Big Stories

New Telecom Act : హలో..హలో.. కాస్త మాటలు జాగ్రత్త !.. కొత్తచట్టంలో ఎమర్జెన్సీ మార్క్ !

New Telecom Act : అన్ లిమిటెడ్ టాక్ టైమ్‌, పరిమితి లేని మెసేజ్‌లతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా..? అయితే, కాలం మారింది. ఈమధ్య ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మోడీ.. ఎమర్జెన్సీ నిర్ణయమే తీసుకున్నారు. తన హ్యాట్రిక్ పాలనలో వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా చేసే కొత్త చట్టం అమలుకు సిద్దమయ్యారు. అవును, కొత్తగా వచ్చిన టెలికాం చట్టం వల్ల ఎమర్జెన్సీలో మీ ఫోన్ నుండి వెళ్లే ప్రతీ సమాచారం ప్రభుత్వం చెవిలోకే వెళ్లబోతోంది. అంటే పరోక్షంగా ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులు రాబోతున్నాయా..? ఇంతకీ, కొత్త టెలికాం చట్టంలో ఏముంది..? మనం పెట్టే ప్రతీ మెసేజ్ ప్రభుత్వం చూడొచ్చా..? ప్రతీ కాల్ సర్కార్ వినొచ్చా..? ఎందుకీ ఎమర్జెన్సీ కాల్..? లెట్స్ ఫోకస్.

- Advertisement -

దేశంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం పగ్గాలు చేపట్టి.. ప్రధాని నరేంద్ర మోడీ హ్యాట్రిక్ విన్‌తో గద్దెనెక్కిన తర్వాత.. సరి కొత్త రాజకీయ చిత్రం తెరపైకి వచ్చింది. అదే, 1975 నాటి ఎమర్జెన్సీ కాలం. 2024 సార్వత్రిక ఎన్నికలు దాదాపుగా రాజ్యాంగం చుట్టూనే తిరిగాయనడంలో సందేహం లేదు. ప్రతిపక్ష కాంగ్రెస్ మోడీని విమర్శిస్తూ.. మూడో సారి మోడీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాంరంటూ ప్రచారం చేయగా.. మోడీ కొత్తగా అధికారం చేపట్టిన తర్వాత మళ్లీ రాజ్యాంగమే రాజకీయ వేదికపై కీలక అంశంగా మారింది. ప్రధాని మోడీ 18వ లోక్ సభకు వెళ్లిన మొదటి రోజే, ఇందిరా గాంధీ నాటి ఎమర్జెన్సీపై నిప్పులు చెరిగారు. నాటి ఎమర్జెన్సీని ఇకపై ఎప్పుడూ దేశంలోకి తొంగి చూడకుండా చూస్తానంటూ శపథం చేశారు. 50 ఏళ్ల క్రితం చేసిన ఇలాంటి పని మళ్లీ భారతదేశంలో ఎవరూ చేయడానికి సాహసించకుండా చూస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగం నిర్దేశించిన విధంగా సామాన్య ప్రజల కలలను నెరవేర్చడానికి మేము ఒక తీర్మానం చేస్తామని అన్నారు. కట్ చేస్తే.. ఇలా జరిగింది.

- Advertisement -

టెలీ కమ్యూనికేషన్స్ చట్టం-2023లోని కొన్ని భాగాలు జూన్ 26 నుండి అమలులోకి వచ్చాయి. ఈ కొత్త చట్టం, ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం-1885, ఇండియన్ వైర్‌లెస్ టెలిగ్రాఫ్ యాక్ట్-1933, టెలిగ్రాఫ్ వైర్స్ (అన్‌లాఫుల్ పొసెషన్) యాక్ట్-1950 స్థానంలో అమలు కానుంది. అయితే, టెలికమ్యూనికేషన్ రంగంలో సాంకేతిక పురోగతిని ప్రతిబింబిస్తూ వచ్చిన ఈ చట్టంలో సంచలన మార్పులు చోటుచేసుకున్నాయి. జాతీయ భద్రత, వినియోగదారుల రక్షణ, టెలికమ్యూనికేషన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సంబంధించి ఆధునీకరణపై అధిక ప్రాధాన్యతనిస్తోంది. అయితే, ఈ చట్టంలో ఉన్న అంశాలను పరిశీలిస్తే.. ఎమర్జెన్సీకి ఏమాత్రం తీసిపోదన్నట్లే ఉంది. కొత్త చట్టం ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరి ఫోన్ నుండి అయినా మెసేజ్‌లను అడ్డగించడానికి.. ప్రజల భద్రత, లేదంటే అత్యవసర పరిస్థితుల్లో టెలికాం నెట్‌వర్క్‌లను తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవడానికి అనుమతి ఉంది. అలాగే.. టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై హక్కులు పెంచడమే కాకుండా.. సిమ్ యాజమాన్యంపై జరిమానాలు కూడా అమలు చేసే అవకాశాన్ని ఇస్తోంది.

Also Read : భారీగా పెరిగిన జియో రీచార్జ్ ధరలు.. అంబానీపై ట్రోల్స్!

జాతీయ భద్రత, ఇతర దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, యుద్ధ పరిస్థితుల మధ్య అవసరమైతే ఏదైనా టెలికమ్యూనికేషన్ సేవలు, నెట్‌వర్క్‌లను నియంత్రించడానికి, నిర్వహించడానికి ఇందులోని కీలకమైన నిబంధనలలో ఒకటి ప్రభుత్వానికి పూర్తి అధికారం ఇస్తోంది. ఇది దేశ భద్రత, స్థిరత్వాన్ని కాపాడటానికి ఉద్దేశించిన ముఖ్యమైన చర్యగా ప్రభుత్వం పేర్కొంటుంది. గతేడాది డిసెంబర్‌లో పార్లమెంట్‌లో ఆమోదం పొందిన ఈ చట్టంలోని సెక్షన్‌లు 1, 2, 10 నుంచి 30 వరకూ.. 42, 44, 46, 47, 50.. 58, 61, 62 నిబంధనలు జూన్ 27 నుండి అమలులోకి వచ్చాయి. ముఖ్యంగా, చట్టంలోని సెక్షన్ 20 (2) నింబంధన ప్రకారం.. ప్రజల భద్రత దృష్ట్యా, పబ్లిక్ ఎమర్జెన్సీ సమయంలో ఏదైనా మెసేజ్‌ని పంపించకుండా ఆపడానికి ప్రభుత్వానికి అనుమతి ఉంది.

ఏది ఏమైనప్పటికీ, శాటిలైట్ స్పెక్ట్రమ్ అడ్మినిస్ట్రేటివ్ కేటాయింపు, టెల్కోల ద్వారా వినియోగదారులకు సంబంధించిన, తప్పనిసరి బయోమెట్రిక్ ధృవీకరణ, సున్నితమైన టెలికాం వివాద పరిష్కార విధానంతో వ్యవహరించే ఈ నిబంధనలు చాలా కాలంగా ఎదురుచూస్తున్న తర్వాత ఇప్పుడు అమలులోకి వస్తున్నాయి. దీనితో, మెసేజ్‌లను అడ్డగించే ప్రభుత్వ సంస్థల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి నుండి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఇంటెలిజెన్స్ బ్యూరో సహా 10 కేంద్ర ఏజెన్సీలు టెలిఫోన్ కమ్యూనికేషన్‌లను అడ్డుకోవచ్చని 2019లో ప్రభుత్వం లోక్‌సభకు తెలియజేసింది. అలా చేయడానికి ఇప్పుడు తెచ్చిన కొత్త చట్టం అనుమతిని ఇచ్చింది. ఈ చట్టంతో ‘వైర్, రేడియో, ఆప్టికల్ లేదా ఇతర ఎలక్ట్రో-మాగ్నెటిక్ సిస్టమ్‌ల ద్వారా ఏదైనా టెలీకమ్యూనికేషన్‌ను ఆపేయడానికి, వాటిని యాక్సెస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది, ఏదైనా సంకేతం, సిగ్నల్, రైటింగ్, టెక్స్ట్, ఇమేజ్, సౌండ్, వీడియో, డేటా స్ట్రీమ్, ఇంటెలిజెన్స్ లేదంటే, టెలికమ్యూనికేషన్ ద్వారా పంపిన సమాచారం కూడా అయుండొచ్చని చట్టం చెబుతోంది.

Also Read : జియో బాటలో ఎయిర్‌టెల్.. భారీగా పెరిగిన రీఛార్జ్ ధరలు..!

అదే విధంగా.. వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఇంటర్నెట్ ఆధారిత మెసేజింగ్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా పంపే సందేశాలు.. అలాగే ఎన్‌క్రిప్ట్ చేసినవి కూడా చట్టం పరిధిలో ఉంటాయి. అయితే, ఈ చట్టం పార్లమెంటులో ఆమోదించిన తర్వాత, ఓటీటీ సేవలు మాత్రం ఈ చట్టం పరిధిలోకి రావని అప్పటి టెలికాం మంత్రి అశ్వనీ వైష్ణవ్ అన్నారు. ప్రభుత్వం నుండి మరింత స్పష్టత వచ్చే వరకూ మెసేజింగ్ OTTలు గ్రే ఏరియాగానే ఉంటాయని తెలిపారు. అయితే, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్ నిర్వహణ, ఏదైనా నేరం వైపు ప్రేరేపించడాన్ని నిరోధించే క్రమంలో కూడా మెసేజ్‌లను అడ్డగించడానికి కూడా చట్టం అనుమతించింది.

ఇక.. ఈ చట్టం, ఒక వ్యక్తి దగ్గరున్న సిమ్ కార్డ్‌ల సంఖ్యకు సంబంధించి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. చట్టం ప్రకారం, ఎవరైనా తమ పేరు మీద రిజిష్టర్ అయిన గరిష్టంగా తొమ్మిది సిమ్ కార్డులు మాత్రమే కలిగి ఉండాలి. అయితే, ఇది దేశంలోని అన్ని రాష్ట్రాలకూ వర్తించదు. జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల నివాసితులకు కేవలం ఆరు సిమ్ కార్డులకు మాత్రమే పరిమితి ఉంటుంది. ఈ పరిమితులను ఉల్లంఘిస్తే భారీ జరిమానా కట్టక తప్పదు. ఇందులో.. మొదటి ఉల్లంఘనకు రూ.50 వేలు, రెండో ఉల్లంఘనకు రూ. 2 లక్షలు జరిమానా ఉంటుంది. అదనంగా, వేరొకరి గుర్తింపు పత్రాలను ఉపయోగించి సిమ్ కార్డ్‌ను తీసుకుంటే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల వరకూ జరిమానా లేదా రెండూ కలిపి భారీ జరిమానాలు విధించవచ్చని చట్టం చెబుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News