కూరు, శ్రీశైలం, డోన్ ఉన్నాయి. వీటిలో తెలుగుదేశం పార్టీకి.. ఆళ్లగడ్డ, బనగానపల్లె, నందికొట్కూరులో గెలుపు అవకాశాలు ఉండటంతో.. ఎంపీ సీటూ తమదేననే ధీమాలో తెలుగుతమ్ముళ్లు ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

రాయలసీమ ఉద్యమనేతగా పేరు తెచ్చుకున్న బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి.. రాజకీయంగా ఒక వెలుగు వెలిగిన నేత. అలాంటి నేత కుమార్తె నంద్యాల పార్లమెంటుకు పోటీ చేయడంతో రాజశేఖర్ రెడ్డి కూడా కూతురు గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. జిల్లాలో ఉండే పరిచయాలతో ముమ్మరంగా ప్రచారం చేయటంతో పాటు పార్టీ కార్యక్రమాలను చేపట్టారు. పార్లమెంటు భవన్‌లో తన కుమార్తెను ఎంపీగా చూడాలనే ఉద్దేశంతో ఆయన తీవ్రంగా శ్రమించారట. దీంతోపాటు నందికొట్కూరు, బనగానపల్లె, ఆళ్లగడ్డ, నంద్యాలలో బైరెడ్డి కుటుంబానికి ఉన్న బంధుమిత్రవర్గం..శబరికి పొలిటికల్‌గా కలిసొస్తుందనే టాక్‌ నడుస్తోంది.

Also Read: ఆ దెబ్బతో ద్వారంపూడి ఓటమి ఫిక్స్! సేనాని పంతం నెగ్గే!

మరోవైపు… వైసీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న పోచా బ్రహ్మానందరెడ్డి కూడా పలుకుబడి కలిగిన నేతగానే గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ.. ఆయన హయాంలో అభివృద్ధి చెందలేదని విమర్శలున్నాయి. కొన్ని చోట్ల అయితే ఎంపీను గుర్తు పట్టే పరిస్థితులు కూడా లేవని.. సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నిత్యం వివాదాల్లో ఉంటూ జనాలకు బ్రహ్మానందరెడ్డి దగ్గర కాలేకపోయారనే ఆరోపణలున్నాయి. గతంలో ఫ్యాన్ సునామీలో గెలిపొందారు తప్ప.. ఆయన ఛరిష్మా కాదనే వాదనలూ ఉన్నాయి. పైగా… వైసీపీ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి ఆయన గెలుపు అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు.. నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి వెళ్లిన బ్రహ్మానందరెడ్డి.. కార్యకర్తల సమావేశంలో నోరు జారారట. ఫ్యాన్‌ గుర్తుకు ఓటెయ్యాలని అనకుండా..సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పడం వివాదం మారింది. ఊహించని విధంగా ఆ ఘటన జరిగినా.. దానిపై చర్చ మాత్రం తీవ్రస్థాయిలోనే సాగింది. YCP ఎంపీ అభ్యర్థిగా ఉన్న నేత.. అలా…. ఎలా అంటారని కొందరైతే ఆగ్రహానికి గురయ్యారట. మొత్తంమ్మీద ఈ వ్యవహారం వైసీపీ అధిష్టానం వరకూ చేరి.. కాస్త సీరియస్‌ అయ్యిందనే వార్తలు గుప్పుమన్నాయి.

గతంలో నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షురాలుగా బైరెడ్డి శబరి పనిచేశారు. డాక్టర్ వృత్తిలో ఉంటూ జిల్లాలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తండ్రికి తగ్గ తనయగా ఆమెకు పేరు ఉందని స్థానిక నేతలే చెప్పుకుంటున్నారు. బైరెడ్డి అంటేనే ఫైర్ బ్రాండ్‌. అలాంటి తండ్రికి వారసులుగా వస్తున్న శబరి విజయంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చసాగుతోంది. తనకున్న ఇమేజ్‌తోపాటు తండ్రికున్న పరిచయాలు, పేరు.. తన విజయానికి దోహదపడతాయని శబరి ఉన్నట్లు సమాచారం. ఇన్ని అనుకూల పవనాల మధ్య నంద్యాలలో టీడీపీ జెండా ఎగురవేసి… ఢిల్లీలో ఎంపీగా అడుగుపెట్టాలనే ధృడ సంకల్పంతో శబరి ఉన్నారట. కూతురు గెలుపు బాధ్యతను భుజాలపై వేసుకున్న రాజశేఖర్‌రెడ్డి కూడా అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రజల్లో కూడా ఈసారి కచ్చితంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శబరి గెలుస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి.

Also Read: బొబ్బిలి యుద్ధం తప్పదా? హిస్టరీ రిపీట్స్?

నంద్యాల పార్లమెంట్‌లో ఉండే మూడు నియోజకవర్గాల్లో టీడీపీకు బలమైన క్యాడర్ ఉంది. ప్రధానంగా మాజీమంత్రి భూమా అఖిలప్రియ.. తన విజయంపై ధీమా ఉన్నారు. దీంతో పాటు బైరెడ్డి కుటుంబానికి బంధువర్గం కూడా ఉంది. పాత పరిచయాల వల్ల అక్కడ తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఎడ్జ్ ఉన్నట్లు చర్చ సాగుతోంది. అసెంబ్లీతో పాటు పార్లమెంటు అభ్యర్థులకు ఓట్ల శాతం కలిసొచ్చిందనే వాదనలూ ఉన్నాయి. బనగానపల్లె నియోజకవర్గంలోనూ టీడీపీకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో.. ఆ ప్రభావం ఎంపీ అభ్యర్థిపైనా ఉంటుందనే అంచనాలున్నాయి. నందికొట్కూరులో ఈసారి టీడీపీకి ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉండటం ఎంపీ అభ్యర్థికి కలిసొచ్చే అంశంగా మారింది.. శ్రీశైలం నియోజకవర్గంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిపై ఉన్న అవినీతి ఆరోపణల కారణంగా.. ప్రజల్లో వ్యతిరేకత ఉండటంతో కూడా టీడీపీ ఎంపీ అభ్యర్థికి కలిసొచ్చే అంశంగా మారే అవకాశాలు ఉన్నాయి. పాణ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి మీద భూకబ్జాలు రౌడీయిజం ఆరోపణలు ఉండటంతో సైకిల్ పార్టీ వైపే ప్రజలు చూశారని వార్తలు జోరుగా సాగుతున్నాయి.

మరోవైపు.. డోన్ నియోజకవర్గంలో ఈసారి వైసీపీకి ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. డోన్ నియోజకవర్గంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గెలుపు ఖాయమనే వార్తల నేపథ్యంలో ఓట్ల శాతం తగ్గినా.. మిగిలిన చోట్ల సైకిల్ హవా నడుస్తుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. మూడు నియోజకవర్గాల్లో వైసీపీకి పట్టు ఉన్నా.. నేతలపై ఉన్న అవినీతి ఆరోపణలు, భూకబ్జాలు, రౌడీయిజం కారణాలతో జనం ఈసారి మార్పు కోరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా.. టీడీపీ నేతలంతా అభివృద్ధి మంత్రంతో ప్రజల్లోకి వెళ్లారు. సో.. ఈ పరిణామనాలన్నీ బైరెడ్డి శబరికి కలిసి వచ్చే అంశాలుగా తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. నంద్యాల గడ్డపై పసుపు జెండా రెపరెపలు ఖాయమనే టాక్ నడుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News