Big Stories

Varahi Devi : వారాణసీ క్షేత్ర పాలిక.. వారాహీ దేవి

Varahi Devi

Varahi Devi : సాధారణంగా ఏదైనా గుడికి వెళ్లినప్పుడు భక్తులు గర్భాలయానికి ఎదురుగా నిల్చుని దేవీ దేవతలను దర్శించుకుంటారు. ఆ మూర్తుల రూపాన్ని మనోఫలకంపై ముద్రించుకుని, అక్కడి చైతన్యవంతమైన వాతావరణం నుంచి స్ఫూ్ర్తిని పొందటం తెలిసిందే.

- Advertisement -

కానీ.. వారణాసిలోని వారాహీదేవి ఆలయంలో మాత్రం అమ్మవారు.. ఇందుకు భిన్నంగా భూగర్భంలో కొలువై ఉంటుంది. ఆమెను ఆలయపు తలుపులోని రెండు రంధ్రాల నుంచి భక్తులు దర్శించుకుంటారు. ఈ దర్శనం కూడా రోజులో రెండు గంటల పాటే ఉంటుంది.

- Advertisement -

కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు కాగా.. క్షేత్రపాలికగా అమ్మవారు ఇక్కడ పూజలందుకుంటుంది. కాశీ వచ్చే భక్తులను కాపాడుతూ, వారి సమస్యలను దూరంచేసే శక్తిస్వరూపిణిగా వారాహిదేవి ఇక్కడ పూజలందుకోవటం ఇక్కడి విశేషం.

వరాహ ముఖం, ఉగ్రస్వరూపాల కలగలుపుగా దర్శనమిచ్చే దేవత.. వారాహీ దేవి. భూగర్భపు ఆలయంలో కొలువై, చక్రం, ఖడ్గం ధరించిన ఈ దేవికి రోజూ సూర్యోదయానికి ముందే.. అక్కడి పూజారి అభిషేకం, పూజ నిర్వహించి హారతి ఇచ్చేసి గర్భాలయం తలుపులు మూసేస్తారు. ఆ తరువాతే భక్తులకు అమ్మవారి దర్శనం మొదలవుతుంది.

గుడి తలుపులోని ఎగువ రంధ్రం నుంచి అమ్మవారి ముఖం, కింది రంధ్రం నుంచి చూస్తే.. అమ్మవారి పాదాలు కనిపిస్తాయి. భక్తులు సమర్పించిన పుష్పాలను పూజారి భద్రపరచి, మరునాటి వేకువజాము పూజలో వాడతారు. అమ్మవారిని అలంకరించే వేళ.. పూజారి సైతం కళ్లకు గంతలు కట్టుకునే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆషాఢమాసంలో అమ్మవారిని గ్రామదేవతగా భావించి, కాశీ వాసులు విశేషంగా ఆరాధించటం సంప్రదాయం.

స్థలపురాణం ప్రకారం.. పూర్వం దుర్గాదేవి రక్తబీజుడనే రాక్షసుడిని సంహరించేందుకు తన శరీరం నుంచి సప్త మాతృకలను సృష్టించగా, వారిలో ఒకరిగానే వారాహీ దేవి కూడా ఆవిర్భవించింది. ఈ వారాహీ దేవియే.. రక్తబీజుడి గుండెలపై కూర్చుని తన పదునైన దంతాలతో వాడిని సంహరించింది. ఇక.. కాశీఖండం గ్రంథం ప్రకారం.. శివుడు వారణాసి నగరానికి పంపిన 64 మంది యోగినులు.. ఆ నగరం నచ్చటంతో అక్కడే ఉండిపోయారట. వారాహీ దేవి కూడా వారిలో ఒకరని, నాటి నుంచి ఆమె నగరాన్ని కాచి కాపాడుతోందని తెలుస్తోంది.

వారాహీదేవి.. రోజూ సూర్యాస్తమయం కాగానే ఆలయం నుంచి బయటికి వచ్చి.. నగరంలో సంచరించి, తిరిగి తెల్లవారుజాము వేళలకు ఆలయానికి చేరుకుని, విశ్రాంతి తీసుకుంటుందనీ, ఆ సమయంలోనే అమ్మకు పూజలు నిర్వహిస్తారని చెబుతారు. అమ్మవారు ఉగ్ర స్వరూపిణి కనుకనే ఆమె విశ్రాంతి సమయంలోనే దర్శనానికి అనుమతి ఉందనీ, మిగతా సమయాల్లో ఆమె ప్రశాంతతకు భంగం కలగకుండా ఆలయాన్ని మూసివేస్తారని చెబుతారు.

పేరుకు ఉగ్రరూపమే అయినా.. అమ్మ తన భక్తులను కన్నతల్లిలా ఆదరిస్తుందని ప్రతీతి. పాండవులు కూడా అమ్మవారిని కొలిచి, ఆమె ఆశీర్వాదం పొందారని పురాణ కథనం. ఇక.. అమ్మవారిని నేరుగా చూడలేకపోయినా.. భక్తులు మనసులో తలచుకుని కొలచినా ఆశీర్వదిస్తుందని ప్రతీతి.

ఏడాది పొడవునా అమ్మవారికి జరిగే పూజలతో బాటు ఆషాఢ, శ్రావణ మాసాల్లో, దసరా వేడుకల వేళ.. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. పూర్వ ఇక్కడి ఆలయంలో అమ్మవారికి నరబలులు ఇచ్చేవారనీ, కాలక్రమంలో అది రక్తాభిషేకంగా మారిందనీ, ప్రస్తుతం ఇక్కడ సాత్విక పూజ మాత్రమే ఉందని చెబుతారు.

హిందువులు.. లక్ష్మీదేవి స్వరూపంగానూ కొలిచే వారాహీ దేవిని బౌద్ధులు వజ్ర వారాహి అని పిలుస్తారు. దేశంలో పలుచోట్ల అమ్మవారి ఆలయాలున్నా.. పూజలు మాత్రం రాత్రిపూట మాత్రమే చేయటం సంప్రదాయం. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి రోజుల్లో విశేష పూజలుంటాయి.

వారణాసిలోని విశ్వేశ్వరుడి ఆలయానికి సమీపంలో(నడిచి వెళ్లేంత దూరంలోనే) వారాహీ దేవి ఆలయం ఉంది. ఉదయం అయిదు నుంచి ఎనిమిదిలోపు భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News