Big Stories

Bobbili Assembly Constituency: బొబ్బిలి యుద్ధం తప్పదా? హిస్టరీ రిపీట్స్?

Who Will Win in Bobbili Assembly Constituency: బొబ్బిలి ఎన్నికల్లో గెలిచేది ఎవరు? రాజవంశీయుల కంచుకోటగా నిలిచిన నియోజకవర్గంలో 2019 నాటి ఫలితం వస్తుందా లేక.. రాజులకే జనం అవకాశం ఇస్తారా అనేది ఉత్కంఠగా మారింది. సీటుపై మాత్రం ఇరుపార్టీల నేతలూ ఆశలు పెట్టుకున్నా.. తెలుగుదేశం పార్టీకే కాస్త ఎడ్జ్‌ ఉందనేది రాజకీయ నిపుణుల అంచనా. దీంతో బొబ్బిలిరాజు ఎవరు అనేది ఇంట్రస్టింగ్‌ ఇష్యూగా మారింది.

- Advertisement -

బొబ్బిలి నియోజకవర్గం.. రాష్ట్రంలో ప్రాముఖ్యత కలిగిన నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. బొబ్బిలి రాజులు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడం ప్రాధాన్యత సంతరించుకోడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. ఉమ్మడి విజయనగరంజిల్లాలో విజయనగరం నియోజకవర్గంపై ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అక్కడ ఎవరు గెలుస్తారనే పొలిటికల్ అటెన్షన్ సహజం. పార్టీలు ఏవైనా.. రాజవంశీయుల విజయంపైనా అందరి దృష్టి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. వారి విజయావకాశాలపై ఎప్పుడూ చర్చ సాగుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా శంబంగి చినఅప్పలనాయుడు, టీడీపీ నుంచి బొబ్బిలి యువరాజు బేబీనాయన పోటీ చేశారు. ఉమ్మడి జిల్లాలో మొదటి గ్యారంటీ సీటు ఇదే అన్నది టీడీపీ లెక్క. ఇపుడే కాదు 2019 లోనూ ఈ సీటు తమదే అని భావించిన చంద్రబాబు లెక్క తప్పింది. మొదటిసారిగా రాజవంశీయులు పరాజయాన్ని చవిచూశారు.

- Advertisement -

ఈసారి మాత్రం.. ఆ సీన్ రిపీట్ కాదనేది తెలుగుతమ్ముళ్ల వాదన. దానికి కారణం లేకపోలేదు. ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు కారణమైతే.. వ్యక్తిగతంగా బేబీనాయన కొన్నేళ్లుగా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు. దీంతో ఈ సీట్‌ గ్యారంటీ అనే ధీమాలో టీడీపీ అధిష్టానం ఉంది. మరోవైపు…వైసీపీ కూడా గెలుపుపై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే శంబంగికి.. సొంత సామాజికవర్గమే ప్రధాన బలం. బొబ్బిలి నియోజకవర్గం అనగానే తొలుత వెలమ సామాజిక వర్గమే గుర్తుకొస్తుంది శంబంగి కూడా అదే సామాజిక వర్గానికి చెందడం, సీనియర్ పొలిటీషియన్ కావడం, సౌమ్యుడు, అవినీతిమరక లేనివాడనే పేరుంది.

Also Read: ఒంగోలులో మ్యాచ్ ఫిక్సింగ్! గెలుపు ఫిక్స్!

ఆయనకు వ్యక్తిగత ఇమేజ్ ఉండటం సహా వైసీపీ హయాంలో సంక్షేమ పథకాలే విజయానికి దోహదపడతాయనే ఆశలో ఫ్యాన్‌ పార్టీ ఉంది. వైసీపీ అధినేత జగన్‌ కూడా బొబ్బిలిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో విజయనగరం తరువాత బొబ్బిలిలోనే సిద్దం సభ నిర్వహించారు. అంతేకాదు.. సీఎం జగన్‌ కూడా ఇక్కడ కుల ప్రస్తావన తీసుకొచ్చారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన శంబంగిని.. మరోసారి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు ఇంటికి రావాలన్నా.. వాలంటీర్లు ఇంటికే పింఛన్లు తెచ్చి ఇవ్వాలన్నా.. శంబంగికే ఓటేయాలని ప్రజలను కోరారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత ఊరకలేసిందనే చెప్పొచ్చు.

ఎవరి లెక్కలు ఎలా ఉన్నా.. టీడీపీకి కాస్త ఎడ్జ్ ఉండవచ్చనేది రాజకీయవర్గాల అంచనా. పార్టీలకు అతీతంగా ఉండే న్యూట్రల్ ఓటర్లు ఎక్కువగా బేబీనాయనను కోరుకుంటున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్. నిత్యం ప్రజల్లో ఉండడం, సేవాకార్యక్రమాలు చేయటం సహా ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌ కూడా ఆయనకు కలసి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కూటమిలోని ఇతర పార్టీల ఓట్లు కూడా ఆయనకు కలిసి వస్తాయనే అంచనా కూడా ఉంది. దీంతో వైసీపీ ఓటమిని ముందే అంగీకరించిందని టాక్ నడుస్తోంది. దీనికి మరొక కారణం కూడా ఉంది.

పోలింగ్ రోజున టీడీపీ కార్యకర్తను వైసీపీ నాయకులు కొట్టడం.. అదీ శంబంగి సొంతగ్రామంలో జరగటం.. వైసీపీకి నష్టం చేకూర్చిందనే వాదనలు ఉన్నాయి. మరోవైపు..రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నించిన వైసీపీ నాయకులను అడ్డుకున్న టీడీపీ ఏజెంట్ పైనా దాడులు జరిగాయి. ఇందులో స్వయంగా శంబంగి కుటుంబీకులే దగ్గరుండి చేయించారన్న ఆరోపణ ఉంది. ఓటమిని తట్టుకోలేకే ఇలాంటి గొడవలకు దిగారంటూ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారట. వార్ వన్‌సైడ్ అని ఇరు పార్టీల నేతలూ చెబుతున్నా ఫలితం వచ్చే వరకూ ఎవర్నీ తక్కువ అంచనా వేయకూడదనేది రాజకీయ నిపుణుల మాట. జనం ఎవరికి పట్టం కట్టారో చూడాలంటే జూన్‌ 4 వరకూ ఆగాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News