Big Stories

Telangana Police: దారి తప్పుతున్న ఖాకీలు.. పోలీస్ డ్రస్ కు అవినీతి మరకలు!

Corrupted Police in Telangana: క్రమశిక్షణకు మారుపేరు.. చట్టాన్ని పక్కాగా అమలు చేసే నాలుగో సింహం పోలీస్. కానీ అలాంటి ఖాకీలు ఇప్పుడు దారి తప్పుతున్నారు. ఇప్పటి వరకు గడించిన ఖ్యాతీ, పేరు ప్రఖ్యాతలు ప్రస్తుతం మసకబారుతున్నాయి. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలంగాణ పోలీసులు ఎందుకు దారి తప్పుతున్నారు ?

- Advertisement -

నిజానికి తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా ఓ మంచి పేరుంది. డిసిప్లేన్‌తో పాటు.. కేసుల ఇన్వెస్టిగేషన్‌లో తెలంగాణ పోలీసులు ఫాలో అయ్యే టెక్నిక్స్‌కు మంచి పేరుంది. అంతేకాదు ఇన్వెస్టిగేషన్‌లో టెక్నాలజీని వాడటంలో తెలంగాణ పోలీసులకు సాటీ ఎవరూ రారు అనేది నేషనల్ వైడ్ టాక్. కానీ.. ఇంతటి మంచి పేరు క్రమక్రమంగా మసకబారుతుంది. కొందరు అధికారులు చేసే పనికిమాలిన పనులు.. ఖాకీల పరువు తీస్తున్నాయి. అవసరం లేని విషయాలు తలదూరుస్తున్నారు. అవినీతి మరకలు అంటించుకుంటున్నారు.

- Advertisement -

కాంగ్రెస్‌ సర్కార్‌ వచ్చాక యాంటీ కరప్షన్‌ బ్యూరోకు ఫుల్ పవర్స్ వచ్చాయి. దీంతో ఏసీబీ అధికారులు జూలు విదిల్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఒక్కో డిపార్ట్‌మెంట్‌లో జరుగుతున్న అవినీతి వ్యవహారాలను డేగ కన్నుతో గమనిస్తూ.. టైమ్‌ చూసి ఒక్కో అవినీతి అధికారికి చుక్కలు చూపిస్తున్నారు. దురదృష్టం ఏంటంటే.. ఇలా లంచాలు తీసుకుంటూ అడ్డంగా బుక్కవుతున్న వారిలో పోలీసులు కూడా ఉంటున్నారు. ఇలా పట్టుబడ్డ వారిలో ఎస్సై నుంచి ఉన్నతాధికారుల వరకు ఉన్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతూ సస్పెండ్ అవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది.

Also Read: కీచక ఎస్సై.. గన్ గురిపెట్టి మహిళా హెడ్ కానిస్టేబుల్ పై అత్యాచారం

నిజానికి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అవినీతి అనేది చాలా రోజులుగా ఉన్న విషయమే. కానీ ఈ మధ్యే ఇది విపరీతంగా పెరిగిపోయింది. భూ వివాదాల్లో కూడా తలదూర్చే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఇంకా దారుణమైన విషయమేంటంటే.. అవినీతి స్థాయిని దాటి అత్యాచారాలు చేసే స్థాయికి దిగజారారు కొందరు పోలీసులు. దీనికి సరైన ఉదాహరణ కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌ ఎస్సై భవానీ సేన్ ఉదంతం. ఏకంగా తన పోలీస్ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఓ మహిళా అధికారిపై ఈ దారుణానికి ఒడి గట్టాడు. అయితే ఆ తర్వాత సీఎం రేవంత్ సీరియస్ అవ్వడం, డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీ జరగడం, ఉద్యోగం ఊడటం అన్నీ వెంటవెంటనే జరిగిపోయాయి. కానీ ఈ ఘటన మొత్తం పోలీస్ డిపార్ట్‌మెంట్‌కే ఓ మాయని మచ్చ.

కింది స్థాయి అధికారులు ఇలా ఉంటే.. ఇక ఉన్నతస్థాయి అధికారుల పరిస్థితి మరోలా ఉంది. కొందరు ఎస్పీల తీరు తీవ్ర వివాదస్పదమవుతోంది. విధుల నిర్వహణను గాలికి వదిలేసి.. సొంత పనులపై ఫోకస్ పెడుతున్నారని తెలుస్తోంది. ఉన్నతస్థాయి అధికారుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక భయంతో పనిచేయాల్సిన అధికారులు ఎలా పనులు చేస్తారు ? అందుకే చాలా మంది కిందిస్థాయి అధికారులు ఎస్పీ, కమిషనర్లను కూడా లెక్కచేయడం లేదు. అయితే దీనికి పొలిటికల్‌ లింక్స్‌ కూడా ఓ కారణమని చెప్పాలి. అసలు ఎంక్వైరీలు జరగవు.. ఒకవేళ జరిగినా తమను నేతలు ఆదుకుంటారన్న ధీమా వారిలో కనిపిస్తుంది.

Also Read: High command call to MLC Jeevanreddy: కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు, ఢిల్లీకి జీవన్‌రెడ్డి

మచ్చుకు కొన్ని ఎగ్జాంపుల్స్‌ చూద్దాం. నారాయణపేట జిల్లాలోని ఊట్కూరు పోలీస్‌ స్టేషన్‌ గుర్తుందా ? భూ వివాదంలో దాయాదుల దాడిలో ఓ వ్యక్తి మరణించాడు. అంతకుముందు తమను కొట్టి చంపుతున్నారు.. కాపాడండి అంటూ డయల్ 100కు ఫోన్ చేసినా.. స్థానిక ఎస్సై స్పందించలేదు. దీనికి మూల్యం ఆ బాధితుడి మరణం. ఆ తర్వాత సీసీఎస్‌లో ఏసీపీగా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయ్యారు.

నిజానికి ఆయనపై గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. చర్యలు తీసుకోకపోగా.. 1500 స్కామ్‌ జరిగిన ఓ రియల్ ఎస్టేట్‌ వ్యవహార కేసును ఆయనకే అప్పగించారు. దీంతో ఆయన అందినకాడికి దోచుకున్నారన్న ఆరోపణలు మొదలయ్యాయి. ఆయనపై ఏసీబీ రైడ్స్ చేసింది. ఇక అదే సీసీఎస్‌లో సీఐ సుధాకర్‌ 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికాడు. ఇక రిటైర్డ్ అధికారి భన్వర్‌లాల్‌ కేసులో ఐపీఎస్‌ ఆఫిసర్ నవీన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కొందరు అధికారులైతే ఏసీబీ వాళ్లను చూసి రోడ్లపై పరుగులు పెట్టిన ఘటనలు కూడా ఉన్నాయి.

Also Read : బాపట్ల యువతి అత్యాచారం, హత్య కేసులో పురోగతి

ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం. ఆఖరికి బీఆర్‌ఎస్‌ హయాంలో అతి ముఖ్యమైన దారుణాల్లో ఒకటైన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టైన వారంతా పోలీసులే. ఇందులో ఎస్ఐ నుంచి మొదలుపెడితే డీజీ స్థాయి అధికారుల వరకు ఉన్నారు. గతంలో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఎప్పటికప్పుడు రివ్యూలు జరిగేవి. దీని కోసం పోలీస్‌ డిపార్ట్‌మెంట్లలో ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవి. ఎవరైనా అధికారి శృతి మించుతున్నారన్న సమాచారం అందింతే స్పెషల్ బ్రాంచీ వారిపై ఫోకస్ చేసేది. అవసరమైతే వారిని బదిలీ చేసేవారు.. లేదంటే కొంతకాలం పక్కన పెట్టేవారు.

అత్యవసరమైతే అధికారికంగా వారిపై విచారణ చేపట్టేవారు. ఇవన్నీ చేయడంతో సిబ్బందిలో తమను గమనిస్తున్నారన్న భయం ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అందుకే ఇప్పుడే సీఎం రేవంత్ స్పెషల్‌గా పోలీస్ శాఖపై ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికైనా తమ తీరు మార్చుకోకపోతే వేటు తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు సీఎం రేవంత్. ఇప్పటికే కొందరిని సర్వీస్‌ నుంచి తొలగించడంతో పాటు. చాలా మంది సస్పెన్షన్‌లో ఉన్నారు. మరి వీరిని చూసైనా మిగిలిన వారు అప్రమత్తమై బాధ్యతలనెరిగి ప్రవర్తిస్తూ.. చట్టాన్ని ఫాలో అయితే వారికి, వారి ఉద్యోగాలకు మంచిది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News