Big Stories

YCP Office Demolition: ఏపీలో రివేంజ్ పాలిటిక్స్‌కు అడుగు పడిందా..? కూల్చివేత వెనక కథేంటి..?

YCP’s Under-Construction Office Demolition At Tadepalli: ఏపీలో రాజకీయం మొదలైంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచే కొత్త రాజకీయం మొదలైంది. కాని యాక్షన్ ప్లాన్ ఇప్పటి నుంచే మొదలైనట్టు కనిపిస్తుంది. ఇంతకీ అసలు ఏపీలో ఏం జరుగుతుంది? ఏపీలో రివేంజ్ పాలిటిక్స్‌కు అడుగు పడిందా? లేక చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందా? సమయం తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాలు.. తాడేపల్లిలోని వైసీపీ అధినేత జగన్‌ క్యాంప్‌ కార్యాలయానికి కూతవేటు దూరంలో మొదలయ్యాయి కూల్చివేతలు. కూలిపోయేది నిర్మాణంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయం.. తూర్పున సూర్యుడు ఉదయించేలోపే జరగాల్సినదంతా జరిగిపోయింది. నిర్మాణంలో ఉన్న కార్యాలయం నేలమట్టమైంది. ఇక ఆ తర్వాత మొదలైంది అసలు రాజకీయం.

- Advertisement -

రాజకీయాల గురించి మాట్లాడుకునేముందు అసలు ఆ నిర్మాణాలు ఎందుకు కూల్చారో తెలుసుకుందాం.. తాడేపల్లిలోని 202/A1 సర్వే నంబర్‌లో ఉంది ఈ నిర్మాణం. ఈ సర్వే నంబర్‌లో 2 ఎకరాల భూమిని పార్టీ కార్యాలయానికి ప్రభుత్వం కేటాయించింది. అంటే వైసీపీ హయాంలో.. వారి పార్టీ కోసం కేటాయించిన స్థలం. అయితే ఈ స్థలం అంతకుముందు ఇరిగేషన్‌ శాఖ స్వాధీనంలో ఉంది. అయితే ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇరిగేషన్ శాఖ అంగీకరించలేదు. సీఆర్డీఏ, MTME, రెవెన్యూశాఖలు కూడా ఈ భూమిని ఆ పార్టీకి అంగీకరించలేదు. అంతేకాదు అసలు భవన నిర్మాణానికి కనీసం ప్లాన్‌ కోసం కూడా దరఖాస్తు చేసుకోలేదు. నీటిపారుదలశాఖకు చెందిన భూమిలో ఇలా అక్రమంగా, అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టడం చట్ట విరుద్ధం. అందుకే ముందుగా నోటీసులు ఇచ్చాం.. ఆ తర్వాత కూల్చేశాం.. ఇది ప్రభుత్వాధికారులుచెబుతున్న మాట.

- Advertisement -

అయితే వైసీపీ ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయ నిర్మాణం చేపట్టిందని గుంటూరు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాంటూ అధికారులను కోరారు. ఈ ఫిర్యాదుపైనే అధికారులు స్పందించారు. నోటీసులు జారీ చేశారు.. కూల్చేశారు. కానీ ఈ గ్యాప్‌లో దీనిపై హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ పార్టీ.. తమ పార్టీ కార్యాలయాన్ని కూల్చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అత్యవసర పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై కోర్టు కూడా విచారణ చేపట్టింది. అయితే ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.

Also Read: టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు..

కానీ అంతలోనే జరగాల్సిన తతంగాన్ని జరిపించేశారు అధికారులు.. ఇదీ జరిగింది.. ఇక రాజకీయాల విషయానికి వద్దాం.. వైసీపీ పార్టీ కార్యాలయ కూల్చివేత ముమ్మాటికి కక్ష పూరిత రాజకీయమే అంటోంది వైసీపీ. దీనిపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. చంద్రబాబు ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగు అయిపోయాయంటూ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరారు. ఇక వైసీపీ నేతలు కూడా కోర్టులో కేసు ఉండగా అధికారులు ఎలా చర్యలు తీసుకుంటారంటూ మండిపడుతున్నారు.

అయితే జలవనరుల శాఖకు చెందిన స్థలంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై కొరడా ఝులిపించినట్లు తెలిపింది CRDA.. వైసీపీ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఇరిగేషన్‌ శాఖ అభ్యంతరాల్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. 2023 ఫిబ్రవరిలో వైసీపీ ఆఫీసుకు భూమి ఇవ్వలేమని ఇరిగేషన్ ఈఎన్సీ చెప్పారని గుర్తు చేస్తుంది CRDA. వైసీపీ కోరిన భూమిలో తాము ట్రైనింగ్ కార్యాలయం నిర్మించదలిచినట్లు అప్పటి ఈఎన్సీ చెప్పారని.. తీవ్ర అభ్యంతరం తెలిపినప్పటికి వైసీపీ ఆఫీస్ నిర్మాణం చేపట్టారంటోంది CRDA.

Also Read: Jagan: ఎవరూ అధైర్యపడొద్దు.. రాబోయే కాలం మనదే: జగన్

ఇదే కాదు.. అనకాపల్లిలో నిర్మిస్తున్న వైసీపీ పార్టీ కార్యాలయ నిర్మాణానికి కూడా నోటీసులు ఇచ్చింది గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్‌.. అనుమతులు లేకుండా ఆఫీస్ నిర్మించారన్న జనసేన నేత మూర్తి యాదవ్ ఫిర్యాదుతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఎండాడలో 175/4 సర్వే నెంబర్లోని రెండు ఎకరాల భూమిని అక్రమంగా సేకరించి ఆఫీస్ నిర్మాణం చేపట్టారని మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. దీనిపై కూడా అధికారులు చర్యలకు సిద్దమయ్యారు.

అయితే ఈ చర్యలన్నింటిని కక్షపూరిత చర్యలని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు దీనిపై కూడా టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్‌ ఇస్తున్నారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టి.. ఇప్పుడు చర్యలు తీసుకుంటే దానికి కక్షపూరిత రాజకీయాలంటూ ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదంటూ కౌంటర్ ఇస్తున్నారు. గ‌తంలో జ‌గ‌న్ ప్రజావేదిక‌ను కూల్చేశారు కాబ‌ట్టి ఇప్పుడు తాము కూడా.. కూల్చివేత‌ల‌తోనే ప‌ని ప్రారంభిస్తాం.. అన్నట్టుగా టీడీపీ ప‌ని చేస్తోందా? అనేది కొందరి ప్రశ్న. అక్రమంగా నిర్మించుకున్న దానిని కూల్చేస్తే త‌ప్పేముంద‌నేది మరికొందరి వాదన.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News