Big Stories

Nellore YCP Leaders: వైసీపీ నేతల సైకిల్ సవారీ..? లిఫ్ట్ ప్లీజ్..!

- Advertisement -

2019లో జరిగిన ఎన్నికల్లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇప్పుడు 11 సీట్లకు పరిమితమైంది. దాంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీని వీడి టిడిపి గూటికి చేరేందుకు నేతలు క్యూలు కడుతున్నారు. టీడీపీ ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. అధికారంలో ఉన్నంతకాలం టీడీపీపై విమర్శల దాడి కొనసాగించిన నేతలు ఇప్పుడు అవసరమైతే వైసీపీ పైన అదే తీరుతో ముందుకెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వచ్చిన వారందరికీ పసుపు కండువాలు కప్పే పరిస్థితి ఇప్పుడు లేదంటున్నారు.

- Advertisement -

నెల్లూరు జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. ఆ పార్టీ నేతల గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి వైసీపీ నేతలు ఝలక్ ఇచ్చారు. ఆదాల సన్నిహితుడు వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ వైవీ రామిరెడ్డి ఏకంగా ఆదాల తీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. పార్టీ ఓటమిపాలవగానే కష్టాల్లో ఉన్న కార్యకర్తలను ఆదాల ప్రభాకర్ రెడ్డి వదిలి పారిపోయారని ధ్వజమెత్తారు.

Also Read: పవన్ పంజా దెబ్బ.. ద్వారంపూడిలో దడ?

అంతటితో ఆగకుండా.. ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఓ మోసగాడుగా పెద్దమనిషి ముసుగు వేసుకున్న నయవుంచకుడిగా అభివర్ణించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు తన చేత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించినట్లు ఆరోపించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పారు. తనుకు జ్ఞానోదయం అయిందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి క్షమించాలని వేడుకున్నారు.

ఇప్పటికే నెల్లూరు నగర మేయర్ స్రవంతి దంపతులు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ లో చేరడానికి రెడీగా ఉన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ మారగానే మేయర్ దంపతులు కొద్దిరోజులు కోటంరెడ్డితో కొనసాగారు. అయితే మళ్లీ యూ టర్న్ తీసుకుని వైసీపీ లోనే ఉన్నారు. ఎన్నికల్లో వైసీసీ ఘోర ఓటమి చవి చూడడంతో చేసేదిలేక మేయర్ దంపతులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కి క్షమాపణలు చెప్పారు. తాము చేసిన తప్పు మన్నించి అక్కున చేర్చుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు వారి బాటలోనే పలు నియోజకవర్గాల వైసీపీ నేతలు టిడిపి తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారట.

Also Read: Jagan: ఎవరూ అధైర్యపడొద్దు.. రాబోయే కాలం మనదే: జగన్

దానికి తోడు వాలంటీర్ల రాజీనామా పర్వం ఇప్పుడు కేసుల వరకు వెళ్ళింది. వైసిపి కార్పొరేటర్లు, నేతలకు కేసుల ఉచ్చు బిగిస్తోంది. ఎన్నికలకు ముందు బలవంతంగా తమ చేత రాజీనామాలు చేయించారని వాలంటీర్లు ఆరోపిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా తమను బెదిరించి రిజైన్ చేయించారని వైసీపీ నేతలపై పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెడుతున్నారు. దాంతో వైసిపి కార్పొరేటర్లు హడలిపోతున్నారంట. వైసీపీ నేతలు టీడీపీ వైపు చూడటానికి అది కూడా బలమైన కారణంగా కనిపిస్తుంది.

ఇప్పటికే వాలంటీర్లు వరుసగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు. కొన్నిచోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. మరి కొంతమంది వాలంటీర్లు ఏకంగా కోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో 41 వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి, భర్త మధుసూదనరావు వంటి వారిపై కేసులు నమోదయ్యాయి. వేదాయపాలెం దర్గామిట్ట పోలీస్ స్టేషన్ లకు వాలంటీర్లు భారీగా తరలి వస్తున్నారు. ఒత్తిడి చేయడం వల్లే తాము రాజీనామా చేశామని ఇప్పుడు తమ జీవితాలు అడ కత్తెరలో పోక చెక్కల తయారయ్యాయని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Minister Parthasarathi: గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది: మంత్రి పార్థసారథి

అధికారంలో ఉన్నన్ని రోజులు పనులు చక్కబెట్టుకున్న నేతలు ఇప్పుడు ఆ పనులు ఎక్కడ పాడవుతాయోయని అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల ఫలితాలు రివర్స్ అయి ఈ సారి టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం, పార్టీ పటష్టంగా ఉండటంతో వలస నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎర్ర తివాచీ పరచడం సబబు కాదని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. అలా వచ్చిన వారందర్నీ చేర్చుకుంటే.. పార్టీ కోసం కష్టపడిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తికి గురయ్యే పరిస్థితి ఉందంటున్నారు.

ఏదేమైనా ఒక్కసారిగా మారిన రాజకీయ సమీకరణలతో జిల్లా రాజకీయాలు తల్లకిందులయ్యాయి. ఇటీవల కాలం వరకు వైసీపీలో ఉన్న అనేక మంది నేతలు ఇప్పటికే తెలుగుదేశం ఎమ్మెల్యేల పంచన చేరిపోయారు.  పూలమాలలు ఫ్లవర్ బొకేలు అందిస్తూ ఫోటోలు కూడా దిగేశారు. ఫ్లెక్సీలు పెట్టి అభినందనలు తెలుపుతూ కాకా పట్టేస్తున్నారు. అంతేమరి పబ్బం గడుపుకోవాలంటే తప్పదు కదా.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News